వారికి చల్లని గాలి.. వీరికి వడగాడ్పులు

ABN , First Publish Date - 2023-06-03T00:03:18+05:30 IST

ఎండలు మండుతున్న దశలో.. ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్న పరిస్థితిలో యంత్రసేవ మెగా మేళాకు హాజరైన రైతులు, అధికారులు, పోలీసులు ఆపసోపాలు పడ్డారు.

వారికి చల్లని గాలి.. వీరికి వడగాడ్పులు
ఉక్క పోతతో అవస్థలకు గురవుతున్న మహిళలు:

విజయనగరం(ఆంధ్రజ్యోతి): ఎండలు మండుతున్న దశలో.. ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్న పరిస్థితిలో యంత్రసేవ మెగా మేళాకు హాజరైన రైతులు, అధికారులు, పోలీసులు ఆపసోపాలు పడ్డారు. సమావేశానికి ఎందుకొచ్చామంటూ విసిగెత్తిపోయారు. కోట జంక్షన్‌లో శుక్రవారం మంత్రి బొత్స సత్యాన్నారాయణ ముఖ్యఅతిధిగా పాల్గొన్న యంత్రసేవ మేగా మేళాలో రైతులు, అధికారులు, పోలీసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం కనిపించింది. స్టేజీపైన కూర్చొన్న వారికే కూలర్‌లు ఏర్పాటు చేశారు. టెంటుకింద కూర్చొన్న అధికారులు, రైతులకు మాత్రం 2, 3 ఫ్యాన్‌లతో సరిపెట్టారు. అవి కూడా మధ్యలోనే ఏర్పాటు చేయటంతో వెనక.. ముందున్న వారు చెమటలు కక్కారు. వేడి గాలులు వీయడంతో వడగాడ్పులకు గురవుతామన్న భయం వారిలో కనిపించింది. కార్యక్రమం కూడా ఆలస్యంగా మొద లుకావడంతో మండుటెండలో మరింత ఉక్కబోతకు గురయ్యారు. అధికారిక కార్యక్రమానికి వైసీపీ రంగులతో కూడిన బెలూన్‌లను అలంకరించట డంపైనా పలు విమర్శలు విన్పించాయి.

రైతు బలోపేతమే లక్ష్యం: బొత్స

రైతులను ఆర్థికంగా బలోపేతం చెయ్యటమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి బొత్స సత్యన్నారాయణ అన్నారు. నగరంలోని కోట కూడలిలో శుక్రవారం యంత్ర సేవా పథకం రెండోవిడత కింద యంత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీలో ప్రభుత్వం గ్రూపునకు 40 శాతం సబ్సిడీని, 50 శాతం బ్యాంకు రుణం అందచేస్తుందని, 10 శాతం మాత్రమే గ్రూపు సభ్యులు చెల్లిస్తే సరిపోతుందన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ మజ్జిశ్రీనివాసరావు, కలెక్టర్‌ నాగలక్ష్మి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, మేయర్‌ వి.విజయలక్ష్మీ, డీసీఎంఎస్‌ చైర్‌పర్సన్‌ అవనాపు భావన, కోలగట్ల శ్రావణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T00:03:18+05:30 IST