జరజాపుపేటలో కూలిన చెట్టు

ABN , First Publish Date - 2023-09-20T00:29:04+05:30 IST

నగర పంచాయతీ పరిధిలోని జరజాపుపేట రోడ్డులో ఈఎస్‌ఐ ఆసుపత్రి సమీపంలో రాజబంగారమ్మ గుడి వద్ద ఉన్న భారీ వృక్షం సగ భాగం మంగళవారం ఉదయం ఆరు గంటల సమయంలో కూలిపోయింది.

జరజాపుపేటలో కూలిన చెట్టు

నెల్లిమర్ల: నగర పంచాయతీ పరిధిలోని జరజాపుపేట రోడ్డులో ఈఎస్‌ఐ ఆసుపత్రి సమీపంలో రాజబంగారమ్మ గుడి వద్ద ఉన్న భారీ వృక్షం సగ భాగం మంగళవారం ఉదయం ఆరు గంటల సమయంలో కూలిపోయింది. పక్కనే ఉన్న తమ్మిన్ని లక్ష్మి, కడియం రమణ, కడియం బంగార్రాజులకు చెందిన మూడు పూరిళ్లుపై కొమ్మలు పడడంతో పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే ఆ ఇళ్లల్లో ఉన్న వారికి ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆ ఇళ్లల్లోని సామగ్రితో పాటు ఒక ద్విచక్రవాహనం, ఒక స్టిక్కరింగ్‌ మిషన్‌, కంప్యూటర్‌ ధ్వంసం అయినట్టు బాధితులు తెలిపారు. విషయం తెలుసుకున్న నగర పంచాయతీ వైస్‌ చైర్మన్‌ సముద్రపు రామారావుతో పాటు గ్రామ పెద్దలు, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, విద్యుత్‌ శాఖ అధికారులు అక్కడకు చేరుకుని విరిగిన కొమ్మలను తొలగించే చర్యలు చేపట్టారు. బాధిత కుటుంబాలకు స్థానికులు ఆసరా కల్పించారు. రోజంతా ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు అవస్థలు పడ్డారు. సంఘటన స్థలాన్ని వీఆర్వో వెంకటలక్ష్మి, ఆర్‌ఐ వై.సాహిత్య సందర్శించి నష్టాన్ని అంచనా వేశారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు, పార్టీ నాయకులు సువ్వాడ రవిశేఖర్‌, కంది చంద్రశేఖరరావు, పతివాడ అప్పలనారాయణ, అవనాపు సత్యనారాయణ, కర్రోతు సత్యనారాయణ, లెంక అప్పలనాయుడు బాధితులను పరామర్శ చేశారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Updated Date - 2023-09-20T00:29:04+05:30 IST