Share News

‘ముక్కోటి’ శోభ

ABN , Publish Date - Dec 23 , 2023 | 11:45 PM

జిల్లావాసులు శనివారం వైకుంఠ ఏకాదశిని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. వేకువజామున వేంకటేశ్వర, కోదండరామ, వైష్ణవాలయాల వద్దకు చేరుకున్నారు. క్యూలైన్లలో గంటలకొద్దీ నిరీక్షించి.. ఉత్తర ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకుని పులకించిపోయారు.

‘ముక్కోటి’ శోభ
సాలూరు రూరల్‌: పూజలందుకున్న కల్యాణ వేంకటేశ్వర స్వామి

ఆలయాలు కిటకిట

ఉత ్తర ద్వార దర ్శనంతో పులకించిన భక్తులు

మార్మోగిన గోవింద, నారాయణ నామస్మరణ

గరుగుబిల్లి / పాలకొండ/సాలూరు రూరల్‌, డిసెంబరు 23 : జిల్లావాసులు శనివారం వైకుంఠ ఏకాదశిని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. వేకువజామున వేంకటేశ్వర, కోదండరామ, వైష్ణవాలయాల వద్దకు చేరుకున్నారు. క్యూలైన్లలో గంటలకొద్దీ నిరీక్షించి.. ఉత్తర ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకుని పులకించిపోయారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. మొత్తంగా భక్తజనంలో ప్రముఖ ఆలయాలన్నీ కిటకిటలాడాయి. నమో నారాయణ, నమో వెంకటేశాయ నామస్మరణ మార్మోగింది. అంతటా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. జిల్లాలోని పాలకొండ, సాలూరు, కురుపాం, పార్వతీపురం నియోజకవర్గాలతో పాటు 15 మండలాల్లో ఆలయాల్లోనూ ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తర ద్వార దర్శనం ఏర్పాట్లు చేయగా.. ఉదయం నాలుగు గంటలకే పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి వేంకటేశ్వర, కోదండరామస్వామి ఆలయాలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కోదండరామస్వామి ఆలయ ప్రాంగణంలోని ఉత్తర ద్వార దర్శనం గుండా స్వామివారిని దర్శించుకొనేందుకు భక్తులు బారులుదీరారు. ముందుగా ఆలయ అర్చకులు వీవీ అప్పలాచార్యులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆంజనేయస్వామి ఉత్సవమూర్తులను పల్లకిపై ఉత్తర ద్వారం గుండా తిరువీధి మహోత్సవం నిర్వహించారు. తోటపల్లిలో వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద కూడా భక్తులు బారులుదీరారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా వేలాది మంది చేరుకున్నారు. స్వామివారి దర్శనానికై వచ్చిన భక్తులకు ఉచిత ప్రసాదాలు, పూజా సామగ్రి అందించారు. అన్నసమారాధన ఏర్పాట్లు చేశారు. ధర్మ ప్రచార కార్యక్రమంలో భాగంగా వేంకటేశ్వర కోలాటం బృందాల ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. భక్తులు రద్దీ దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గరుగుబిల్లి ఎస్‌ఐ అమ్మనరావు సిబ్బందితో కలిసి ముందస్తు చర్యలు చేపట్టారు. ఆలయ ఈవో వీవీ సూర్యనారాయణ, చైర్మన్‌ ఎం.సత్యనారాయణ, ఏఎస్పీ దిలీప్‌కుమార్‌ , విజయనగరం న్యాయాధికారి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 23 , 2023 | 11:45 PM