Share News

మార్పును ఆహ్వానించాలి

ABN , Publish Date - Dec 18 , 2023 | 12:26 AM

ప్రేక్షకుల అభిరుచి బట్టే సినిమాలు వస్తున్నాయని, మార్పును ఆహ్వానించాలని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్‌ తెలిపారు.

  మార్పును ఆహ్వానించాలి
మాట్లాడుతున్న మాధవపెద్ది సురేష్‌

సాలూరు రూరల్‌, డిసెంబరు 17: ప్రేక్షకుల అభిరుచి బట్టే సినిమాలు వస్తున్నాయని, మార్పును ఆహ్వానించాలని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్‌ తెలిపారు. ఘంటసాల నిర్విరామ నీరాజన కార్యక్రమంలో భాగంగా ఆదివారం సాలూరు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రెండ్‌కు అనుగుణంగా పనిచేసే వారే సినీ పరిశ్రమలో మనగలుగుతారని తెలిపారు. సినీ సంగీతంలో ఏఆర్‌ రెహమాన్‌ వచ్చిన తరువాత విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని, ఇంటి నుంచే రికార్డింగ్‌ ప్రక్రియ ( హోం టు వర్క్‌ ) వచ్చిందని చెప్పారు. కరోనా వల్ల ప్రేకక్షుల సినిమా చూసే ధోరణి సైతం మారిందన్నారు. మంచి కథ ఉంటే.. భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తున్నారన్నారు. ప్రైవేట్‌ చానల్‌, ఓటీటీ వల్ల గాయకులు, నటులకు అవకాశాలు పెరిగాయని, థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య మాత్రం కాస్త తగ్గిందని చెప్పారు. తమ కుటుంబం ఐదు తరాలుగా సినీ పరిశ్రమలో మనుగడ సాగి స్తున్నట్లు తెలిపారు. తాను మ్యూజిక్‌ డైరెక్టర్‌గా 50 సినిమాలు చేశానని, రెండు నంది అవార్డులు తీసుకున్నానని వెల్లడించారు. తమ కుమార్తె నాగలక్ష్మి కుమా రుడు శ్యాం హిరోగా చేసిన తమిళ సినిమా త్వరలో విడుదల కానుందన్నారు. మరో మనువడు సుసేంద్రన్‌ తమిళంలో హీరోగా, డైరెక్టర్‌గా ఉన్నారని తెలిపారు.

సాలూరుతో అనుబంధం

తన భార్య నిర్మలకు సాలూరుతో అనుబంధం ఉందన్నారు. ఆమె తండ్రి ఎస్‌జే సుందర్‌రావు 1960, 1974ల్లో సాలూరు మున్సిపల్‌ కమిషనర్‌గా పనిచేశారని చెప్పారు. తన మామయ్య పని చేసిన ఊరు కావడం, ప్రముఖ సినీ సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు పుట్టి పెరిగిన ఊరు, మధుర గాయకుడు ఘంటసాల శిష్యరికం చేసిన పట్టణం కావడంతో.. పిలవగానే కాదనుకుండా ఇక్కడకు వచ్చినట్లు తెలిపారు.



Updated Date - Dec 18 , 2023 | 12:26 AM