ఎమ్మెల్సీ వర్సెస్ ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2023-05-06T00:19:31+05:30 IST
ఎస్.కోట వైసీపీలో వర్గపోరు తారస్థాయికి చేరింది. నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గాలుగా విడిపోయారు. అంతర్గతంగా సవాళ్లు విసురుకుంటున్నారు. పరస్పర ఆరోపణలు గుప్పించుకుంటున్నారు.
తారస్థాయికి చేరిన శృంగవరపుకోట వైసీపీలో వర్గపోరు
భోగాపురం హెలీప్యాడ్ వద్ద సీఎం వైఎస్ జగన్‌తో పంచాయితీ
కడుబండికి మళ్లీ టికెట్ ఇస్తే సహకరించమని చెప్పిన ఇందుకూరు
రఘురాజును సముదాయించేందుకు యత్నించిన ముఖ్యమంత్రి
టీడీపీ వైపు చూస్తున్న వైసీపీ అసంతృప్త నాయకులు
శృంగవరపుకోట మే 5:
ఎస్.కోట వైసీపీలో వర్గపోరు తారస్థాయికి చేరింది. నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గాలుగా విడిపోయారు. అంతర్గతంగా సవాళ్లు విసురుకుంటున్నారు. పరస్పర ఆరోపణలు గుప్పించుకుంటున్నారు.
ఎమ్మెల్యే కడుబండికి మళ్లీ టికెట్ ఇస్తే సహకరించబోమని ఎమ్మెల్సీ ఇందుకూరు వర్గీయులు స్పష్టం చేస్తున్నారు. చివరకు ఈ వ్యవహారం సీఎం జగన్ వద్దకు చేరింది. భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు శంకుస్థాపనకు జగన్ బుధవారం వచ్చినప్పుడు ఆయన వద్ద పంచాయితీ పెట్టారు.
సీఎం వద్ద పంచాయితీ
సీఎం జగన్ హెలీకాప్టర్ దిగగానే స్వాగతం పలికేందుకు ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, పార్టీ నాయకులు వెళ్లారు. తొలుత ఎమ్మెల్సీ రఘురాజును చూడగానే సీఎం ‘మీకేం అన్యాయం చేశాను? ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్సీ ఇచ్చాను. ఇప్పటికే జిల్లాకు ఒక ఎమ్మెల్సీ ఉంది. ఒకే సామాజిక వర్గానికి రెండు ఎమ్మెల్సీలు ఇస్తున్నారన్న విమర్శలు వచ్చినా లెక్కచేయలేదు. ఎంపీపీ, వైఎస్ ఎంపీపీ పదవుల విషయంలోనూ మీ మాటకే విలువ ఇచ్చాం. మరెందుకు ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు ఇబ్బంది కలిగిస్తున్నారు. కలిసి పని చేయండి. లేదంటే మీ ఇష్టం’ అని హెచ్చరించినట్లు సమాచారం. అయితే ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు బాగా పని చేస్తున్నారని, ఆయనకు మళ్లీ టిక్కెట్ ఇవ్వాలని అక్కడే ఉన్న ఆయన వర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు సూచించారు. ఆ వెంటనే శృంగవరపుకోట మండల వైఎస్ ఎంపీపీ, ఎమ్మెల్సీ రఘురాజు భార్య ఇందుకూరి సుధారాజు జోక్యం చేసుకుని ఎమ్మెల్యే కడుబండికి ఈసారి టిక్కెట్ వద్దని చెప్పినట్లు సమాచారం. వీరిద్దరి వాదనలు విన్న సీఎం.. వైసీపీ జిల్లా అధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు వైపు చూసి ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పినట్లు తెలిసింది. అయితే సీఎం చెప్పినా ఎమ్మెల్సీ రఘురాజు వెనక్కి తగ్గకపోవడం హాట్‌టాపిక్‌గా మారింది. ‘ఎమ్మెల్సీ పదవినైనా వదులుకుంటాం. ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కేటాయిస్తే సహకరించం. ఈ విషయాన్ని ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డికి కూడా చెప్పాము. పార్టీలో చేరేముందు శాసనసభ గెలిపించుకుని వస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తామన్నారు కదా?’ అని రఘురాజు వర్గీయులు వాదిస్తున్నారు.
మొదటి నుంచీ వర్గపోరు
ఇందుకూరి రఘురాజు ఎస్‌కోట నుంచి 2009లో స్వతంత్ర అభ్యర్ధిగాను, 2014లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగాను పోటీ చేసి ఓటమిపాలయ్యారు. స్వతంత్ర అభ్యర్థిగా 30వేలకు పైబడి ఓట్లు తెచ్చుకున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీలో ఉన్న రఘురాజు.. బొత్స సత్యనారాయణ చొరవతో వైసీపీలో చేరారు. అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తామని పార్టీ అధ్యక్షుడు జగన్‌తో బొత్స హామీ ఇప్పించారు. ఎన్నికలయ్యాక స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అప్పగించారు. గజపతినగరం నియోజకవర్గానికి చెందిన కడుబండి శ్రీనివాసరావుకు ఎస్.కోట టికెట్ ఇచ్చారు. ఎట్టకేలకు ఈ సీటు వైసీపీ గెలుచుకుంది. అయితే కొంతకాలంగా ఎమ్మెల్యే కడుబండి, ఎమ్మెల్సీ ఇందుకూరి మధ్య ఆధిపత్యపోరు మొదలైంది. వీరిద్దరి వల్ల మండల స్థాయి అధికారులు నలిగిపోతున్నారు. నాయకులు, కార్యకర్తలు రెండుగా చీలిపోయారు. ఎమ్మెల్యే కడుబండిని వ్యక్తిగత దూషణలతో లేఖలు రాసి వాట్సాఫ్ గ్రూపుల్లో పోస్టు చేయడం వివాదాస్పదమైంది. ఇదెవరి పనో లేల్చాలని అప్పట్లో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆతర్వాత కూడా అంగన్‌వాడీ ఉద్యోగ నియామకాలు, పలు అభివృద్ధి పనుల విషయంలో ఇరువర్గాల మధ్య గొడవలు జరిగాయి. ఈ వ్యవహారం పార్టీ పెద్దలకు పెద్ద తలనొప్పిగా మారింది.
టీడీపీ వైపు అసంతృప్త నాయకులు?
ఇవన్నీ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి లాభం చేకూర్చేలా ఉన్నాయని వైసీపీ దిగువశ్రేణి నాయకులు చెబుతున్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వ్యవహారాలతో విసిగిపోయిన కొందరు నాయకులు టీడీపీ వైపు చూస్తున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో వైసీపీ 12వేల మెజార్టీ మాత్రమే వచ్చింది. ఈసారి ఎస్.కోటను కైవసం చేసుకోవాలని టీడీపీ కూడా పావులు కదుపుతోంది.
----------------