చంద్రబాబును కక్షపూరితంగా జైలుకు పంపించారు
ABN , Publish Date - Dec 17 , 2023 | 11:51 PM
వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగానే ఎటువంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును జైలుకు పంపించిందని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు.
- కుట్రదారుల అంతుచూస్తాం
- మూడు నెలలు ఓపికపట్టండి
- మాజీ మంత్రి దేవినేని ఉమ
రాజాం, డిసెంబరు 17: వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగానే ఎటువంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును జైలుకు పంపించిందని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. ఆదివారం కిమిడి కళావెంకటరావు క్యాంపు కార్యాలయంలో ఎచ్చెర్ల నియోజకవర్గ పరిధిలోని జి.సిగడాం మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పరిశీలకునిగా హాజరై మాట్లాడారు. మూడు నెలల్లో చంద్రబాబును ముఖ్యమంత్రిగా చూస్తామన్నారు. ఎవరైతే కుట్రదారులు ఉన్నారో వారందరి అంతు చూస్తామన్నారు. ఈ విషయంలో ఎవరిని విడిచిపెట్టేది లేదన్నారు 45 రోజులు చంద్రబాబును జైల్లో ఉంచిన సీఐడీ అధికారులు కోర్టుకు ఎందుకు ఎటువంటి ఆధారాలు చూపించలేకపోయారని ప్రశ్నించారు. మరో మూడు నెలలు ఓపిక పట్టాలని కార్యకర్తలకు సూచించారు. ఈ నెల 20న జరిగే యువగళం ముగింపు సభకు ప్రతి మండలం నుంచి భారీ స్థాయిలో కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. పొలిట్ బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం త్వరలో పతనం కావడం ఖాయమన్నారు. లోకేష్ చేపడుతున్న యువ గళం పాదయాత్రకు ప్రజలు నీరాజనం పడుతున్నారని తెలిపారు. యువగళం ముగింపు సభను జయప్రదం చేయాలంటే భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చేలా అం దరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయ కులు కుమరాపు రవికుమార్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.