వంద ఇస్తేనే గేటు తీస్తా

ABN , First Publish Date - 2023-03-19T00:02:11+05:30 IST

అతనొక చోటా నాయకుడు.. గోస్తనీ తీరాన్ని అడ్డాగా మార్చుకున్నాడు. మూడు నెలలుగా ఇసుక దందా చేస్తున్నాడు. ఎంట్రన్స్‌లో ఏకంగా ఓ గేటు పెట్టాడు. వంద ఇస్తేనే టైరు బండ్లను అనుమతిస్తున్నాడు. ఇతనికి కొందరు నాయకుల అండ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో స్థానిక అధికారులు కూడా మిన్నకుండి పోతున్నారన్న విమర్శలు ఉన్నాయి.

వంద ఇస్తేనే గేటు తీస్తా
డబ్బులు వసూలు కోసం ఏర్పాటుచేసిన ఇనుప గేట్‌

ఓ చోటా నాయకుడి ఇసుక దందా

టైరు బండ్ల నుంచి డబ్బుల వసూలు

గోస్తనీ తీరాన్ని అడ్డాగా మార్చుకున్న వైనం

అతనొక చోటా నాయకుడు.. గోస్తనీ తీరాన్ని అడ్డాగా మార్చుకున్నాడు. మూడు నెలలుగా ఇసుక దందా చేస్తున్నాడు. ఎంట్రన్స్‌లో ఏకంగా ఓ గేటు పెట్టాడు. వంద ఇస్తేనే టైరు బండ్లను అనుమతిస్తున్నాడు. ఇతనికి కొందరు నాయకుల అండ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో స్థానిక అధికారులు కూడా మిన్నకుండి పోతున్నారన్న విమర్శలు ఉన్నాయి.

శృంగవరపుకోట రూరల్‌, మార్చి 18: మామిడిపల్లి, వేములాపల్లి గోస్తనీ తీరంలో ఇసుక దందాకు పాల్పడుతున్న ఓ చోనా నాయకుడు టైరుబళ్ల నిర్వాహకులపై అజమాయిషీ చలాయిస్తున్నాడు. మూడు నెలల కిందట వారందరినీ పిలిపించి హుకుం జారీ చేశాడు. వంద రూపాయలు వంతున చెల్లించి ఇసుక తీసుకువెళ్లాలని ఆదేశించాడు. ఆ నాయకుడి వెనుక కొందరు పెద్ద నాయకులు ఉండడంతో టైర్లుబళ్ల యజమానులు చేసేదిలేక అందుకు అంగీకరించారు. అప్పటి నుంచి తీరంలో ప్రతి టైరుబండ్ల యజమానులు రూ.100 చొప్పున చెల్లిస్తున్నారు. అయితే అప్పుడప్పుడు కొందరు వ్యక్తులు డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోవడంతో ఈ విషయాన్ని గుర్తించిన ఆ నాయకుడు ఏకంగా దారికి అడ్డంగా ఐరన్‌ గేట్‌ ఏర్పాటు చేసేశాడు. ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నాడు. తీరం నుంచి ఇసుక బండి గేటు వద్దకు వచ్చాక రూ.100 ఇచ్చాకే గేటు ఎత్తుతున్నాడు. లేకుంటే అంతే. దీనిపై కొంతమంది గ్రామ సచివాలయంలో ఉండే వీఆర్‌వో, కార్యదర్శికి పలుమార్లు సమాచారం ఇచ్చారు. వారు పట్టించుకోలేదు. ఆవేదనతో ఉన్న టైరుబండి నిర్వాహకులు శనివారం మీడియాకు ఫోన్‌లో చెప్పారు. డబ్బులివ్వకుంటే ఇసుక తీసుకువెళ్లనీయడం లేదని వివరించారు. విషయం తెలుసుకునేందుకు మీడియా అక్కడకు వెళ్లగా ఆ నాయకుడు గమనించి వెంటవెంటనే గేట్‌ ఎత్తి వారందరినీ పంపించేశాడు. అనంతరం తీరంలో పరిశీలించగా నదిలో అధిక సంఖ్యలో టైరుబళ్లు కనిపించాయి. గోస్తనీ నుంచి ప్రజలకు తాగునీరు అందించే ఊటబావుల చుట్టూ పెద్దఎత్తున ఇసుక తవ్వేసిన దృశ్యాలు కంటపడ్డాయి. ఇదంతా అధికారులకు తెలుసునని కొంతమంది యువకులు వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతంనుంచి రాత్రి వేళల్లో ఇసుక అత్యధికంగా ట్రాక్టర్లద్వారా గంట్యాడ మండలానికి వెళ్తోందని తెలిపారు. నదిలో అక్కడ భారీ దోపిడీ జరుగుతున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు.

Updated Date - 2023-03-19T00:02:11+05:30 IST