ఓటు హక్కు ఉందా?
ABN , First Publish Date - 2023-11-04T00:03:36+05:30 IST
గత నెలలో ఎన్నికల సంఘం విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో చూసుకోండి. ఆ జాబితాలో మీ పేరు లేకుంటే ఓటు హక్కు పొందేందుకు ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. దీనికోసం శని, ఆదివారం ప్రత్యేక శిబిరాలు నిర్వహించనుంది.
- అందులో పేరు లేదంటే దరఖాస్తు చేసుకోండి
- వజ్రాయుధం పొందేందుకు మరో అవకాశం
- నేడు, రేపూ ప్రత్యేక శిబిరాలు
పార్వతీపురం, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): గత నెలలో ఎన్నికల సంఘం విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో చూసుకోండి. ఆ జాబితాలో మీ పేరు లేకుంటే ఓటు హక్కు పొందేందుకు ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. దీనికోసం శని, ఆదివారం ప్రత్యేక శిబిరాలు నిర్వహించనుంది. 18 ఏళ్లు నిండిన వారంతా ఈ శిబిరాలకు వచ్చి ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ముసాయిదా ఓటరు జాబితాను బూత్ లెవెల్ స్థాయిలో ఉంచినట్టు యంత్రాంగం చెబుతోంది. అయితే, జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఈ జాబితా బీఎల్వోల వద్దే ఉన్నాయి. వాటిని పరిశీలించి ఓటు హక్కు లేని వారు దరఖాస్తు చేసుకోవాలి. దీనికోసం బూత్‌లెవెల్ స్థాయిలో శని, ఆదివారం ప్రత్యేక సంక్షిప్త సవరణ-24 పేరుతో ఓటరు జాబితాలో సవరణలు, కొత్తగా ఓటు నమోదుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం జిల్లాలో 1031 పోలింగ్ కేంద్రాల వద్ద బీఎల్వోలు ఉదయం 10 నుంచి సాయంత్రం 5వరకు అందుబాటులో ఉంటారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. 2024 జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబరు 1 నాటికి 18 ఏళ్లు నిండే అవకాశం ఉన్న వారంతా ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటరు జాబితాలో పేరు తొలగించేందుకు ఫారం 7, పేరు మార్పు, దిద్దుబాటు, చిరునామా, నియోజకవర్గం, ఫొటో మార్పు, పీడబ్ల్యూడీ గుర్తిం పు కోసం ఫారం 8 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో అయితే ఎన్‌వీఎస్‌పీ.ఇన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. చనిపోయిన వారి పేర్లు, స్థానికేతరుల పేర్లు జాబితాలో ఉం టే అభ్యంతరం తెలిపి దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యంతరాలు తెలిపేందుకు డిసెంబరు 9వ తేదీ గడువుగా నిర్ధారించారు. ఎక్కడైనా బీఎల్వోలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వెంటనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చు.
జాబితాలు ఎక్కడ?
ముసాయిదా ఓటరు జాబితాను బూత్ లెవెల్‌లో ప్రదర్శించినట్టు అధికారులు చెబుతున్నారు. కానీ, చాలా చోట్ల ఈ జాబితాలు కానరావడం లేదు. మరోపక్క బీఎల్వోలుగా ఉన్న వారు పంచాయతీ కార్యదర్శులుగా, వీఆర్వోలు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు తమ మాతృ విధులకు వెళ్లిపోతున్నారు. దీంతో ఓటర్ల జాబితా అందుబాటులో ఉండడం లేదు. ఫలితంగా జాబితాలోని తప్పులపై అభ్యంతరాలు తెలియజేసే అవకాశం ఉండడం లేదు. కనీసం సచివాలయ స్థాయిలో అయినా జాబితాలు ఉంచితే గ్రామంలోని ఓటర్లు తమ ఓటు పరిస్థితిని చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీనిపై అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో దృష్టిసారించి బూత్ స్థాయిలో ముసాయిదా ఓటరు జాబితాను అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.
మహిళా ఓటర్లే ఎక్కువ
జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో 7,70,525 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 3,76,220 మంది, మహిళా ఓటర్లు 3,94,240 మంది, ఇతరులు 65 మంది ఉన్నారు. గతంతో పోల్చుకుంటే 42,678 మంది ఓటర్లు జిల్లాలో పెరిగారు. సాలూరు నియోజకవర్గంలో 24,782మంది, పాలకొండ నియోజకవర్గంలో 11,593, కురుపాం నియోజకవ ర్గంలో 5,581 మంది, పార్వతీపురం నియోజకవర్గంలో 722 మంది ఓటర్లు పెరిగారు.