వైద్య సేవలు ఎలా?

ABN , First Publish Date - 2023-06-03T00:42:07+05:30 IST

మండలంలోని చినమేరంగి సామాజిక ఆరోగ్య కేంద్రానికి వచ్చిన రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. వైద్యులు ఉన్నా టెక్నీషయన్‌లు లేవపోవడంతో రోగ నిర్ధారణ పరీక్షలకు పాట్లు పడుతున్నారు.

వైద్య సేవలు ఎలా?
ఓపీ రికార్డులు రాసుకుంటున్న రేడియోగ్రాఫర్‌

(జియ్యమ్మవలస)

మండలంలోని చినమేరంగి సామాజిక ఆరోగ్య కేంద్రానికి వచ్చిన రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. వైద్యులు ఉన్నా టెక్నీషయన్‌లు లేవపోవడంతో రోగ నిర్ధారణ పరీక్షలకు పాట్లు పడుతున్నారు. ఈ ఆస్పత్రికి ప్రతిరోజూ 200 వరకు ఓపీ జరుగుతుంటుంది. అలాగే, పదుల సంఖ్యలో రోగులు ఆస్పత్రిలో చిక్సిత్స పొందుతున్నారు. అయి తే, అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అనే సామెతలా ఆస్పత్రి పరిస్థితి ఉంది. ఆస్పత్రిలో ఉండాల్సిన విలువైన పరికరాలు, దానికి సంబం ధించిన టెక్నీషియన్లు విషయంలో ఇక్కడ వింత పరిస్థితి నెలకొంది. ఇక్కడ పూర్తిస్థాయి వైద్యాధికారులు ఉన్నా అవసరమైన టెక్నీషియ న్లను మాత్రం నియమించలేదు. ఈ సామాజిక ఆరోగ్య కేంద్రంలో రక్తనిధి కేంద్రం ఏర్పాటై రెండేళ్లు దాటిపోయింది. దానికి అవసరమైన గది, ఫ్రిజ్‌, రికార్డులు అన్నీ ఉన్నాయి. కావలసిన లైసెన్స్‌ కూడా ప్రభుత్వం అందించింది. కానీ గుండెకాయలాంటి టెక్నీషియన్‌ను మాత్రం నియమించలేదు. అలాగే, ఆస్పత్రిలో ఆపరేషన్లు చేసే అవకాశం ఉన్నప్పటికీ జనరల్‌ సర్జన్‌ పోస్టును భర్తీ చేయలేదు. దీంతో శస్త్ర చికిత్సల కోసం రోగులను ఇతర ఆస్పత్రులకు రిఫర్‌ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎవరికైనా మేజర్‌ యాక్సిడెంట్‌ జరిగిందంటే ఎక్స్‌రే అత్యంత కీలకం. ఈ సీహెచ్‌సీలో ఎక్స్‌రే గది ఒకటి కేటాయించారు. కానీ, అందులో ఎక్స్‌రే మిషన్లులేవు. ఇంకో విచిత్ర ఏమిటంటే ఎక్స్‌రే మిషన్లు లేకపోయినా ఇటీవల రేడియోగ్రాఫర్‌గా రవికుమార్‌ అనే వ్యక్తిని నియమించారు. ఏ పని లేక అతడు ఓపీ రికార్డులు రాసుకొని కాలం వెళ్లదీస్తున్నారు. ఈసీజీ మిషన్‌ ఉన్నప్పటికీ అది చిన్నది కావ డంతో రోగులకు కొంత ఇబ్బంది కలుగుతోంది. చినమేరంగి ఆస్పత్రికి పక్కనే రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి నివాసం ఉన్నా కనీసం ఆమె ఇక్కడి పరిస్థితులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఉన్నతాధికారుల దృష్టిలో ఉంది

ఆస్పత్రిలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ లెటర్‌ రూపంలో ఉన్నతాధికారులకు తెలియజేశాం. ఇవన్నీ ప్రస్తుతం ప్రభుత్వం, రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌ ఉన్నతాధికారుల దృష్టిలో ఉన్నాయి.

-టీకే సునీల్‌కుమార్‌, ఆస్పత్రి సూపరింటెండెంట్‌, చినమేరంగి

Updated Date - 2023-06-03T00:42:07+05:30 IST