ఎన్నికల్లో లబ్ధి కోసమే డ్రామాలు
ABN , First Publish Date - 2023-05-02T00:13:04+05:30 IST
వచ్చే ఎన్నికల్లో లబ్ధి కోసమే సీఎం జగన్ కొత్త డ్రామాలు ఆడుతున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి ఆరోపించారు.
జగనాసురిడి బ్యానర్ చించివేత
పార్వతీపురం, మే1 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఎన్నికల్లో లబ్ధి కోసమే సీఎం జగన్ కొత్త డ్రామాలు ఆడుతున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి ఆరోపించారు. సోమవారం పార్వతీపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శ్రేణులతో కలిసి జగనాసుర రక్తచరిత్ర పేరిట తయారు చేసిన బ్యానర్‌ను చించివేసి నిరసన తెలిపారు. జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో రాక్షస పాలనకు స్వస్తి చెప్పాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ప్రజలను మోసగించి వైసీపీ అధికారంలోకి వచ్చిందన్నారు. విశాఖ ఎయిర్‌పోర్టులో కోడి కత్తి కేసుతో డ్రామాలు ప్రారంభించిందని చెప్పారు. ఈ సారి సీఎం జగన్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తఽథ్యమన్నారు. నవరత్నాల పేరిట ప్రజలకు పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు లాక్కొంటున్నారని ఆరోపించారు. సంక్షేమ కార్యక్రమాలన్నీ ఒట్ట్టి బూటకాలని విమర్శించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని రానున్న ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, పాలకొండ, కురుపాం నియోజకవర్గ ఇన్‌చార్జిలు నిమ్మక జయకృష్ణ, తోయిక జగదీశ్వరి మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. వారు నివసించే ప్రాంతాలేవీ అభివృద్ధికి నోచుకోవడం లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జి.సుదర్శనరావు, వెంకటనాయుడు, మధుసూదనరావు, జి.వెంకటనాయుడు, కృష్ణబాబు, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.
మోహరించిన పోలీసులు...
పార్వతీపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో టీడీపీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించక ముందే పోలీసులు ఆ ప్రాంతాన్ని మోహరించారు. నాయకులు కార్యాలయంలో ఉన్నంత సేపు వారు బయటే ఉన్నారు. సీఎం జగన్ దిష్టిబొమ్మ దహనం చేస్తారనే సమాచారంతో వారు అక్కడికి చేరారు. అయితే టీడీపీ నేతలు ఆ కార్యక్రమం చేపట్టకపోవడంతో పోలీసులు వెనుదిరిగారు.
చంద్రబాబు పర్యటన ఖరారు...
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటిస్తారని సంధ్యారాణి చెప్పారు. ఈ నెల 11న పాలకొండలో, 12న పార్వతీపురంలో పర్యటిస్తారన్నారు. టూర్‌ను విజయవంతం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఇతర జిల్లాల్లో జరిగిన సంఘటనల దృష్ట్యా కార్యకర్తలు, నాయకులతో పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. చంద్రబాబు కాన్వాయ్‌ను ఎవరైనా అడ్డుకుంటే దానిని సమర్థంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ఇటీవల చంద్రబాబు కాన్వాయ్‌పై దాడి చేయించిన మంత్రి సురేష్‌పై పోలీసులు చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు.