Share News

ఇలాగే చేస్తారా..?

ABN , First Publish Date - 2023-12-08T00:01:52+05:30 IST

(జియ్యమ్మవలస) వెలుగు ద్వారా ఏర్పడిన రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్‌పీజీ) పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వారు అనేక ఇబ్బందులు పడుతున్నా.. పట్టించుకునే వారే కరువయ్యారు. వాస్తవంగా మండలంలో 2016-17లో 210 రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పడ్డాయి.

 ఇలాగే చేస్తారా..?
మండల మహిళా సమాఖ్య భవనం

- సీసీని బదిలీ చేసి.. వేరొకర్ని నియమించని ఉన్నతాధికారులు

- 6 నెలలుగా పోస్టు ఖాళీ

- ఇబ్బందుల్లో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు

(జియ్యమ్మవలస)

వెలుగు ద్వారా ఏర్పడిన రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్‌పీజీ) పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వారు అనేక ఇబ్బందులు పడుతున్నా.. పట్టించుకునే వారే కరువయ్యారు. వాస్తవంగా మండలంలో 2016-17లో 210 రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పడ్డాయి. ఇందులో మొత్తం రెండు వేలకు పైగా రైతులు సభ్యులుగా ఉన్నారు. వీరు బ్యాంకుల్లో గ్రూపులుగా అకౌంట్లు తెరిచారు. ముందుగా తీర్మానం చేసుకున్న విధంగా ప్రతినెలా వారు పొదుపు జమ చేస్తున్నారు. ఇందుకోసం వెలుగు ద్వారా ఒక సీసీని నియమించారు. అయితే రైతుల వ్యవసాయ అవసరాల కోసం 2017-18, 2018-19 ఆర్థిక సంవత్సరాల్లో 69 గ్రూపుల్లో 138 మందికి రూ. 34 లక్షలు లోను రూపంలో ఇచ్చారు. వీరి నుంచి ఈ ఏడాది జూన్‌ వరకు రూ. 22 లక్షలు రిక వరీ చేశారు. 14 గ్రూపులైతే పూర్తిగా రీపేమెంట్‌ చేశారు.అయితే లోను పొందని మిగిలిన గ్రూపులు రుణాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇదంతా సక్రమంగా చూస్తూ రైతులకు ఎటువంటి ఇబ్బందులు రానీయకుండా సేవలందించిన సీసీ గుల్ల ఈశ్వరమ్మను ఈ ఏడాది జూన్‌లో ఇక్కడి నుంచి కొమరాడ మండలానికి బదిలీ చేశారు. కానీ ఇప్పటివరకు ఆమె స్థానంలో వేరెవరినీ నియమించలేదు. ఆ పోస్టు ఖాళీగానే ఉంది. దీంతో మిగిలిన రూ. 12 లక్షలు రికవరీ అవుతుందా? లేదా ! అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు ఖరీఫ్‌ కాలంలో రైతులకు సబ్సిడీపై టార్పాలిన్లు, దుక్కి సెట్లు, దమ్ము సెట్లు అందించడం లేదు. సీసీని నియమించకపోవడం వల్ల వెలుగులో పని చేస్తున్న ఏపీఎం, సీసీలు రైతులకు ఏమి సమాధానం చెప్పాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు సీసీని నియ మించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

పీవోకు లేఖ ఇచ్చాం

జియ్మమ్మవలస మండలంలో ఎఫ్‌పీజీకి ప్రత్యేకంగా సీసీ అవసరం. దీనిని దృష్టిలో పెట్టుకొని గతంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి గ్రీవెన్స్‌లో లేఖ ఇచ్చాం.

- ఎం.నాగభూషణరావు, ఏపీఎం, వెలుగు సమాఖ్య, జియ్యమ్మవలస మండలం

Updated Date - 2023-12-08T00:01:54+05:30 IST