ఉపాధి కోసం వస్తే ఉసురు పోయింది

ABN , First Publish Date - 2023-06-23T00:06:09+05:30 IST

ఉపాధి కోసం వచ్చిన ఓ యువకుడు విద్యుదాఘాతంతో మృతిచెందిన ఘటన మరిపిల్లి గ్రామంలో గురువారం జరిగింది.

 ఉపాధి కోసం వస్తే ఉసురు పోయింది

సాలూరు రూరల్‌: ఉపాధి కోసం వచ్చిన ఓ యువకుడు విద్యుదాఘాతంతో మృతిచెందిన ఘటన మరిపిల్లి గ్రామంలో గురువారం జరిగింది. విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం ముచ్చర్లవలసకు చెందిన సువ్వాడ జగదీష్‌ (18) తన మేనమామ నడుపుతున్న టెంట్‌ హౌస్‌ పనికి వచ్చాడు. మరిపిల్లిలో గురువారం ఓ శుభకార్యక్రమం కోసం పెండాల్స్‌ వేస్తుండగా ఇనుప గొట్టం విద్యుత్‌ తీగలకు తాకడంతో షాక్‌కు గురయ్యాడు. హుటాహుటిన మామిడిపల్లి పీహెచ్‌సీకి తరలించగా అప్పటికే జగదీష్‌ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. జగదీష్‌ తండ్రి శ్రీనివాసరావు నాలుగేళ్ల క్రితం మరణించాడు. పదో తరగతి పాసైన జగదీష్‌ ఐటీఐలో చేరడానికి కొద్దిరోజుల క్రితం దరఖాస్తు చేసుకున్నాడు. తల్లి ఆరోగ్యం బాగుండకపోవడంతో తాను కష్టపడి సంపాదించి కుటుంబ బాధ్యత చూస్తానని, బెంగ పడొద్దని రెండు రోజుల క్రితం తల్లికి ధైర్యం చెప్పాడు. దీనిలో భాగంగా పనికి వెళ్లిన కుమారుడు మృతి చెందడంతో తల్లి వెంకటమ్మ కన్నీరుమున్నీరుగా రోదిస్తుంది. జగదీష్‌ మృతి తో ముచ్చర్లవలసలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతుడి అన్నయ్య యుగంధర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సాలూరు రూరల్‌ ఎస్‌ఐ ప్రయోగమూర్తి తెలిపారు.

Updated Date - 2023-06-23T00:06:09+05:30 IST