వైసీపీలో ముసలం

ABN , First Publish Date - 2023-06-01T00:19:39+05:30 IST

విజయనగరం అర్బన్‌ వైసీపీలో ముసలం ఏర్పడింది. డిప్యూటీ మేయర్‌ ఇసరపు రేవతీదేవి అర్ధాంతరంగా తన పదవికి రాజీనామా చేయడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. అర్బన్‌లో యాదవ సామాజిక వర్గం అధికంగా ఉంది. దీంతో ఆ సామాజిక వర్గానికి చెందిన ముచ్చు నాగలక్ష్మి(1వ డివిజన్‌)కి తొలుత డిప్యూటీ మేయర్‌ పదవిని కేటాయించారు.

 వైసీపీలో ముసలం

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

విజయనగరం అర్బన్‌ వైసీపీలో ముసలం ఏర్పడింది. డిప్యూటీ మేయర్‌ ఇసరపు రేవతీదేవి అర్ధాంతరంగా తన పదవికి రాజీనామా చేయడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. అర్బన్‌లో యాదవ సామాజిక వర్గం అధికంగా ఉంది. దీంతో ఆ సామాజిక వర్గానికి చెందిన ముచ్చు నాగలక్ష్మి(1వ డివిజన్‌)కి తొలుత డిప్యూటీ మేయర్‌ పదవిని కేటాయించారు. రెండో దశ కరోనా సమయంలో ఈమె మృతి చెందింది. దీంతో యాదవ సామాజిక వర్గానికే చెందిన 13వ డివిజన్‌ కార్పొరేటర్‌ ఇసరపు రేవతీదేవికి డిప్యూటీ మేయర్‌-1 పదవిని కేటాయించారు. 2021 ఆగస్టు 4న రేవతి బాధ్యతలు చేపట్టారు. ఎమ్మెల్యే కోలగట్ల ఆదేశాల మేరకు ఆమె నగరంలోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. తన భర్త రామకృష్ణతో కలిసి 13వ డివిజన్‌లో పార్టీ బలో పేతానికి ఎంతగానో కృషి చేశారు. అయితే, గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఒక మహిళా నేత.. తన బంధువు ద్వారా ఎమ్మెల్యే కోలగట్లకు అత్యంత చేరువయ్యారు. అప్పటి నుంచి 13వ డివిజన్‌కు చెందిన వైసీపీలో ముసలం ఏర్పడింది. డిప్యూటీ మేయర్‌ రేవతికి తెలియకుండానే కొన్ని పనులు ఆ డివిజన్‌లో చకచకా జరిగిపోతున్నాయి. ఇది రాజకీయంగా మరింత వేడిని రగిల్చినట్లు అయ్యింది. ఇదిలా ఉండగా, తాజాగా.. ఏ ఎన్నికల్లోనూ వైసీపీకి పనిచేయని ఒకరికి నగరపాలక సంస్థ పరిధిలోని వాటర్‌ వర్క్స్‌లో ఔట్‌ సోర్సింగ్‌ విధానం ద్వారా ఉద్యోగం కల్పించారు. ఇది కూడా డిప్యూటీ మేయర్‌కు తెలియకుండా చేశారనే ప్రచారం జరుగుతోంది. ‘వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. నా కోసం మీరు మౌనం వహించకతప్పద’ని ఎమ్మెల్యే కోలగట్ల.. డిప్యూటీ మేయర్‌ రేవతికి చెప్పినట్లు సమాచారం. దీంతో ఆమెతో పాటు, భర్త రామకృష్ణ కూడా నోరుమెదపని పరిస్థితి ఏర్పడింది. పార్టీని నమ్ముకుని శ్రమించిన వారికి ఎటువంటి ప్రయోజనం కల్పించకుండా, తమకు తెలియకుండా ఎవరికో ఉద్యోగం ఇవ్వడమేంటని ఇటీవల డిప్యూటీ మేయర్‌ దంపతులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారం మరింత ముదిరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో డిప్యూటీ మేయర్‌ పదవికి రేవతి బుధవారం రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్లనే రాజీనామా చేస్తున్నట్టు ఆమె అధికారులకు లేఖ పంపినా బలమైన కారణాలు ఏవో ఉన్నాయనే అనుమానాలు కలుగుతున్నాయి. రాజీనామా చేయాలని ఆమెపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది.

14 మంది కార్పొరేటర్లు అసంతృప్తి..

విజయనగరంలోని 12 నుంచి 14 మంది కార్పొరేటర్లు కూడా ఎమ్మెల్యే వీరభద్రస్వామిపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. 2019 సాధారణ ఎన్నికల్లో, నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసేవారిని ఆయన చేరదీస్తున్నారంటూ కార్పొరేటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే, 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయన ఇలా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే ఎవరైనా నేరుగా తన వద్దకు వస్తే ఏ పనైనా చేస్తానని, కార్పొరేటర్లతో మీకు సంబంధం లేదని ఆయన చెబుతున్నట్లు సమాచారం. దీన్ని తట్టుకోలేని కార్పొరేటర్లు ఎమ్మెల్యే వ్యవహార శైలిపై తీవ్రఅసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

రాజీనామా ఆమోదం

రింగురోడ్డు, మే 31: డిప్యూటీ మేయర్‌-1 ఇసరపు రేవతీదేవి బుధవారం తన పదవికి రాజీనామ చేశారు. తన రాజీనామా పత్రాన్ని మేయర్‌ వెంపడాపు విజయలక్ష్మికి అందచేయగా ఆమె అమోదించారు. ఈ నేపథ్యంలో ఈనెల 8న డిప్యూటీ మేయర్‌-1 ఎన్నికను నిర్వహించాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని.. కలెక్టర్‌ నాగలక్ష్మికి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఈ నెల 4న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. 8న ఉదయం 11 గంటలకు నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో డిప్యూటీ మేయర్‌-1 ఎన్నికను నిర్వహించనున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్‌ శ్రీరాములునాయుడు తెలిపారు.

Updated Date - 2023-06-01T00:19:39+05:30 IST