బాదుడే.. బాదుడు

ABN , First Publish Date - 2023-03-02T00:12:35+05:30 IST

గ్యాస్‌ వినియోగదారులపై మళ్లీ భారం పడింది. ఈసారి వాణిజ్య సిలిండర్‌ ధరను అమాంతం పెంచేశారు. అదనంగా రూ.350 పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఐదు నెలల తరువాత గ్యాస్‌ సిలిండర్ల ధరలు పెంచుతూ కేంద్రం బుధవారం ఆదేశాలు ఇచ్చింది.

బాదుడే.. బాదుడు

మళ్లీ పెరిగిన గ్యాస్‌ ధరలు

వాణిజ్య సిలిండర్‌పై రూ.350

రాయితీ సిలిండర్‌పై రూ.50 పెంపు

గగ్గోలు పెడుతున్న వినియోగదారులు

కలెక్టరేట్‌, మార్చి 1:

గ్యాస్‌ వినియోగదారులపై మళ్లీ భారం పడింది. ఈసారి వాణిజ్య సిలిండర్‌ ధరను అమాంతం పెంచేశారు. అదనంగా రూ.350 పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఐదు నెలల తరువాత గ్యాస్‌ సిలిండర్ల ధరలు పెంచుతూ కేంద్రం బుధవారం ఆదేశాలు ఇచ్చింది. గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్‌పై రూ.50, వాణిజ్య సిలిండర్‌పై ఒకేసారి రూ.350 పెంచింది. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే చిరు వ్యాపారులు భగ్గుమన్నారు. ఎలా బతికేదని ప్రశ్నిస్తున్నారు. ప్రజాసంఘాలు తీవ్రంగా నిరసిస్తున్నాయి. ఇప్పటికే నిత్యావసరాల ధరలు నింగిని అంటుతున్నాయని, కీలకమైన గ్యాస్‌ ధరలు కూడా పెంచేస్తుండడం సరికాదని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటివరకు రాయితీ సిలిండర్‌ ధర రూ.1060 ఉండగా, బుధవారం రూ.50 పెంచడంతో రూ.1110కు చేరింది. జిల్లాలో సుమారు 31 గ్యాస్‌ ఏజెన్సీల్లో 4,72,900 సిలిండర్లు వాడకంలో ఉన్నాయి. రూ.50 పెరగడం వల్ల గృహ వినియోగదారులపై నెలకు సుమారు రూ.90 లక్షల వరకూ అదనపు భారం పడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. పెరిగిన ధరలతో గ్యాస్‌ వినియోగదారులు కలవరపడుతున్నారు. భవిష్యత్‌లో వాడడం మానుకోవాలనుకుంటున్నారు. వాణిజ్య సిలిండరు విషయానికొస్తే రూ.1817గా ఉన్న ధర రూ.2168.50 చేరింది. ఒకేసారి రూ.350 వరకూ పెరగడంతో చిన్న వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. ఏదైనాగాని ధర పెరగడం వల్ల పరోక్షంగా ప్రజలపైనే భారం పడుతుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా పెద్ద మొత్తంలో ధర పెంచేయడాన్ని ప్రతిఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు.

-------

Updated Date - 2023-03-02T00:12:35+05:30 IST