Share News

వెలగని లైట్లు.. తొలగని చీకట్లు

ABN , First Publish Date - 2023-11-22T00:05:14+05:30 IST

రాజాం పట్టణంలోని మెయిన్‌రోడ్‌లో చీకట్లు అలముకున్నాయి. చీకటి పడిందంటే చాలు వాహన చోదకులు నానా అవస్థలు పడుతున్నారు. గడచిన నాలుగు నెలలుగా శ్రీకాకుళం రోడ్‌లోని సప్తగిరి కాలనీ నుంచి బొబ్బిలి జంక్షన్‌ వరకూ అంధకారం రాజ్యమేలుతోంది.

వెలగని లైట్లు.. తొలగని చీకట్లు

రాజాం రూరల్‌ : రాజాం పట్టణంలోని మెయిన్‌రోడ్‌లో చీకట్లు అలముకున్నాయి. చీకటి పడిందంటే చాలు వాహన చోదకులు నానా అవస్థలు పడుతున్నారు. గడచిన నాలుగు నెలలుగా శ్రీకాకుళం రోడ్‌లోని సప్తగిరి కాలనీ నుంచి బొబ్బిలి జంక్షన్‌ వరకూ అంధకారం రాజ్యమేలుతోంది. దీనిపై ఆంధ్రజ్యోతి పత్రికలో సెప్టెంబరు 15న ‘మున్సిపాలిటిలో అంధకారం’ శీర్షికన కథనం ప్రచురితమైన యంత్రాంగంలో కదలిక రాలేదు. దిద్దుబాటు చర్యలు ప్రారంభించలేదు. ఇది జరిగి రెండు నెలలు గడచినా అధికారుల తీరులో మార్పు రాకపోవడంతో వాహన చోదకులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టణంలోని 110 లైట్లకు 61 కాలిపోయాయి. వీటి స్థానంలో కొత్తలైట్లు ఏర్పాటు చేయడంలో అధికారుల అలసత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దీంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల బొబ్బిలి జంక్షన్‌లో పూర్తిగా చీకట్లు అలముకోవడంతో బొగ్గుపొడి లోడుతో ప్రయాణిస్తున్న భారీ లారీ బోల్తా పడింది. ఈమార్గంలో గతంలోనూ ద్విచక్ర వాహనాలు, ఆటోలు బోల్తా పడ్డాయి. ప్రయాణికులు గాయాలకు గురై ఆస్పత్రి పాలైన ఘటనలున్నాయి.

అడుగడుగునా..

శ్రీకాకుళం రోడ్‌లోని సప్తగిరి కాలనీ నుంచి బొబ్బిలి జంక్షన్‌ వరకూ డివైడర్‌ నిర్మించి 55 విద్యుత్‌ స్థంబాలకు రెండేసి చొప్పున 110 లైట్లు ఏర్పాటు చేశారు. గతంలో సప్తగిరి కాలనీ నుంచి అంబేడ్కర్‌ జంక్షన్‌ వరకూ 31 స్తంభాలకు 62 లైట్లు వేయగా వీటిలో 37 లైట్లు వెలగడం లేదు. అంబేడ్కర్‌ జంక్షన్‌ నుంచి బస్టాండ్‌ కూడలి వరకూ ఆరు స్థంబాలకు 12 లైట్లు ఉండగా ఏడు లైట్లు మరమ్మతులకు గురయ్యాయి. బస్టాండ్‌ కూడలి నుంచి మాధవబజార్‌ జంక్షన్‌ వరకూ మూడు స్థంబాలకు ఆరు లైట్లకు గాను మూడు వెలగడం లేదు. మాధవబజార్‌ నుంచి బొబ్బిలి జంక్షన్‌ వరకూ 15 స్థంబాలకు 30 లైట్లు ఏర్పాటు చేయగా వీటిలో 14 వెలగడం లేదు. దీంతో సప్తగిరి కాలనీ నుంచి బొబ్బిలి జంక్షన్‌ వరకూ సుమారు కిలోమీటర్‌ మేర అంధకారం అలముకుంటోంది.

మళ్లీ అదే సమాధానం..

మెయిన్‌రోడ్‌ సెంటర్‌ లైటింగ్‌లో 61 లైట్లు మరమ్మతులకు గురికావడం, అంధకారం అలముకోవడంపై అధికారుల వద్ద ఆంధ్రజ్యోతి ప్రస్తావిస్తే.. గతంలో చెప్పిన కదే మళ్లీ వినిపించారు. ఈ ఏడాది సెప్టెంబరు 14న రాత్రి రాజాం మున్సిపల్‌ కమిషనర్‌ కృష్ణారావు వద్ద ఆంధ్రజ్యోతి ప్రస్తావించగా సెంటర్‌ లైటింగ్‌ను ఆర్‌అండ్‌బీ అధికారులు మున్సిపాలిటీకి హేండోవర్‌ చేయలేదన్నారు. ఇదే విషయాన్ని ఆర్‌అండ్‌బీ రాజాం ఏఈ నాగభూషణరావుతో అప్పట్లో ప్రస్తావించగా.. సమస్య ఆర్‌అండ్‌బీ శాఖలో ఎలక్ట్రికల్‌ విభాగానికి సంబంధించిందని తెలిపారు. దీంతో ఆర్‌అండ్‌బీ శాఖలోని ఎలక్ర్టికల్‌ ఏఈ సతీష్‌తో (విశాఖ) ఆంధ్రజ్యోతి ఫోన్లో ప్రస్తావిస్తే.. మెయిన్‌రోడ్‌ సెంటర్‌లైటింగ్‌ను రాజాం మున్సిపాలిటీకి అప్పగించామని వివరించారు. ఇదే అంశాన్ని ఆ ముగ్గురు అధికారుల వద్ద మరోమారు ఆంరఽధజ్యోతి ప్రస్తావిస్తే.. గతంలో చెప్పిన అంశాలనే మళ్లీ చెప్పుకొచ్చారు.

Updated Date - 2023-11-22T00:05:15+05:30 IST