మ్యుటేషన్ల జారీలో జాప్యం తగదు

ABN , First Publish Date - 2023-03-26T00:31:05+05:30 IST

మ్యుటేషన్ల జారీ విషయంలో జాప్యం తగదని జాయింట్‌ కలెక్టర్‌ ఒ.ఆనంద్‌ తెలిపారు. భూముల రీ సర్వే పక్కాగా నిర్వహించాలన్నారు.

 మ్యుటేషన్ల జారీలో జాప్యం తగదు
సమావేశంలో మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌

పార్వతీపురం, మార్చి 25(ఆంధ్రజ్యోతి): మ్యుటేషన్ల జారీ విషయంలో జాప్యం తగదని జాయింట్‌ కలెక్టర్‌ ఒ.ఆనంద్‌ తెలిపారు. భూముల రీ సర్వే పక్కాగా నిర్వహించాలన్నారు. శనివారం కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం తయారు చేసిన సర్వే రికార్డులే రానున్న తరాలకు ప్రామాణికమని తెలిపారు. పక్కాగా సర్వే నిర్వహించి రైతులకు తప్పులులేని భూహక్కు పత్రాలను అందించాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో గ్రామ రెవెన్యూ అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సాంకేతిక సమస్యలను పరిష్కరించినప్పటికీ కొన్ని మండలాల్లో మ్యుటేషన్ల జారీలో జాప్యం జరుగుతోందన్నారు. ఇకపై ఎటువంటి లోపాలు లేకుండా చూసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీవో కె.హేమలత, మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, మండల, విలేజ్‌ సర్వేయర్లు, గ్రామ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

అన్ని రంగాల్లో రాణించాలి..

అన్ని రంగాల్లో మహిళలు రాణించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఆనంద్‌ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని గత పదిహేను రోజులుగా పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలో నిర్వహిస్తున్న వేడుకలు శనివారం ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జేసీ మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడిన మన్యం జిల్లాలో విద్యా ,వైద్య,శిశు సంక్షేమ రంగాల్లో ఎంతోమంది మహిళా ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. జిల్లాకు మంచి పేరు తీసుకురావడంలో వారి పాత్ర ఎంతో గొప్పదని కొనియాడారు. అనంతరం వివిధ అంశాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలకు పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కె.హేమలత, స్ర్తీ శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి విజయగౌరి, డీఈవో రమణ, డీఎంహెచ్‌వో జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-26T00:31:05+05:30 IST