బస్సు భద్రమేనా?

ABN , First Publish Date - 2023-06-26T00:09:23+05:30 IST

ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో ప్రవేశాలపై దృష్టిసారించిన యాజమాన్యాలు స్కూల్‌ బస్సుల భద్రతను పెద్దగా పట్టించుకోవడం లేదు. బస్సులు పూర్తి సామర్థ్యంతో ఉన్నాయో లేదో సరిగా పరిశీలించడం లేదు. వాహనాల్లో పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకుంటున్నారు.

బస్సు భద్రమేనా?

స్కూల్‌ బస్సుల్లో కానరాని నిబంధనలు

ఫిట్‌నెస్‌ పరీక్షలు చేసినవి సగమే

విద్యార్థులకు పొంచి ఉన్న అపాయం

రాజాం, జూన్‌ 25: ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో ప్రవేశాలపై దృష్టిసారించిన యాజమాన్యాలు స్కూల్‌ బస్సుల భద్రతను పెద్దగా పట్టించుకోవడం లేదు. బస్సులు పూర్తి సామర్థ్యంతో ఉన్నాయో లేదో సరిగా పరిశీలించడం లేదు. వాహనాల్లో పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకుంటున్నారు.

జిల్లా వ్యాప్తంగా 800కు పైగా స్కూల్‌ బస్సులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. విద్యాసంవత్సరం ప్రారంభంలోనే స్కూల్‌ బస్సుల ఫిట్‌నెస్‌ను పరిశీలించాలి. ఈ ఏడాది రవాణా శాఖ అధికారులు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి తనిఖీ చేశారు. కేవలం 400 బస్సులకే ఫిట్‌నెస్‌ ధ్రువీకరించినట్లు తెలిసింది. కొన్ని పాఠశాలలు అనధికారికంగా బస్సులు నడుపుతున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. వాస్తవానికి సురక్షితమైన, కండీషన్‌లో ఉన్న బస్సులనే వినియోగించాలి. 15 ఏళ్లు దాటిన బస్సులను వాడకూడదు. కానీ కొన్ని పాఠశాలల యాజమాన్యాలు పాత బస్సులకు రంగులు వేసి నడుపుతున్నట్టు సమాచారం.

- స్కూల్‌ బస్సు డ్రైవర్‌ ఎంపిక కూడా చాలా కీలకం. శిక్షణ పొందిన ఆరోగ్యంగా ఉన్న డ్రైవర్లనే ఎంపిక చేయాలి. ముందుగా వారి నుంచి ఫిట్‌నెస్‌ పొందాలి. కంటిచూపు సక్రమంగా ఉండడంతో పాటు మూర్చ వంటి వ్యాధులు లేని వారినే తీసుకోవాలి. నిష్ణాతులైన డ్రైవర్లకు అధిక వేతనం ఇవ్వాల్సి వస్తోందని కొన్ని యాజమాన్యాలు వయసు పైబడిన వారిని సైతం డ్రైవర్లుగా ఎంపిక చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. బస్సు డ్రైవర్‌కు హెవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి. కొందరు లైట్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌తో బస్సులు నడుపుతున్నారు.

- స్కూల్‌ బస్సులకు సంబంధించి 32 అంశాలతో కూడిన నిబంధనలు పాటించాలి. ఫిట్‌నెస్‌, ఇన్సూరెన్స్‌ తప్పనిసరి. బస్సులో విద్యార్థుల వివరాల పట్టిక నమోదుచేయాలి. బస్సు ముందు, వెనుక భాగాల్లో స్కూల్‌ బస్సు, ఆన్‌ స్కూల్‌ డ్యూటీ అని రాయాలి. బస్సులో ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్సు, ఎమర్జెన్సీ డోర్‌ ఏర్పాటుచేయాలి. అగ్నిప్రమాద నివారణ పరికరాలు అందుబాటులో ఉంచాలి. కిటికీలకు నెట్‌ తప్పనిసరిగా ఉంచాలి. బస్సు తలుపులకు లాకింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటుచేయాలి. బస్సులో పిల్లల కోసం సహాయకులను నియమించాలి. గంటకు 40 కిలోమీటర్ల వేగానికి మించకుండా స్పిడ్‌ గవర్నెన్స్‌ ఏర్పాటుచేయాలి. మెజార్టీ బస్సులకు ఇవేవీ అమలవుతున్న దాఖలాలు లేవు. దీనిపై జిల్లా అధికారులు దృష్టిపెట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఫిట్‌నెస్‌ తప్పనిసరి

స్కూల్‌ బస్సులకు విధిగా ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించుకోవాలి. పక్కాగా నిబంధనలు పాటించాలి. విద్యార్థుల భద్రతే ధ్యేయం. లేకుంటే విస్తృతంగా తనిఖీలు చేసి ఫిట్‌నెస్‌ పరీక్ష చేయని బస్సులను సీజ్‌ చేస్తాం. అవసరమైతే యాజమాన్యాలపై కేసులు నమోదు చేస్తాం. ఏడాది పొడవునా రవాణా శాఖ తనిఖీలు చేస్తుంది.

- ఎన్‌.రమేష్‌, మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌, రాజాం

------------

Updated Date - 2023-06-26T00:09:23+05:30 IST