తొమ్మిది నెలలుగా..!

ABN , First Publish Date - 2023-04-03T00:47:27+05:30 IST

పల్లెల్లో పారిశుధ్య నిర్వహణలో కీలకంగా వ్యవహరించే గ్రీన్‌ అంబాసిడర్ల పరిస్థితి దయనీయంగా మారింది. ఒకటి కాదు.. రెండు కాదు తొమ్మిది నెలలుగా గౌరవ వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

తొమ్మిది నెలలుగా..!
పారిశుధ్య పనులు చేస్తున్న గ్రీన్‌ అంబాసిడర్లు

ఆర్థిక ఇబ్బందులతో సతమతం

గుమ్మలక్ష్మీపురం: పల్లెల్లో పారిశుధ్య నిర్వహణలో కీలకంగా వ్యవహరించే గ్రీన్‌ అంబాసిడర్ల పరిస్థితి దయనీయంగా మారింది. ఒకటి కాదు.. రెండు కాదు తొమ్మిది నెలలుగా గౌరవ వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అర్ధాకలితో కాలం వెళ్లదీస్తున్నారు. అసలే అరకొర గౌరవ వేతనం.. అది కూడా సక్రమంగా ఇవ్వకపోవడంతో కుటుంబ పోషణకు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. సకాలంలో గౌరవ వేతనాలు అందించాలని గతంలో ఎన్నోసార్లు వారు నిరసన కార్యక్రమాలు చేపట్టినా కనీస చర్యలు శూన్యం. దీనిపై స్పందించేవారే కరువవడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. వాస్తవంగా జిల్లాలో 15 మండలాల్లో 972 మంది గ్రీన్‌ అంబాసిడర్లు పనిచేస్తున్నారు. ప్రతి పంచాయతీకి నలుగురికి తగ్గకుండా గత ప్రభుత్వ హయాం వారిని నియమించింది. కాగా ఆయా పంచాయతీల్లో వారు వీధులు శుభ్రపర్చడం, కాలువల్లో పూడికలు తీయడం వంటివి చేస్తున్నారు. పారిశుధ్య నిర్వహణ పనులు చేపట్టే గ్రీన్‌ అంబాసిడర్లకు నెలకు రూ. ఆరు వేల చొప్పున గౌరవ వేతనంగా చెల్లిస్తున్నారు. గతంలో స్వచ్ఛభారత్‌ నిధుల నుంచి వారికి వేతనాలు ఇచ్చేవారు. కాగా ఇటీవల ఆ నిధులు రాకపోవడంతో వీరికి చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గత తొమ్మిది నెలలుగా గౌరవ వేతనాలు అందడం లేదు. మెజార్జీ పంచాయతీల్లో ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో గ్రీన్‌ అంబాసిడర్లు ఆర్థికంగా అష్టకష్టాలు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారితో పాటు ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు. ఈ విషయమై జిల్లా పంచాయతీ అధికారి సత్యనారాయణను వివరణ కోరగా పంచాయతీల్లో అందుబాటులో ఉన్న నిధుల నుంచే గ్రీన్‌ అంబాసిడర్లకు గౌరవ వేతనాలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. అయితే కొన్ని పంచాయతీల్లో గ్రీన్‌ అంబాసిడర్లు పారిశుధ్య నిర్వహణ కార్యక్రమం చేపట్టడం లేదని, సకాలంలో విధులకు హాజరుకావడం లేదని ఆయన తెలిపారు.

Updated Date - 2023-04-03T00:47:27+05:30 IST