సాగునీరు అందేనా?

ABN , First Publish Date - 2023-06-26T23:55:14+05:30 IST

తోటపల్లి పాత బ్యారేజీ పరిధిలోని కుడి కాలువ అధ్వానంగా మారింది. ఏళ్లుగా దాని నిర్వహణను పట్టించుకోక పోవడంతో పిచ్చిమొక్కలతో దర్శనమిస్తోంది. దీంతో పూర్తిస్థాయిలో సాగునీటి సరఫరాపై రైతులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

సాగునీరు అందేనా?
గొట్టివలస సమీపంలో కుడి కాలువ పరిస్థితి ఇది..

ఆందోళనలో శివారు ప్రాంత రైతులు

(గరుగుబిల్లి)

తోటపల్లి పాత బ్యారేజీ పరిధిలోని కుడి కాలువ అధ్వానంగా మారింది. ఏళ్లుగా దాని నిర్వహణను పట్టించుకోక పోవడంతో పిచ్చిమొక్కలతో దర్శనమిస్తోంది. దీంతో పూర్తిస్థాయిలో సాగునీటి సరఫరాపై రైతులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మాదిరిగానే ఈ ఏడాదీ కష్టాలు తప్పేటట్లు లేవని మథనపడుతున్నారు. వాస్తవంగా ఈ కాలువ నుంచి గరుగుబిల్లి మండలం సుంకి నుంచి బలిజిపేట, విజయనగరం జిల్లా వంగర వరకూ సుమారు 10 వేల ఎకరాలకు నీరు అందాల్సి ఉంది. అయితే కనీసం పూడికలు కూడా తీయకపోవడంతో శివారు భూములకు సాగునీటి సరఫరా ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు బ్రిటిష్‌ హయాంలో సుంకి ప్రాంతంలో కాలువకు ఇరువైపుగా నిర్మించిన గోడలు శిథిలమయ్యాయి. దీంతో పలు దఫాలు ఆ ప్రాంతంలో భారీగా గండ్లు పడ్డాయి. దీంతో సమీప గ్రామాలకు అంతంత మాత్రంగానే సాగునీరు అందేది. ప్రస్తుతం కాలువ ఆధునికీకరణ పనుల్లో భాగంగా తాత్కాలికంగా రక్షణ గోడ పనులు చేపట్టారు. అయితే నిధుల కొరత కారణంగా వాటి పనులు నామమాత్రంగానే చేపట్టడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా కాలువతో పాటు కల్వర్టులు కూడా ప్రమాదకరంగా మారాయి. కాలువ నుంచి అధికంగా సాగునీరు సరఫరా చేస్తే మరుపెంట, గొట్టివలసతో పాటు పలు ప్రాంతాల్లో గట్లు, రహదారిపైకి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఖరీఫ్‌ నేపథ్యంలో ఇప్పటికే తోటపల్లి ప్రాజెక్టు పరిధిలోని ప్రధాన కుడి కాలువ నుంచి 700 క్యూసెక్కులను విడుదల చేశారు. అయితే పాత బ్యారేజీ పరిధిలోని ప్రధాన ఎడమ, కుడి కాలువల నుంచి నేటికీ సాగునీరు విడుదల చేయలేదు. దీంతో 70 వేల ఎకరాలకు నీరు అందని పరిస్థితి. ఎడమ ప్రధాన కాలువ పరిధిలో కేవలం లైనింగ్‌ పనులకే పరిమితమయ్యారు. మొత్తంగా ఈ ఖరీఫ్‌కు రెండు కాలువల పరిధిలోని రైతులకు ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.

Updated Date - 2023-06-26T23:55:14+05:30 IST