ఐదేళ్లుగా పునాదుల్లోనే..
ABN , Publish Date - Dec 17 , 2023 | 12:12 AM
చారిత్రాత్మకమైన బొబ్బిలి పట్టణంలో క్రీడాకారులు, క్రీడాభిమానులు ఎక్కువే. జాతీయ స్థాయిలో రాణించినవారున్నారు. కొన్నాళ్లుగా మాత్రం ఆ స్ఫూర్తి కనిపించడం లేదు. ప్రధానంగా ఇండోర్ స్టేడియంపై ఇక్కడి క్రీడాకారులు తీవ్ర నిరాశతో ఉన్నారు.
ఐదేళ్లుగా పునాదుల్లోనే..
ఇండోర్ స్టేడియం పూర్తయ్యేనా?
పడకేసిన నిర్మాణం
బుడా నుంచి రూ.కోటి మంజూరు
రెండుసార్లు శంకుస్థాపనలు
బొబ్బిలి, డిసెంబరు 16: చారిత్రాత్మకమైన బొబ్బిలి పట్టణంలో క్రీడాకారులు, క్రీడాభిమానులు ఎక్కువే. జాతీయ స్థాయిలో రాణించినవారున్నారు. కొన్నాళ్లుగా మాత్రం ఆ స్ఫూర్తి కనిపించడం లేదు. ప్రధానంగా ఇండోర్ స్టేడియంపై ఇక్కడి క్రీడాకారులు తీవ్ర నిరాశతో ఉన్నారు.
బొబ్బిలిలోని క్రీడాకారుల అవసరాలను గుర్తించిన టీడీపీ ప్రభుత్వం స్ధానిక ప్రభుత్వ ఐటీఐ సమీపంలో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి చర్యలు చేపట్టింది. అప్పట్లో శంకుస్ధాపన కూడా జరిగింది. రూ.80 లక్షలు మంజూరు చేసి పనులను కాంట్రాక్టర్‌కు అప్పగించారు. ఈలోగా ప్రభుత్వం మారిపోవడంతో ఆ పనులు ఆగిపోయాయి. క్రీడాభిమానుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే శంబంగి వెంకటచినఅప్పలనాయుడు స్పందించి బొబ్బిలి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (బుడా) నుంచి కోటి రూపాయల నిధులను స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం మంజూరు చేయించారు. ఈ పనులకోసం రెండు నెలల క్రితం ఆయన మళ్లీ శంకుస్థాపన కూడా చేశారు. ఆ తర్వాత పట్టించుకోవడం మానేశారు. అప్పటి నుంచి ఒక్క అంగుళమైనా పనులు జరగలేదు. క్రీడాభిమానుల్లో నైరాశ్యం పెల్లుబుకుతోంది. బుడా నిధులు ఉన్నప్పటికీ ఆ బిల్లులు అందుతాయో లేదో అన్న భయంతో కాంట్రాక్టర్ పనులు చేసేందుకు ముందుకు రావడం లేదని సమాచారం.
ఇండోర్ స్టేడియం నిర్మాణానికి జాప్యం తగదు
చింతాడ రవి, షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు
ఐదేళ్ల క్రితం ఇండోర్ స్టేడియం నిర్మాణానికి శ్రీకారం చుట్టినప్పుడు ఈ ప్రాంతానికి చెందిన వేలాది మంది క్రీడాకారులు చాలా సంతోషించారు. తీరా ఆ పనులు జరగకపోవడంతో నిరాశకు గురయ్యాం. ఈ పనులలో జాప్యాన్ని నివారించి తక్షణం స్టేడియం పనులను పూర్తి చేయాలి.
క్రీడలకు బొబ్బిలి నెలవు
రావు శ్రీనివాసరావు, క్రీడా కోచ్, బొబ్బిలి
క్రీడలకు బొబ్బిలి నెలవు. ఐదారు దశాబ్దాల నుంచి ఇక్కడ రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులతో పోటీలు జరుగుతుండేవి. సరైన స్టేడియం, మైదానం లేకపోవడంతో ఔత్సాహికులకు ప్రోత్సహం లభించడం లేదు. ప్రభుత్వం స్టేడియం పనులను తక్షణం పూర్తి చేయాలి.