Share News

ఉల్లిని కొనలేమా!

ABN , First Publish Date - 2023-11-06T00:01:41+05:30 IST

ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మొన్నటి వరకూ టమాట ధర మోత మోగించగా.. ఇప్పుడు ఆ వంతు ఉల్లికి వచ్చింది. కిలో ఉల్లి రూ.100కు ఎగబాకింది. ధర మరింత పెరగనుందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. పంట తగ్గడం, గోదాముల్లో నిల్వలు అయిపోవడమే ఉల్లి ధర పెరగడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

ఉల్లిని కొనలేమా!

ఉల్లిని కొనలేమా!

కిలో రూ.100కు పెరిగిన వైనం

నిల్వలు తగ్గడమే కారణం

కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు

రాజాం, నవంబరు 5: ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మొన్నటి వరకూ టమాట ధర మోత మోగించగా.. ఇప్పుడు ఆ వంతు ఉల్లికి వచ్చింది. కిలో ఉల్లి రూ.100కు ఎగబాకింది. ధర మరింత పెరగనుందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. పంట తగ్గడం, గోదాముల్లో నిల్వలు అయిపోవడమే ఉల్లి ధర పెరగడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. సెప్టెంబరు మొదటి వారంలో కిలో ఉల్లి ధర రూ.30 ఉండేది. రెండో వారం నుంచి ధర పెరుగుతూ వచ్చింది. ఆదివారం సాయంత్రానికి ధర రూ.90 నుంచి రూ.100 వరకూ ఉంది. మార్కెట్‌ పరంగా విజయవాడ నుంచి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు ఉల్లి సరఫరా అవుతోంది. మహారాష్ట్ర, కర్ణాటకలో ఉల్లి సాగు ఎక్కువ. అయితే రెండు నెలల కిందట అక్కడ కురిసిన భారీ వర్షాలకు పంట పాడైంది. ఇటు గోదాముల్లో స్టాకు చేసిన ఉల్లి సైతం తగ్గుముఖం పట్టింది. మన రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో ఉల్లి ఎక్కువగా సాగుచేస్తుంటారు. అక్కడ వర్షాభావ పరిస్థితులు తలెత్తడంలో ఉల్లి లభ్యత తగ్గింది. కర్నూలు మార్కెట్‌కు రోజుకు వేలాది క్వింటాళ్ల ఉల్లి నిల్వలు రావాల్సి ఉండగా.. ప్రస్తుతం 5000 క్వింటాళ్లకు మించి రావడం లేదు. దీంతో ధర అమాంతం పెరిగింది. జిల్లాకు సగటున రోజుకు రెండు వేల క్వింటాళ్లు అవసరమని వ్యాపారవర్గాలు చెబుతున్నాయి కానీ 500 క్వింటాళ్లకు మించి స్టాకు రావడం లేదని.. ఆ ప్రభావం ధరపై పడుతోందని అభిప్రాయపడుతున్నారు.

జిల్లాలో తగ్గిన పంట సాగు

జిల్లాలో రామభధ్రపురం, బొబ్బిలి, గజపతినగరం, డెంకాడ,భోగాపురం, పూసపాటిరేగ, ఎస్‌.కోట మండలాల్లోని మెట్ట ప్రాంతాల్లో రైతులు ఉల్లిని సాగుచేస్తుంటారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు రైతులను దారుణంగా దెబ్బతీశాయి. రైతులకు సాగు సలహాలు కూడా లేకపోవడంతో అరకొరగా పండించారు. వాటిని సంరక్షించుకొని పంటను సొంతంగా వినియోగించే పరిస్థితి నెలకొంది.

Updated Date - 2023-11-06T00:01:43+05:30 IST