ప్రశ్నిస్తే దాడులు.. కేసులు

ABN , First Publish Date - 2023-05-26T00:07:15+05:30 IST

ప్రశ్నిస్తే దాడులు... కేసులు తప్ప వైసీపీ ప్రభుత్వం ఇంకేం చేసిందని టీడీపీ నేతలు అన్నారు. ఈ సమావేశమే వైసీపీ ఓటమికి నాంది కావాలని.. అరకు పార్లమెంట్‌ పరిధిలో ఏడు స్థానాలూ గెలిచి చంద్రన్నకు కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు.

ప్రశ్నిస్తే దాడులు.. కేసులు
మినీ మహానాడులో టీడీపీ నాయకులు

ఈ సమావేశమే వైసీపీ ఓటమికి నాంది కావాలి

అరకు పార్లమెంట్‌ పరిధిలో ఏడు స్థానాలూ గెలవాలి

సాలూరు మినీమహానాడులో టీడీపీ నాయకులు

తరలి వచ్చిన నేతలు, కార్యకర్తలు.. శ్రేణుల్లో మరింత జోష్‌

సాలూరు, మే 25: ప్రశ్నిస్తే దాడులు... కేసులు తప్ప వైసీపీ ప్రభుత్వం ఇంకేం చేసిందని టీడీపీ నేతలు అన్నారు. ఈ సమావేశమే వైసీపీ ఓటమికి నాంది కావాలని.. అరకు పార్లమెంట్‌ పరిధిలో ఏడు స్థానాలూ గెలిచి చంద్రన్నకు కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. మిని మహానాడు, ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలను గురువారం పట్టణంలోని ఓ ప్రైవేట్‌ మిల్లు ఆవరణలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు, మాజీ ఎమ్మెల్సీ గుమ్మిడి సంధ్యారాణి అధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లాతో పాటు ఏడు నియోజకవర్గాల నుంచి పెద్దఎత్తున టీడీపీ శ్రేణులు తరలివచ్చాయి. ముందుగా ముఖ్యనేతలంతా కలిసి ఎన్టీఆర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. ఎన్టీఆర్‌ సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకటరావు మాట్లాడుతూ.. అటు కథానాయకుడిగా.. ఇటు రాజకీయ నాయకుడిగా రాణించిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని తెలిపారు. ముఖ్యమంత్రిగా ఆయన అందించిన పాలనను ఎవరూ మరిచిపోలేరని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న సెంటు స్థలంలో ఇల్లు ఎలా కట్టుకోవాలో పేదలకు తెలియడం లేదన్నారు. భార్యాభర్తలు పడుకుంటే పక్కింట్లో కాళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని విమర్శించారు. . ప్రతిఒక్కరూ వైసీపీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

- టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు, అరకు పార్లమెంట్‌ అధ్యక్షురాలు సంధ్యారాణి మాట్లాడుతూ.. గిరిజనులకు అన్నం రుచి చూపించిన మహనీయుడు ఎన్టీఆర్‌ అని అన్నారు. గిరిజన గ్రామాల్లో చంద్రన్నబాట ద్వారా లక్షలాది కిలోమీటర్ల మేర రోడ్డు వేసిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని తెలిపారు. ఈ ప్రాంతంలో గిరిజన విశ్వవిద్యాలయం అసలు ఉందో లేదో.. వైసీపీ నాయకులకే తెలియాలన్నారు. కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో కలెక్టర్‌, ఎస్పీలకు కూర్చీలు కూడా అందించలేని ప్రభుత్వమని ఆరోపించారు.

- పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్పీ భంజ్‌దేవ్‌ మాట్లాడుతూ... పార్టీ పూర్వ వైభవానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. వైసీపీ ప్రభుత్వ విధానాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు తెలియజేశారు.

- అనంతరం పాడేరు నియోజకవర్గ ఇన్‌చార్జి గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ.. తమ నియోజకవర్గంలో అడారిమెట్టలో పూరి గుడిసెల్లో ఉన్న గిరిజనులకు పెంకుటిళ్లు ఇచ్చింది ఎన్టీఆర్‌ అని గుర్తు చేశారు. జీవో నెంబర్‌ మూడు తెచ్చి టెన్త్‌ పాస్‌, ఫెయిల్‌ తో సంబంధం లేకుండా గిరిజనులకు ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఉద్యోగ భద్రత ఇచ్చిందని ఆయనేనని అన్నారు. బోయ, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని తీర్మానం చేసిన వైసీపీ ప్రభుత్వం గిరిజనులను మోసం చేస్తోందని తెలిపారు. వైసీపీ ఓటమికి ఈ మినీమహానాడు నాంది కావాలన్నారు.

- మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో రాష్ట్రంలో విద్యార్థులు చదువుకోవడానికి అవకాశాలు లేవని, చదువుకున్నవారికి ఉద్యోగాలు లేవని, పనులు చేద్దామంటే ఉపాధి కూడా లభించడం లేదని తెలిపారు. జీవో నెం మూడును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసి గిరిజనులకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు.

- మాజీ ఎమ్మెల్సీ జగదీష్‌ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీడీఏ వ్యవస్థను సర్వనాశనం చేసిందన్నారు. రాష్ర్టానికి రాజధాని లేకుండా చేసిందని ధ్వజమెత్తారు. రాజ్యాంగ వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యమైపోయాయని తెలిపారు. పీడర్‌ అంబులెన్స్‌లకు ఇంకా టెస్టింగ్‌లు చేస్తున్నారంటూ విమర్శించారు. గిరిజన విశ్వవిద్యాలయం గిరిజన ప్రాంతంలోనే పెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మణికుమారి, పాలకొండ, కురుపాం నియోజకవర్గ ఇన్‌చార్జిలు నిమ్మక జయకృష్ణ, తోయక జగదీశ్వరి, ఎస్టీ సెల్‌ రాష్ట్ర నాయకుడు దొర, పార్టీ పరిశీలకులు మూర్తి యాదవ్‌, రాజమండ్రి నారాయణ, ఇచ్చావతి, ఏడు నియోజకవర్గాలకు చెందిన పార్టీ నాయకులు, ఇన్‌చార్జిలు, అధ్యక్షులు, వివిద కమిటీల సభ్యులు, పార్టీ అభిమానులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మొత్తంగా మూడు వేల మంది హాజరయ్యారు. టీడీపీ శ్రేణుల సందడితో సాలూరు కళకళలాడింది. పచ్చ జెండాలతో పట్టణం పసుపుమయమైంది.

దుర్మార్గులు... దోపిడీ తప్ప అభివృద్ధి చేయలేరు

కేటుగాడు... పిల్లల భవిష్యత్తు నాశనం చేశాడు: అయ్యన్న

దుర్మార్గులు దోపిడీ తప్ప ఏ అభివృద్ధీ చేయలేరని మాజీ మంత్రి చింతకాయల అయన్నపాత్రుడు విమర్శించారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో గురువారం జరిగిన మినీ మహానాడు, ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల్లో ఆయన మాట్లాడారు. ‘‘దొంగ సీఎం అయితే రాష్ట్రం ఇలానే ఉంటుంది. దుర్మార్గుడు, కేటుగాడు పిల్లల భవిష్యత్‌ నాశనం చేశాడు. సైకోకు పాలన ఎం తెలుసు? దోపిడీ తప్ప. రాష్ట్రంలో 25 లక్షల మందికి ఇళ్లు ఇచ్చామని చెప్పుకుంటున్నారు. కానీ నాలుగేళ్లలో పూర్తయిన ఇళ్లు ఎనిమిదంటే ఎనిమిదే. ఆ ఇళ్లకు కూడా వీళ్ల పార్టీ రంగు వేయాలంట. మన కర్మ కాకపోతేమరి. ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లకు నీ భార్య భారతి సిమెంట్‌ ఫ్యాక్టరీ నుంచి బస్తాకు రూ.40 తగ్గించి ఇవ్వచ్చుకదా? ఇనుము, ఇసుకతో పాటు ఇతర వస్తువుల ధరలు ఒక్కసారిగా పెరగటంతో సామాన్యులు ఇళ్లు కట్టుకోలేని పరిస్థితి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాపై 14 కేసులు పెట్టారు. తమ్ముళ్లూ... ఉపాధి హామీ పథకం వేతనదారులకు మార్చి, ఏప్రిల్‌, జూన్‌ నెలల్లో అదనపు భృతి కేంద్రం ఇస్తే దాన్ని ఇవ్వకుండా ఎవరు తింటున్నారో చెప్పాలి. తప్పు చేస్తే జయలలితను, కేంద్ర మంత్రులను కూడా వదిలిపెట్టకుండా అరెస్టు చేసిన సీబీఐ... అవినాశ్‌రెడ్డి విషయంలో ఎందుకు దూకుడు చూపలేకపోతోంది? కర్నులు జిల్లా ఎస్పీని, డీజీపీని సస్పెండ్‌ చేయాలి. ప్రజల్లో మార్పు వచ్చింది. మరో ఆరు నెలల్లో జగన్‌ జైలుకు పోతాడు. మంత్రులు కేవలం డమ్మీలు. ఒకడు ప్యాంటు విప్పుతాడు. మరొకడు అరగంటకొస్తావా? గంట కొస్తావా? అంటాడు. న్యాయం చేయమని రైతులు ధర్నా చేస్తే ఎర్రిపప్ప అని వ్యవసాయ మంత్రి అంటాడు. రోజా ఏ మంత్రో ఎవరికీ తెలియదు’’ అని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధాన్ని అయ్యన్న గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు గుమ్మడి సంధ్యారాణి, కిమిడి కళావెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-26T00:07:15+05:30 IST