ఎవరి పరిధో తెలియక?
ABN , Publish Date - Dec 17 , 2023 | 11:49 PM
జిల్లాలో సచివాలయ ఎనర్జీ అసిస్టెంట్ గ్రేడ్-2 లైన్‌మెన్లు చాలామంది ప్రమాదాల బారిన పడుతున్నారు. వీరికి పనికి తగ్గ వేతన అందడం లేదు. నాలుగేళ్లుగా సేవలందిస్తున్నా ప్రభుత్వ ఉద్యోగు లుగా గుర్తించడం లేదు.
- రెండు శాఖల మధ్య నలిగిపోతున్న ఎనర్జీ అసిస్టెంట్లు
- నియామకం సచివాలయం ద్వారా.. నియంత్రణ విద్యుత్ శాఖది
- ఏ శాఖ ప్రయోజనం పొందని వైనం
- ప్రభుత్వం దిగిరాకుంటే సమ్మె చేస్తామని హెచ్చరిక
- ఈ ఏడాది మే 4న నెల్లిమర్ల మండలం చినబూరా డపేట గ్రామ సచివాలయ లైన్‌మన్ మద్దిల శివకిశోర్ విద్యుదాఘాతంతో మృతి చెందాడు. పొలాలకు సంబంధించిన విద్యుత్ లైన్ మరమ్మతులు చేస్తుండగా ప్రమాదం చోటుచేసుకుని ప్రాణాలు వదిలాడు. కిశోర్‌కు వృద్ధ తల్లిదండ్రులు ఉన్నారు. అయితే విద్యుత్ శాఖకు సంబంధించి పూర్తిస్థాయిలో పరిహారం మాత్రం అందలేదు. ఇతరత్రా రాయితీలేవీ దక్కలేదు
రాజాం, డిసెంబరు 17: జిల్లాలో సచివాలయ ఎనర్జీ అసిస్టెంట్ గ్రేడ్-2 లైన్‌మెన్లు చాలామంది ప్రమాదాల బారిన పడుతున్నారు. వీరికి పనికి తగ్గ వేతన అందడం లేదు. నాలుగేళ్లుగా సేవలందిస్తున్నా ప్రభుత్వ ఉద్యోగు లుగా గుర్తించడం లేదు. దీంతో గత మూడు వారాలుగా ఎనర్జీ అసిస్టెంట్లు నిరసన చేపడుతున్నారు. అయినా ప్రభుత్వంలో చలనం లేదు. దీంతో సమ్మె తప్పదని హెచ్చరిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 2019 అక్టోబరు 2న సచివాలయ వ్యవస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా 19 శాఖలకు సంబంధించి సహాయక కార్యదర్శుల నియామక ప్రక్రియ చేపట్టారు. అయితే ఎనర్జీ అసిస్టెంట్ల విషయంలో గత నాలుగు సంవత్సరాలుగా అస్పష్టత కొనసాగుతోంది. వీరు సచివాలయ పరిధిలో పనిచేయాలా? లేకుంటే విద్యుత్ శాఖ పరిధిలోనా అన్నది ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. దీంతో రెండువైపులా నలిగిపోతున్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా నియమితులై.. విద్యుత్‌శాఖ నియంత్రణలో పనిచేయాల్సి వస్తోంది. అటు సచివాలయ ఉద్యోగులకు అందుతున్న ప్రయోజనాలు కానీ.. ఇటు విద్యుత్ శాఖ ప్రయోజనాలు కానీ పొందలేని దయనీయ స్థితిలో ఉన్నారు.
జిల్లాలో పరిస్థితి..
జిల్లాలో 570 సచివాలయాలు ఉన్నాయి. 530 మంది సచివాలయ ఎనర్జీ అసిస్టెంట్స్ గ్రేడ్-2 లైన్‌మెన్లు పనిచేస్తు న్నారు. వీరంతా ఐటీఐ పూర్తిచేసిన వారే. జిల్లా ఎంపిక కమిటీల ద్వారా వీరిని ఎంపిక చేశారు. శారీర దారుఢ్య పరీక్షలతో పాటు స్తంభం ఎక్కడం, సైకిల్ తొక్కడం వంటి వాటిలో నైపుణ్య పరీక్ష నిర్వహించి ఎంపిక చేశారు. పదిరోజుల పాటు శిక్షణ ఇచ్చి సచివాలయ ఎనర్జీ అసిస్టెంట్లుగా నియమించారు. వీరికి వృత్తిపరమైన శిక్షణ కూడా ఇవ్వలేదు. సాధారణంగా విద్యుత్ శాఖ అంటే ప్రమాదకరమైనది. కానీ వీరికి అత్తెసరు శిక్షణనిచ్చి విధుల్లో నియమించడంపై విమర్శలు వచ్చాయి. కానీ ప్రభుత్వం పెడచెవినపెట్టింది. అయితే వీరు సచివాలయం పరిధిలో విధులు నిర్వహించాల్సి ఉన్నా.. విద్యుత్ శాఖ నియంత్రణలో పనిచేయాల్సి వస్తోంది. విద్యుత్ శాఖలో సిబ్బంది కొరతతో వీరిపై ప్రభావం చూపుతోంది. సచివాలయం దాటి పదుల సంఖ్యలో గ్రామాల్లో విధులు నిర్వహించాల్సి వస్తోంది. కొన్నిమండలాల్లో లైన్‌మెన్లు లేకపోవడంతో అయినదానికి.. కానిదానికి వీరే స్పందించాల్సి వస్తోంది. ఈ క్రమంలో వీరు కొన్నిసార్లు ప్రమాదాల బారిన పడుతున్నారు.
సమస్యలు ఇవే..
ఎనర్జీ అసిస్టెంట్లతో పాటు నియమితులైన సచివాలయ ఉద్యోగులందరికీ ప్రొబేషన్ డిక్లరేషన్ అయింది. కానీ వీరి విషయంలో మాత్రం ఎటూ తేల్చలేదు. అటు 010 ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించడం లేదు. సచివాలయాల జాబ్ చార్డు కూడా అమలు చేయడం లేదు. సెలవులకు సంబంధించి సీఎల్, ఈఎల్, మెడికల్, ఇతరత్రా సెలవులేవీ వీరికి దక్కడం లేదు. ఈఎహెచ్‌ఎస్ హెల్త్‌కార్డులు కూడా జారీ కావడం లేదు. మిగతా సచివాలయం ఉద్యోగులు మాదిరిగా వేతనాలతో పాటు గుర్తింపునివ్వాలని గత నాలుగు సంవత్సరాలుగా కోరుతూ వస్తున్నారు. కానీ వారిది అరణ్యరోదనగా మిగిలింది. అం దుకే వారు ఉద్యమబాట పట్టారు. గత నెల 27 నుంచి ఆందోళన చేపడుతున్నారు. అయినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. దీంతో ఈ నెల 26 నుంచి సచివాలయ కేంద్రాలకే విధులకు పరిమితమవుతామని చెబుతున్నారు. జనవరి 1 నాటికి ప్రభుత్వంలో చలనం లేకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.
ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి
సచివాలయ ఎనర్జీ అసిస్టెంట్లకు సంబంధించి డిమాండ్లు ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి. ప్రస్తుతానికి సచివాలయాల పరిధిలోనే వారు సేవలందిస్తున్నారు. విద్యుత్ శాఖలో సహాయకులుగా నిలుస్తున్నారు. గ్రామాల్లో విద్యుత్ కనెక్షన్ల మంజూరు, మరమ్మతులు చేపడుతున్నారు. ప్రభుత్వం వారిని ప్రత్యేక పరిగణలోకి తీసుకొని సమస్యలపై దృష్టిపెట్టింది. త్వరలో సమస్యలు తప్పకుండా పరిష్కారమవుతాయి.
-నాగేశ్వరరావు, విద్యుత్ శాఖ ఎస్‌ఈ, విజయనగరం