కౌన్సిలర్‌ పదవికి గుడ్‌బై

ABN , First Publish Date - 2023-03-31T00:09:56+05:30 IST

బొబ్బిలి పట్టణంలోని 21వ వార్డు మున్సిపల్‌ వైసీపీ కౌన్సిలర్‌ మరిశర్ల రామారావునాయుడు ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, కౌన్సిలర్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. స్థానిక సాహితీనగర్‌లోని తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తన రాజీనామా లేఖను చూపించారు.

కౌన్సిలర్‌ పదవికి గుడ్‌బై
విలేకరుల సమావేశంలో రాజీనామా లేఖను చూపుతున్న మరిశర్ల

ప్రకటించిన వైసీపీ నేత మరిశర్ల

పార్టీ సభ్యత్వానికీ రాజీనామా

పార్టీ బలోపేతానికి రూ.కోట్లు వెచ్చించానని ఆవేదన

మరికొంతమంది వైసీపీ నాయకుల రాజీనామా బాట

బొబ్బిలి, మార్చి 30: బొబ్బిలి పట్టణంలోని 21వ వార్డు మున్సిపల్‌ వైసీపీ కౌన్సిలర్‌ మరిశర్ల రామారావునాయుడు ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, కౌన్సిలర్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. స్థానిక సాహితీనగర్‌లోని తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తన రాజీనామా లేఖను చూపించారు. అనంతరం మరిశర్ల మాట్లాడుతూ పార్టీలో తనకు జరిగిన అన్యాయాన్ని, అవమానాలను ఏకరువు పెట్టారు. వైసీపీ ఆవిర్భవానికి పూర్వమే తమ కుటుంబమంతా డాక్టర్‌ వైఎస్‌ఆర్‌కు వీరాభిమానులమని చెప్పారు. ప్రస్తుతం చెలామణి అవుతున్న నాయకులంతా పార్టీలోకి రాకమునుపు నుంచే తాను బొబ్బిలి, పార్వతీపురం జిల్లాల్లో విస్తృతంగా పర్యటించానన్నారు. సామాజిక సేవల పేరుతో కోట్ల రూపాయలను వెచ్చించిన విషయాన్ని గుర్తు చేశారు. లైవ్‌ బ్లడ్‌బ్యాంకు, హెల్ప్‌డెస్క్‌, వేల సంఖ్యలో మొక్కల పంపిణీ, కరోనా కాలంలో టన్నుల కొద్దీ బియ్యం పంపిణీ ఇతరత్రా అనేక సేవలు అందించినట్లు వివరించారు. ఇదంతా పార్టీ బలోపేతం కోసమే చేశానన్నారు. పార్టీ సభ్యత్వాల నమోదులో ప్రథమంగా నిలిచినందున అప్పట్లో పార్టీ పెద్దలంతా ప్రత్యేకంగా అభినందించారని, కాని స్థానిక నాయకత్వం తనను ఉద్దేశపూర్వకంగా అణగదొక్కుతోందని ఆరోపించారు. వారి వైఖరి కారణంగానే పార్టీకోసం శ్రమించిన నాయకులంతా పార్టీకి దూరమైపోయారని అన్నారు. మున్సిపాలిటీ పాలకుల పరంగా ప్రజలకు ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. కౌన్సిలర్లంతా చాలా అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు.

మరికొంతమంది రాజీనామా బాట

బొబ్బిలి మున్సిపాలిటీకి 19 మంది వైసీపీ కౌన్సిలర్లు ఎన్నికయ్యారని, వారిలో తనతో పాటు 13 మంది తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని, వివిధ సందర్భాల్లో వారంతా నిరసన గళం వినిపించారని తెలిపారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న 21వ వార్డులో ప్రజాసమస్యలపై అక్కడి వారంతా అధికార పార్టీ నాయకులను అడిగితే తిరిగి తనపై దౌర్జన్యానికి దిగారన్నారు. అప్పుడే స్థానిక వైసీపీ నాయకుల పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత బయటపడిందన్నారు. ఇంకా అనేక మంది వైసీపీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఆయన వెంట సీనియర్‌ నాయకుడు నల్ల నాగభూషణం ఉన్నారు.

Updated Date - 2023-03-31T00:09:56+05:30 IST