బెడిసికొట్టిన ప్లాన్‌

ABN , First Publish Date - 2023-06-26T23:52:54+05:30 IST

నోట్ల మార్పిడిలో ఓ ముఠా ప్లాన్‌ బెడిసికొట్టింది. రూ.90 లక్షలతో ఉడాయించిప్పటికీ.. చివరకు పోలీసులకు చిక్కారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది.

 బెడిసికొట్టిన ప్లాన్‌
విలేఖర్లతో మాట్లాడుతున్న ఎస్‌ఐ సింహాచలం

పరారీలో మరో ఇద్దరు

పార్వతీపురం రూరల్‌: నోట్ల మార్పిడిలో ఓ ముఠా ప్లాన్‌ బెడిసికొట్టింది. రూ.90 లక్షలతో ఉడాయించిప్పటికీ.. చివరకు పోలీసులకు చిక్కారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది. ముఠా సభ్యుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. సోమవారం సాయంత్రం పార్వతీపురం రూరల్‌ ఎస్‌ఐ సింహాచలం తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాలోని ఓ ప్రైవేట్‌ బ్యాంకులో పనిచేస్తున్న ఎ.అనిల్‌కుమార్‌ నోట్ల మార్పిడిపై ఓ ముఠాతో డీల్‌ కుదుర్చుకున్నారు. రూ.500 నోట్లు 90 లక్షలు ఇస్తే.. రూ.2వేల నోట్లు కోటి రూపాయలు ఇస్తామని ముఠా సభ్యులు చెప్పారు. దీంతో ఎ.అనిల్‌కుమార్‌ తన స్నేహితుడు ఎం.అనిల్‌తో కలిసి ఈనెల 23న రూ.90 లక్షలతో పార్వతీపురం వచ్చారు. డీల్‌ ప్రకారం ఆ మొత్తాన్ని ముఠా సభ్యులకు ఇచ్చారు. అయితే రూ.2వేల నోట్లు రూ.కోటి ఇస్తామన్న ముఠా రూ.90 లక్షలు తీసుకుని పరారైంది. దీంతో మోసపోయామని భావించిన బాధితుడు ఎ.అనిల్‌కుమార్‌ వెంటనే పార్వతీపురం రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు నిర్వహించిన పోలీసులు ముఠా సభ్యుల్లో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. వారిలో పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఎస్‌.కె.నజీమ్‌, కాకినాడకు చెందిన ఎం.చక్రపాణి ఏ3, ఏ4గా ఉన్నారు. వీరబాబుతో పాటు మరో వ్యక్తి వర్మ సూచించిన ప్రకారం తాము ఈ పనికి పాల్పడ్డామని నిందితులు విచారణలో చెప్పినట్లు ఎస్‌ఐ తెలిపారు. పరారీలో ఉన్న వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని, త్వరలోనే వారిని అదుపులోకి తీసుకుంటామని ఆయన చెప్పారు.

Updated Date - 2023-06-26T23:52:54+05:30 IST