చూడండి.. ప్రాణానికే ప్రమాదం!

ABN , First Publish Date - 2023-01-17T23:09:01+05:30 IST

చూడండి మరి.. ఆలస్యమైతే ప్రాణాలకే ప్రమాదం. దీనికి ఆరోగ్యశ్రీ వర్తించదు. డబ్బులు పెట్టుకోవాల్సిందే. మీరు ఎంత త్వరగా చేయించుకుంటే అంత మంచిది’.. ఆసుపత్రికి వెళ్లే సాధారణ రోగులకు ఎదురుయ్యే అనుభవం ఇది. అంతేకాదు.. రోగుల ఆలోచించుకుంటూ ఉండగానే.. ఇంకొందరు అక్కడికి వస్తారు. ‘ఆలస్యం చేయకండి. ఇప్పటికే రోగి పరిస్థితి చాలా కష్టంగా ఉంది’ అని మభ్యపెడతారు. దీంతో రోగుల బంధువులు గందరగోళానికి గురై వారు చెప్పిన అమౌంట్‌ అప్పోసప్పో చేసి కడుతున్నారు. ఆరోగ్యశ్రీ

చూడండి.. ప్రాణానికే ప్రమాదం!
-పొగిరి ప్రకాశరావు, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్‌

చూడండి.. ప్రాణానికే ప్రమాదం!

అత్యవసర చికిత్స చేయకుంటే అంతే

ఆరోగ్యశ్రీ వర్తించదు.. డబ్బులు పెట్టాలి

భయపెడుతున్న కొన్ని నెట్‌వర్క్‌ ఆసుపత్రులు

రోగుల బంధువులను మభ్యపెడుతున్న వైనం

సామాన్యులకు అందని ద్రాక్షగా ఉచిత వైద్యం

అత్యవసర వైద్యసేవలకు వెళ్తున్న వారికి షాక్‌

నిబంధనల పేరిట కొన్ని రుగ్మతలకే వర్తింపు

(రణస్థలం)

‘చూడండి మరి.. ఆలస్యమైతే ప్రాణాలకే ప్రమాదం. దీనికి ఆరోగ్యశ్రీ వర్తించదు. డబ్బులు పెట్టుకోవాల్సిందే. మీరు ఎంత త్వరగా చేయించుకుంటే అంత మంచిది’.. ఆసుపత్రికి వెళ్లే సాధారణ రోగులకు ఎదురుయ్యే అనుభవం ఇది. అంతేకాదు.. రోగుల ఆలోచించుకుంటూ ఉండగానే.. ఇంకొందరు అక్కడికి వస్తారు. ‘ఆలస్యం చేయకండి. ఇప్పటికే రోగి పరిస్థితి చాలా కష్టంగా ఉంది’ అని మభ్యపెడతారు. దీంతో రోగుల బంధువులు గందరగోళానికి గురై వారు చెప్పిన అమౌంట్‌ అప్పోసప్పో చేసి కడుతున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా డబ్బులు వైద్యం చేయించుకుంటున్నారు. జిల్లాలోని కొన్ని నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో జరుగుతున్న తంతు ఇది. దీనిపై ఫిర్యాదు వెళ్తే అధికారులు ‘విచారిస్తాం, చర్యలు తీసుకుంటాం’ అంటున్నారేగానీ.. చేతుల్లో మాత్రం చూపడంలేదు.

- జేఆర్‌ పురానికి చెందిన చిన్ని లక్ష్మణ కలాసీ. గత నెల 21న హైబీపీతో అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబసభ్యులు హుటాహుటిన శ్రీకాకుళంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తలలో నరాలు చిట్లడంతో ప్రాణాపాయ స్థితికి వెళ్లిపోయాడు. వైద్యులు ‘అత్యవసర’ చికిత్స చేయాలని చెప్పారు. కుటుంబసభ్యులకు ఏంచేయాలో అర్ధం కాలేదు. ప్రాణం పోతుందని భయపడి ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా.. సాధారణ చికిత్సకు ఒప్పుకున్నారు. మందులు మినహాయించి ఐసీయూ చార్జిల రూపంలో రోజుకు రూ.20 వేలు వసూలు చేశారు. పది రోజులకు రూ.3.5 లక్షలు చెల్లించారు. లక్ష్మణ రోజంతా కలాసీగా పనిచేస్తే రూ.300 దక్కేది. అటువంటి కుటుంబానికి ‘ఆరోగ్యశ్రీ’ పథకం అక్కరకు రాకుండా పోయింది.

- రణస్థలం మండలం చిన్నలంకపేటకు చెందిన సత్యనారాయణ భవన నిర్మాణ కార్మికుడు. ఆయన రోజు సంపాదన రూ.500. ఆ మొత్తంతోనే కుటుంబం గడిచేది. గత నెల 31న పనులు చేపడుతుండగా ప్రమాదానికి గురయ్యాడు. చేతికి, కాలికి తీవ్ర గాయమైంది. దీంతో తోటి కార్మికులు, కుటుంబసభ్యులు హుటాహుటిన శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ రెండు గాయాల్లో ఒక్కదానికే మాత్రమే ‘ఆరోగ్యశ్రీ’ వర్తిస్తుందని అక్కడున్న వారు చెప్పడంతో ఏంచేయాలో వారికి పాలుపోలేదు. అప్పటికే స్కానింగ్‌, ఇతర వైద్య పరీక్షల పేరిట రూ.6 వేలు బిల్లు చేశారు. స్నేహితులు స్పందించి వేరే నెట్‌వర్క్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా రెండింటికీ చికిత్స అందించారు.

ఈ రెండు ఘటనలు ఉదాహరణలు మాత్రమే. ప్రతిరోజూ బాధితులకు ఇటువంటివి ఎదురవుతునే ఉన్నాయి. ప్రభుత్వం మాత్రం ఆరోగ్యశ్రీకార్డు ఉన్న ప్రతి లబ్ధిదారుడికి రూ.5 లక్షల సాయం అందుతుందని చెబుతోంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు రకరకాలుగా కోర్రీలు పెడుతున్నాయి. ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్లు చెబుతున్నదానికి. ఆస్పత్రుల్లో అందుతున్న సేవలకు పొంతన ఉండడం లేదు. నిరక్షరాస్యులు,అవగాహన లేనివారు వెళ్తుంటే ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఆరోగ్యశ్రీ కంటే సాధారణ వైద్యానికే మొగ్గుచూపుతున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వం బిల్లులు పెండింగ్‌ పెడుతుండడమే సాధారణ వైద్యానికి మళ్లిస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఇదీ పరిస్థితి

ఉమ్మడి జిల్లాలో ఆరోగ్య శ్రీ పరిధిలో 11 ప్రైవేటు నెట్‌వర్క్‌ ఆస్పత్రులు ఉన్నాయి. శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రితో పాటు మూడు ఏరియా ఆస్పత్రులు, 13 సీహెచ్‌సీల్లో ఆరోగ్యశ్రీ అమలుచేస్తున్నారు. ప్రభుత్వం 3,255 రోగాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చింది. అయితే ఇందులో రెగ్యులర్‌ రుగ్మతలకు సంబంధించి మాత్రం ఆపరేషన్లు, వైద్యసేవలను చేర్చలేదన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. గత ఏడాది జనవరి 1 నుంచి డిసెంబరు 31 వరకూ జిల్లాలో 51,767 ఆపరేషన్లు, థెరపీలు చేసినట్టు ఆరోగ్యశ్రీ గణాంకాలు చెబుతున్నాయి,. ఇందుకుగాను రూ.110.79 కోట్లు ఖర్చుచేసినట్టు చెబుతున్నారు. అయితే ప్రైవేటు నెట్‌వర్క్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు మాత్రం తమకు ప్రభుత్వం బిల్లులు సక్రమంగా చెల్లించడం లేదని చెబుతున్నారు. దాని కారణంగానే వారు ఆరోగ్యశ్రీ సేవల కంటే సాధారణ వైద్యసేవలకు మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది.

కోఆర్డినేటర్ల తీరుపై విమర్శలు

ఆరోగ్యశ్రీ సేవలకుగాను ప్రతి నెట్‌వర్క్‌ ఆస్పత్రిలో కోఆర్డినేటర్లను నియమించారు. కానీ వీరు కొన్నిచోట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ సేవలు ఎలాపొందాలో అవగాహన ఉండదు. దీనికి ఏ ధ్రువపత్రాలు తీసుకురావాలో తెలియదు. అటువంటి వారు అత్యవసర వైద్యానికి వచ్చినప్పుడు ఓపికగా సమాధానం చెప్పాల్సిందిపోయి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలో వైద్యసేవల కోసం రోగి చేరిన నాటి నుంచి ఆపరేషన్‌ తరువాత వసతి, భోజనం, మందులు అందించాల్సి ఉంటుంది. దాదాపు ఆరు నెలల వరకూ వారికి మందులు అందించాలి. కానీ ఇదెక్కడా అమలవుతున్న దాఖలాలు లేవు. అటు బాధితులు కూడా అవగాహన లేక వినియోగించుకోలేకపోతున్నారు. ఒక్కో ఆరోగ్యశ్రీ కార్డుకు రూ.5 లక్షల వరకూ వెసులబాటు ఉంటుంది. రోగికి వైద్య పరీక్షలు, ఆపరేషన్లు, మందులు, భోజనం, వసతి ఇవన్నీ లెక్క కట్టి ఆ మొత్తంలో తీసుకుంటారు. అయితే కొన్ని ఆస్పత్రులు ఖర్చుకు మించి ఆరోగ్యశ్రీలో జమ చేసుకుంటున్నాయన్న విమర్శలు ఉన్నాయి.

అర్హులందరికీ సేవలు

జిల్లాలో ఆరోగ్యశ్రీ సేవలు సక్రమంగానే అందుతున్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో ‘ఆరోగ్యశ్రీ‘ కొనసాగుతోంది. ఇప్పటికే ప్రైవేటు నెట్‌వర్క్‌ ఆస్పత్రులుకు స్పష్టమైన ఆదేశాలిచ్చాం. సాధారణ వైద్యసేవల కంటే ఆరోగ్యశ్రీ సేవలకు ప్రాధాన్యమివ్వాలని సూచించాం. అర్హత ఉన్న ప్రతిఒక్కరికీ ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యసేవలందాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. రోగిని తీసుకెళ్ళిన ఆసుపత్రిలో సంబంధిత వ్యాధికి సర్వీస్‌ లేనప్పుడు సమీప ఆసుపత్రికి రిఫర్‌ చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి విరుద్ధంగా వ్యవహరించే ఆస్పత్రుల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటాం

Updated Date - 2023-01-17T23:09:03+05:30 IST