కల్యాణ వైభోగమే..

ABN , First Publish Date - 2023-03-31T00:10:01+05:30 IST

సీతారాముల కల్యాణం కన్నులపండువగా సాగింది. వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు, శీరామ నామస్మరణ నడుమ వివాహ ఘట్టంలోని ప్రతి తంతును భక్తులు వీక్షిస్తూ పులకించారు. ప్రత్యేకంగా అలంకరించిన కల్యాణ ప్రాంగణం భక్తులతో నిండిపోయింది.

కల్యాణ వైభోగమే..
మంగళసూత్రాన్ని చూపుతున్న అర్చకుడు

రామతీర్థంలో కన్నుల పండువగా సీతారాముల పెళ్లి

మార్మోగిన రామనామ స్మరణ

పట్టువస్ర్తాలను సమర్పించిన మంత్రి బొత్స దంపతులు

భక్తులతో కిటకిటలాడిన ఆలయ ప్రాంగణం

సీతారాముల కల్యాణం కన్నులపండువగా సాగింది. వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు, శీరామ నామస్మరణ నడుమ వివాహ ఘట్టంలోని ప్రతి తంతును భక్తులు వీక్షిస్తూ పులకించారు. ప్రత్యేకంగా అలంకరించిన కల్యాణ ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. విశ్వక్షేణపూజతో కల్యాణానికి శ్రీకారం చుట్టారు. సుమారు మూడున్నర గంటలసేపు పెళ్లి ఎంతో వైభవంగా సాగింది. ప్రధానంగా తలపై జీలకర్ర బెల్లం పెట్టే సంఘటన, మంగళ సూత్రధారణ, తలంబ్రాలను చల్లుకునే ప్రక్రియలను చూసి భక్తులు ఆనందపరవశులయ్యారు. కల్యాణాన్ని ఆద్యంతం కనులార్పకుండా చూశారు.

నెల్లిమర్ల, మార్చి 30:

రామతీర్థం దేవస్థానంలో సీతారాముల కల్యాణం గురువారం అత్యంత వైభవంగా జరిగింది. దేవస్థానం వెనుక వైపు ఉన్న వేదికను తొలుత పూలతో అలంకరించి సీతారాములను అధిష్ఠింపజేశారు. అర్చకులు ఖండవిల్లి సాయిరామాచార్యులు, గొడవర్తి నరసింహాచార్యులతో కూడిన అర్చక బృందం కల్యాణోత్సవాన్ని శాస్ర్తోక్తంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఝాన్సీలక్ష్మి దంపతులు పట్టు వస్ర్తాలు, ముత్యాలను సమర్పించారు. వీరితో పాటు ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు,పద్మావతి దంపతులు, రాష్ట్ర సాధుపరిషత్‌ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి కూడా వ్యక్తిగతంగా స్వామికి పట్టువస్ర్తాలు అందజేశారు. వేలాదిమంది భక్తులతో పాటు ప్రముఖులు కల్యాణోత్సవాన్ని ఆద్యంతం తిలకించారు. సుమారు 25వేల మంది భక్తులు వచ్చారని అంచనా. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వేదిక ఎదురుగా, చుట్టూ టెంట్‌ హౌస్‌లు ఏర్పాటు చేసి కుర్చీలు వేశారు. దేవస్థానం ఈవో బీహెచ్‌ఎస్‌ఎన్‌ కిషోర్‌కుమార్‌ పర్యవేక్షణలో వివాహ ఘట్టం సాగింది. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ పూసపాటి అశోక్‌గజపతిరాజు కల్యాణోత్సవానికి హాజరుకాలేదు.

ఫ నిర్వాహకులు భక్తులకు మజ్జిగ, తాగునీరు అందించారు. వేలాది మందికి అన్నదానం చేశారు. అయితే క్యూలైన్‌లు కిక్కిరిశాయి. వీఐపీ లైన్‌ వేరుగా లేకపోవడంతో ప్రముఖులు, అధికారులు ఇబ్బంది పడ్డారు. భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడంలో దేవస్థానం సిబ్బంది విఫలమయ్యారు. కొన్ని చోట్ల తోపులాట కూడా జరిగింది. సీఐ లక్ష్మణరావు పర్యవేక్షణలో నెల్లిమర్ల ఎస్‌ఐ నారాయణరావు బందోబస్తు ఏర్పాటుచేశారు.

Updated Date - 2023-03-31T00:10:01+05:30 IST