Share News

జేజేఎం పనులపై నిర్లక్ష్యం వద్దు

ABN , First Publish Date - 2023-11-21T23:59:54+05:30 IST

గ్రామాల్లో ఇంటింటికీ తాగునీరు అందించేందుకు చేపడుతున్న జలజీవన్‌ మిషన్‌ పనులపై నిర్లక్ష్యం వహించరాదని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ తెలిపారు.

జేజేఎం పనులపై నిర్లక్ష్యం వద్దు
పైపులైన్లు ఏర్పాటుపై ఆరా తీస్తున్న కలెక్టర్‌

గరుగుబిల్లి, నవంబరు 21 : గ్రామాల్లో ఇంటింటికీ తాగునీరు అందించేందుకు చేపడుతున్న జలజీవన్‌ మిషన్‌ పనులపై నిర్లక్ష్యం వహించరాదని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ తెలిపారు. మంగళవాం దత్తివలసలో ఇంటింటికీ కొళాయిల ఏర్పాటు పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనుల నిర్వహణలో వెనుకంజపై కొంతమేర అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో గుర్తించిన గ్రామాల్లో కొళాయిల ఏర్పాటుపై అలసత్వం వహించరాదన్నారు. నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలన్నారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. మండలాలవారీగా మంజూరైన పథకాల పనితీరుపై తాగునీటి విభాగం ఈఈ ప్రభాకర్‌ను ప్రశ్నించారు. అనంతరం రక్షిత నీటి పథకాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు బోరును ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను కోరారు. గ్రామంలో డ్రైనేజీ సమస్య ఉందని గ్రామస్థులు తెలియజేయగా.. కొళాయిల పనులు పూర్తయిన తర్వాత పక్కా కాలువలు ఏర్పాటు చేస్తామని కలెక్టర్‌ తెలిపారు. ఈ పరిశీలనలో ఈఈ ప్రభాకర్‌, జేఈ జి.గౌరీశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

వివిధ గ్రామాల్లో పర్యటన

పాలకొండ: వీరఘట్టం మండలం విక్రంపురం, నుడకూరు, టీకే రాజపురం, పాలకొండ మండలం తుమరాడ గ్రామాల్లోనూ కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ విస్తృతంగా పర్యటించి జలజీవన్‌మిషన్‌ పనులను పరిశీలించారు. ఇప్పటివరకు ఏర్పాటు చేసిన కొళాయిలు, పూర్తికావాల్సిన పనుల వివరాలను ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజనీరింగ్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి ట్యాంక్‌లు, పైప్‌లైన్‌ల ద్వారా నీటి సరఫరా, ట్యాప్‌ల నాణ్యతను తనిఖీ చేశారు. నడుకూరు కాలనీలోని శివారు ప్రాంతం వరకు వెళ్లి కొళాయిల నుంచి సరఫరా అవుతున్న నీటి ప్రవాహం, సామర్థ్యాన్ని పరిశీలించారు. ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అని మహిళలను ప్రశ్నించారు. టీకే రాజపురంలో 40 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ పనులను డిసెంబరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. విక్రంపురంలో వారం రోజుల్లోగా హెడ్‌డీపీ పైప్‌లైన్‌ ఏర్పాటు చేసి ఇంటింటికీ కొళాయి కలెక్షన్లు సిద్దం చేయాలన్నారు. పాలకొండ డీఈపీ ఢిల్లేశ్వరరావు, పాలకొండ, వీరఘట్టం ఏఈలు, ఇంజనీరింగ్‌ సహాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-21T23:59:55+05:30 IST