పోలింగ్‌ కేంద్రాల్లో కనీస సదుపాయాలు ఉండాలి

ABN , First Publish Date - 2023-03-02T00:12:58+05:30 IST

ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసనమండలి స్థానానికి జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌ కేంద్రాల్లో కనీస సదుపాయాలు ఉండాలని కలెక్టర్‌ సూర్యకుమారి ఆదేశించారు. ఈనెల 13న ఎన్నికలు జరుగనుండడంతో సన్నాహాలపై ఆరా తీశారు.

పోలింగ్‌ కేంద్రాల్లో   కనీస సదుపాయాలు ఉండాలి
పోలింగ్‌ కేంద్రాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌, ఎస్పీ

పరిశీలించిన కలెక్టర్‌, ఎస్పీ

కలెక్టరేట్‌, మార్చి1: ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసనమండలి స్థానానికి జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌ కేంద్రాల్లో కనీస సదుపాయాలు ఉండాలని కలెక్టర్‌ సూర్యకుమారి ఆదేశించారు. ఈనెల 13న ఎన్నికలు జరుగనుండడంతో సన్నాహాలపై ఆరా తీశారు. పట్టణంలోని వివిధ పోలింగ్‌ కేంద్రాలను ఎస్పీ దీపికాపాటిల్‌తో కలిసి బుధవారం పరిశీలించారు. కంటోన్మెంట్‌లోని మున్సిపల్‌ ఉన్నత పాఠశాల, మహారాజా కళాశాల, కస్పా మున్సిపల్‌ ఉన్నత పాఠశాల, మహారాజా సంస్కృత ఉన్నత పాఠశాలలను సందర్శించి సిబ్బందికి సూచనలు ఇచ్చారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో తాగునీటితోపాటు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. క్యూలైన్ల పక్కనే కుండలతో నీటిని ఉంచాలని చెప్పారు. కేంద్రాల్లో లైట్లు, ఫ్యాన్లు అన్నీ పని చేసేలా చూడాలన్నారు. ఎండ తీవ్రంగా ఉండటం వల్ల నీడ కోసం షామియానాలు ఏర్పాటు చేయాలని సూచించారు. క్యూలైన్లు పక్కన నమూన బ్యాలెట్‌ పత్రాలను అంటించాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ దీపికా పాటిల్‌ తెలిపారు.

ఓటర్‌ స్లిప్పుల పంపిణీని త్వరగా పూర్తిచేయాలి

గ్రాడ్యుయేట్‌ ఓటర్లకు ఓటర్‌ స్లిప్పుల పంపిణీని త్వరగా పూర్తి చేయాలని బీఎల్‌వోలకు కలెక్టర్‌ ఆదేశించారు. తక్కువ స్లిప్పులను పంపిణీ చేసిన వారిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియలో ఎట్టి పరిస్థితిల్లోనూ వలంటీర్లను వినియోగించకూడదన్నారు. ఆమె వెంట జోనల్‌ ఎన్నికల అధికారులు పీఎస్‌వీ లక్ష్మీనారాయణ, బి.రాంగోపాల్‌, విజయనగరం డీఎస్పీ శ్రీనివాసరావు, తహసీల్దార్‌ బంగారురాజు తదితరులు ఉన్నారు

Updated Date - 2023-03-02T00:12:58+05:30 IST