ఎన్నేళ్లు ఈ దుస్థితి?

ABN , First Publish Date - 2023-09-19T23:56:55+05:30 IST

ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా వారి బతుకులు మాత్రం మారడం లేదు. కనీస సౌకర్యాలకు నోచుకోవడం లేదు. గ్రామానికి వెళ్లేందుకు కనీసం సరైన రోడ్డు లేదు. ఇదీ జియ్యమ్మవలస మండలం అర్నాడ పంచాయతీలోని అర్నాడవలస గ్రామస్థుల పరిస్థితి.

ఎన్నేళ్లు ఈ దుస్థితి?
అర్నాడవలస గ్రామం

- రోడ్లు, కాలువలు లేని వైనం

- గిరిజనుల దరిచేరని అత్యవసర సేవలు

( జియ్యమ్మవలస )

ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా వారి బతుకులు మాత్రం మారడం లేదు. కనీస సౌకర్యాలకు నోచుకోవడం లేదు. గ్రామానికి వెళ్లేందుకు కనీసం సరైన రోడ్డు లేదు. ఇదీ జియ్యమ్మవలస మండలం అర్నాడ పంచాయతీలోని అర్నాడవలస గ్రామస్థుల పరిస్థితి. ఈ గ్రామం మాజీ మంత్రి, ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి ప్రాతినిద్యం వహిస్తున్న కురుపాం నియోజకవర్గంలో ఉంది. పది గిరిజన కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. మట్టి, ఇటుకలతో గోడలు నిర్మించి పైన రేకులు వేసుకుని ఆ ఇళ్లల్లో ఉంటున్నారు. బలమైన గాలులు వేస్తే ఆ రేకులు ఎగిరిపోతుంటాయి. ఏళ్లుగా పక్కా ఇళ్లకు నోచుకోవడం లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా తమకు ఇళ్లు మంజూరు చేయడం లేదని గ్రామ స్థులు వాపోతున్నారు. ప్రస్తుతం అన్ని గ్రామాలకు ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) ఇళ్లు, జగనన్న ఇళ్లను ప్రభుత్వాలు మంజూరు చేస్తున్నా తమను మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో వనజ, అర్నాడ, డంగభద్ర గ్రామాల మీదుగా గిరిజనులు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ రోడ్లు కూడా అత్యంత దారుణంగా ఉన్నాయని చెబుతున్నారు. ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా తమ గ్రామానికి రోడ్డు వేయలేదని ఆవేదన చెందుతున్నారు. దీంతో గ్రామానికి 108, 104 వాహనాలు రావడం లేదని, దీంతో అత్యవసర వైద్య సేవలు గగనమైపోతున్నాయని వాపోతున్నారు. ఎవరైనా అత్యవసర వైద్యం అందాలంటే దాదాపు రెండు కిలో మీటర్లు కాలినడకన తీసుకువెళ్లి అక్కడ 108లో కానీ, ప్రైవేటు వాహనాల్లో ఎక్కించి ఆస్పత్రులకు తీసుకెళ్లాల్సి వస్తుందని వాపోతున్నారు. గ్రామంలో సీసీ కాలువులు, రోడ్లు లేవని.. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్‌ దృష్టి సారించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.

రోడ్డు మంజూరు చేయాలి

మా గ్రామానికి సరైన రోడ్డు లేదు. దీంతో ఎటు వెళ్లాలన్నా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. మా వి రేకుల ఇళ్లు కావడంతో ఈదురుగాలులకు ఎగిరిపోతున్నాయి. ప్రభుత్వం స్పందించి ఇళ్లు, రోడ్డు మంజూరు చేయాలి.

-మెల్లక సురేష్‌, గిరిజనుడు, అర్నాడవలస గ్రామం

కలెక్టర్‌ స్పందించాలి

మా గ్రామం వైపు అధికారులు, పాల కులు కన్నెత్తి చూ డడం లేదు. ఇక్కడ ఓ గ్రామం ఉన్నట్లు వారు మరి చిపోయారు. గిరిజనులపై చిన్నచూపు తగదు. కలెక్టర్‌ స్పందించి మాకు న్యాయం చేయాలి.

-సరస్వతి, గిరిజన మహిళ, అర్నాడవలస గ్రామం

Updated Date - 2023-09-19T23:56:55+05:30 IST