తీర్మానంపై భగ్గు!

ABN , First Publish Date - 2023-03-26T00:31:19+05:30 IST

బోయ, వాల్మీకీలు, బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాల్లో చేర్చేందుకు శాసనసభ ఆమోదించడంపై ఆదివాసీలు ఆందోళన చెందుతున్నారు. సర్కారు తీరుపై భగ్గుమంటున్నారు.

తీర్మానంపై భగ్గు!
గుమ్మలక్ష్మీపురం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న గిరిజన సంఘం నాయకులు

సర్కారు తీరుపై ఆగ్రహం

గిరిజన ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చేందుకు కార్యాచరణ

జిల్లావ్యాప్తంగా నిరసనలు

(పార్వతీపురం- ఆంధ్రజ్యోతి)

బోయ, వాల్మీకీలు, బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాల్లో చేర్చేందుకు శాసనసభ ఆమోదించడంపై ఆదివాసీలు ఆందోళన చెందుతున్నారు. సర్కారు తీరుపై భగ్గుమంటున్నారు. ఎస్టీ జాబితాలో ఆయా కులస్థులను చేర్చేందుకు వీల్లేదని ఇప్పటికే గిరిజన సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున జిల్లాలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్‌ 52ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆదివాసీల జేఏసీ, ప్రజా ప్రతినిధులతో చర్చించకుండా బోయ, వాల్మీకీ, బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు సర్కారు తీర్మానం చేసి కేంద్రానికి పంపించడంపై ఆదివాసీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా జిల్లాలో 2,60,419మంది గిరిజనులున్నారు. పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల పరిధిలో కొండ దొర, సవర, గదబ, ఎరుకుల మూకదొర, మన్నేదొర, ఎంటికొండ, బగత తదితర ఉపకులాలకు చెందిన వారున్నారు. అయితే ఐటీడీఏల ద్వారా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నప్పటికీ అన్నింటా వారు ఎంతో వెనకబడి ఉన్నారు. దీనిని పట్టించుకోని ప్రభుత్వం కులాల మధ్య చిచ్చు రేపే విధంగా వ్యవహరిం చడంపై గిరిజన సంఘం నాయకులు మండిపడుతున్నారు. అసలు నాన్‌ షెడ్యూల్డ్‌ గ్రామాలను షెడ్యూల్డ్‌ ప్రాంతాలుగా గుర్తించాలని దశాబ్దాలుగా గిరిజనులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ఇటువంటి సమస్యను వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఓట్ల గేలంలో..

వైసీపీ ప్రభుత్వం ఏది చేసినా.. తెరవెనుక రాజకీయ వ్యూహం ఉంటుందనడంలో సందేహంలేదు. ఓట్ల గేలంలో భాగంగానే తాజా నిర్ణయం తీసుకుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత ఎన్నికల సమయంలో గిరిజనులకు అనుకూలంగా మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాలను అన్నింటా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చిన వైసీపీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీడీఏలను నిర్వీర్యం చేసే దిశగా అడగులు వేసింది. దీంతో వచ్చే ఎన్నికల్లో గిరిజనుల నుంచి వ్యతిరేకత తప్పదని గ్రహించిన వైసీపీ ముందస్తుగా బోయ, వాల్మీకి, బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు తీర్మానం చేసిందనే వాదనలు లేకపోలేదు. వాస్తవంగా ఎస్టీ జాబితాలో కొత్తకులాలను చేర్చాలంటే కేంద్రంతో పాటు లోక్‌సభ, రాజ్యసభ ఆమోదించాల్సి ఉంది. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయో.. జరగవో తెలియదు గానీ వైసీపీ ప్రభుత్వం తాజాగా అసెంబ్లీలో తీర్మానం చేయడంపై గిరిజనులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. కాగా దీనిని వ్యతిరేకించాలని గిరిజన ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చేందుకు జిల్లాకు చెందిన ఆదివాసీలు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అవసరమైతే రాజీనామాలకు సిద్ధం కావాలని డిమాండ్‌ చేస్తున్నారు.

నిరసనాగ్రహం

సీతంపేట/సాలూరు/కురుపాం/గుమ్మలక్ష్మీపురం/పాచిపెంట: బీసీల్లో ఉన్న బోయ, వాల్మీకీ, బెంతు ఒరియాలను రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ జాబితాల్లో చేర్చేందుకు తీర్మానం చేయడం తగదని గిరిజన సంఘం, సీఐటీయూ నాయకులు అన్నారు. ఈ మేరకు శనివారం జిల్లావ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. భారీ ర్యాలీలు, ధర్నా, మానవహారం చేపట్టారు. గిరిజన ఎమ్మెల్యేలు ఆదివాసీల తరపున నిలవాలని డిమాండ్‌ చేశారు. గిరిజనులకు అన్యాయం చేయొద్దని సాలూరు, పాచిపెంట, కురుపాం, సీతంపేట, గుమ్మలక్ష్మీపురం తదితర చోట్ల పెద్దఎత్తున నినాదాలు చేశారు తక్షణమే ప్రభుత్వ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేకుంటే దశలవారీగా పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

హక్కులను హరించినట్లే...

రాష్ట్రంలో ఉన్న 40 లక్షల బోయ, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చితే ప్రస్తుతం ఉన్న 35 లక్షల మంది ఆదివాసీలకు రాజ్యాంగ పరంగా ఉన్న హక్కులను పరోక్షంగా హరించినట్లే. ఎన్నో దశాబ్దాలుగా బీసీలుగా ఉన్న వారిని ఇప్పుడు ఎస్టీల్లో చేర్చాలను కోవడం శోచనీయం. బోయ,వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాతే గిరిజనుల్లో జాతాపు, సవర, గదబ తెగల వారు మరింత వెనకబడిపోతారు. ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైనా కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చడానికి రాజ్యాంగ పరంగా కొన్ని పద్ధతులున్నాయి. వాటిని పాటించకుండా అసెంబ్లీలో తీర్మానం చేయడం చూస్తే.. ప్రభుత్వం కేవలం ఓట్లు రాజకీయం చేస్తోందని అర్థమవుతుంది. అన్ని వర్గాలను మోసం చేసినట్లు తెలుస్తోంది.

- వైరిచర్ల కిషోర్‌ చంద్రదేవ్‌, కేంద్ర మాజీ మంత్రి

Updated Date - 2023-03-26T00:31:19+05:30 IST