సీఎం వస్తున్నారని.. విద్యా సంస్థలకు సెలవు!
ABN , First Publish Date - 2023-06-26T00:23:56+05:30 IST
అమ్మఒడి కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 28న కురుపాం రానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రక్షణ అవసరాల దృష్ట్యా కల్టెకర్ నిశాంత్‌కుమార్ ఆదేశాల మేరకు కురుపాంలో విద్యా సంస్థలకు మూడు రోజుల పాటు సెలవు ప్రకటించారు.
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో 28న సీఎం పర్యటన
పార్వతీపురం- ఆంధ్రజ్యోతి/కురుపాం, జూన్25: అమ్మఒడి కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 28న కురుపాం రానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రక్షణ అవసరాల దృష్ట్యా కల్టెకర్ నిశాంత్‌కుమార్ ఆదేశాల మేరకు కురుపాంలో విద్యా సంస్థలకు మూడు రోజుల పాటు సెలవు ప్రకటించారు. బహిరంగ సభ, హెలీప్యాడ్‌ఏర్పాట్లు, ఉన్నతాధికారులు, పోలీసులు, ఇతర సెక్యూరిటీ సిబ్బంది ఉండడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. సీఎం పర్యటన నేపథ్యంలో జియ్యమ్మవలస మండలం చినమేరంగిలోని పాలిటెక్నికల్ కళాశాల ఆవరణలో హెలీప్యాడ్ ఏర్పాటు చేయనున్నారు. అక్కడకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కురుపాంలో ఓ ప్రైవేట్ పాఠశాలకు ఆనుకుని ఉన్న స్థలంలో సభా వేదికను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వాహనాలను పార్కింగ్ చేయనున్నారు. సీఎం సెక్యూరిటీ కోసం కురుపాంలోని పోస్టుమెట్రిక్ బోయ్స్ హాస్టల్ వినియోగించనున్నారు. ఈ క్రమంలో వాటితో పాటు ఆ గ్రామంలోని జడ్పీ హైస్కూల్, ప్రాథమిక పాఠశాలలు, ఏపీ మోడల్ స్కూల్, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో పోలీసులు, ఇతర సిబ్బంది ఉండడం కోసం ఈ నెల 26, 27, 28 వరకు మూడు రోజుల పాటు సెలవు ప్రకటించారు.
పోస్టుమెట్రిక్ హాస్టల్, కళాశాలకు మెరుగులు
సీఎం జగన్ పర్యటన సందర్భంగా కురుపాంలో ఏర్పాటు చేయనున్న సభా ప్రాంగణం సమీపంలో పోస్టుమెట్రిక్ బోయ్స్ హాస్టల్, ప్రభుత్వ జూనియర్ కళాశాలకు రంగులు వేసి మెరుగులు దిద్దుతున్నారు. అయితే పోస్టుమెట్రిక్ బోయ్స్ హాస్టల్ లోపల గదులకు మాత్రం రంగులు వేయడం లేదు. భవనం బయట ఉన్న గోడలకు మాత్రమే రంగులు వేయడం స్థానికంగా చర్చనీయాంశమవుతోంది.