ఇలానే వదిలేస్తారా!
ABN , First Publish Date - 2023-06-26T00:24:03+05:30 IST
అత్యవసర వేళల్లో గిరిజన ప్రాంతవాసులను ఆసుపత్రులకు చేర్చాలనే ఉద్దేశంతో ఐటీడీఏకు అందించిన అంబులెన్స్‌లు వృథాగా మారాయి.
నిర్వహణకు నిధులు మంజూరు చేయని సర్కారు
గిరిజనులకు అందని సేవలు
సీతంపేట: అత్యవసర వేళల్లో గిరిజన ప్రాంతవాసులను ఆసుపత్రులకు చేర్చాలనే ఉద్దేశంతో ఐటీడీఏకు అందించిన అంబులెన్స్‌లు వృథాగా మారాయి. వాటి ద్వారా గిరిజనులకు సేవలు అందడం లేదు. దీంతో సీతంపేట ఐటీడీఏ పరిధిలో గిరిపుత్రులకు అవస్థలు తప్పడం లేదు. గతంలో ఎంపీ నిధులతో సీతంపేట ఐటీడీఏకు పది అంబులెన్స్‌లు అందించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వాటి నిర్వహణకు నిధులు మంజూరు చేయడంతో ఎటువంటి ఇబ్బందులు ఉండేవి కావు. వీటి ద్వారా ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అంబులెన్స్ సౌకర్యం కల్పించేవారు. డ్రైవర్లకు జీతాలు కూడా చెల్లించేవారు. దీంతో రోగులకు సకాలంలో వైద్యసేవలు అందేవి. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ మారింది. అంబులెన్స్‌ల నిర్వహణకు నిధులు మంజూరు చేయడం లేదు. డ్రైవర్లకు జీతాలు కూడా చెల్లించలేని దుస్థితి నెలకొంది. దీంతో పది అంబులెన్స్‌లకు నాలుగు మాత్రమే అత్యవసర సేవలకు వినియోగిస్తున్నారు. మిగతా ఆరు అంబులెన్స్‌లు మూలకు చేరాయి. వాటిల్లో రెండు ఐటీడీఏ కార్యాలయంలో, మరో రెండు కలెక్టర్ క్యాంపు ఆఫీస్‌లో, ఇంకో రెండు సీతంపేట ఏరియా ఆసుపత్రిలో వృథాగా దర్శనమిస్తున్నాయి.
వాస్తవంగా సీతంపేట ఐటీడీఏ పరిధిలో 29 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. వాటి పరిధిలో అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచాల్సి ఉంది. అదే విధంగా అత్యవసర సమయంలో గర్భిణులను సమీపంలో ఉన్న సబ్ సెంటర్, లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి వారికి అవసరమైన చికిత్స అందించాల్సి ఉంది. అయితే పూర్తిస్థాయిలో నిధులు మంజూరు కాకపోవడంతో అంబులెన్స్ నిర్వహణ కష్టతరంగా మారింది. దీంతో చేసేది లేక ఐటీడీఏ అధికారులు అంబులెన్స్‌లను మూలకు చేర్చారు. లక్షలాది రూపాయలు విలువ చేసే అంబులెన్స్‌లు ఇలా నిరుపయోగంగా మారడంపై గిరిజనులు అంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఈ విషయమై ఐటీడీఏ ఉపవిద్యాశాకాధికారి డాక్టర్ విజయపార్వతిను వివరణ కోరగా అంంబులెన్స్‌ల నిర్వహణ, డ్రైవర్ల జీతభత్యాలకు నిధులు మంజూరవడం లేదన్నారు. దీంతో అంబులెన్స్‌లను నిలుపుదల చేసినట్లు చెప్పారు.