శంబరకు పోటెత్తిన భక్తులు

ABN , First Publish Date - 2023-03-15T00:02:28+05:30 IST

శంబర పోలమాంబ ఎనిమిదో వారం జాతరకు భక్తులు పోటెత్తారు. మంగళవారం వనం, చదురు గుడుల వద్ద అమ్మవారి దర్శనానికి బారులుదీరారు. .

 శంబరకు పోటెత్తిన భక్తులు
అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులు

సాలూరు రూరల్‌/మక్కవ, మార్చి 14: శంబర పోలమాంబ ఎనిమిదో వారం జాతరకు భక్తులు పోటెత్తారు. మంగళవారం వనం, చదురు గుడుల వద్ద అమ్మవారి దర్శనానికి బారులుదీరారు. . ఉచిత, రూ. 50 క్యూలైన్లన్నీ నిండిపోయాయి. ఒడిశా, ఛత్తీస్‌ఘడ్‌తో పాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తజనం మొక్కుబడులు చెల్లించుకున్నారు. అనంతరం తోటల్లో వంటలు చేసుకొని కుటుంబ సభ్యులతో కలిసి భోజనాలు చేశారు. జాతర సందర్భంగా శంబరలో పలు దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. వీధుల్లోనూ భక్తుల సందడి కనిపించింది. ఎవరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం ఈవో రాధాకృష్ణ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఉచితంగా ప్రసాదం, తాగునీరు పంపిణీ చేశారు.

బండి ఎక్కడ పెట్టినాపార్కింగ్‌ ఫీజు ఇవ్వాల్సిందే..

శంబర ఎనిమిదో జాతరలో వాహన పార్కింగ్‌ వేలం పాడుకున్న నిర్వాహకులు తీరుపై భక్తులు విస్మయం వ్యక్తం చేశారు. వాహనం పార్కింగ్‌ ప్రదేశాల్లో ఉంచితే ఫీజు తీసుకోవడం సహజం. కాగా శంబరలో ఎక్కడ వాహనం పార్కింగ్‌ చేసినా ఫీజు ఇవ్వాలని నిర్వాహకుల్లో ఒకరిద్దరు వాహనదారులను డిమాండ్‌ చేశారు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పార్కింగ్‌ ప్రదేశాల్లో వాహన ఉంచాలనే ఉద్దేశంతో రోడ్డుకు అడ్డంగా వారు స్టాపర్లు ఉంచడంపై వాహనదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయమై శంబర పంచాయతీ కార్యదర్శి ప్రతాప్‌ను వివరణ కోరగా పరిశీలిస్తామన్నారు. ఈవో రాధాకృష్ణ వద్ద ప్రస్తావించగా పంచాయతీ కార్యదర్శితో మాట్లాడి.. ఇకపై ఇలా జరగకుండా చూస్తామని చెప్పారు.

Updated Date - 2023-03-15T00:02:28+05:30 IST