Share News

పట్టాలపై ఘోరం

ABN , First Publish Date - 2023-10-30T01:44:28+05:30 IST

నుజ్జునుజ్జయిన బోగీలు.. పట్టాలపై హాహాకారాలు.. చెల్లాచెదురుగా మృతదేహాలు.. ట్రాక్‌ పక్కనే తెగిన శరీర భాగాలు.. క్షతగాత్రుల ఆర్తనాదాలు.. బంధువులు, స్నేహితుల రోదనలు.. చుట్టూ కటిక చీకటి..! ఇదీ ఆదివారం రాత్రి జరిగిన రైలు ప్రమాద ఘటనా స్థలం వద్ద పరిస్థితి. కాపుసంభాం గ్రామానికి చెందిన తాపీపని చేసే వెంకటరావు, మరో 19 మంది రాయగడ ప్యాసింజర్‌ ఎక్కారు. రైలు ఢీకొనడంతో అందరూ చెల్లాచెదు రయ్యారు. తమలో నలుగురు మాత్రమే కనిపిస్తున్నారని వెంకటరావు భోరున విలపిస్తుండడం కనిపించింది. ఇలా ఎంతోమంది రోదనలతో ఆ ప్రాంతం మిన్నంటింది.

పట్టాలపై ఘోరం
పట్టాలు తప్పిన రైలు వద్ద సహాయక చర్యల్లో స్థానికులు, అధికారులు

పట్టాలపై ఘోరం

అలమండ సమీపంలో రైలు ప్రమాదం

నిలిచి ఉన్న పలాస ప్యాసింజర్‌ను ఢీకొన్న రాయగడ ప్యాసింజర్‌

10 మంది మృతి

నుజ్జునుజ్జయిన బోగీలు.. పట్టాలపై హాహాకారాలు.. చెల్లాచెదురుగా మృతదేహాలు.. ట్రాక్‌ పక్కనే తెగిన శరీర భాగాలు.. క్షతగాత్రుల ఆర్తనాదాలు.. బంధువులు, స్నేహితుల రోదనలు.. చుట్టూ కటిక చీకటి..! ఇదీ ఆదివారం రాత్రి జరిగిన రైలు ప్రమాద ఘటనా స్థలం వద్ద పరిస్థితి. కాపుసంభాం గ్రామానికి చెందిన తాపీపని చేసే వెంకటరావు, మరో 19 మంది రాయగడ ప్యాసింజర్‌ ఎక్కారు. రైలు ఢీకొనడంతో అందరూ చెల్లాచెదు రయ్యారు. తమలో నలుగురు మాత్రమే కనిపిస్తున్నారని వెంకటరావు భోరున విలపిస్తుండడం కనిపించింది. ఇలా ఎంతోమంది రోదనలతో ఆ ప్రాంతం మిన్నంటింది.

జామి/లక్కవరపుకోట, అక్టోబరు 29: జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రైలు ప్రమాదం సంభవించింది. కొత్తవలస మండలం కంటకాపల్లి- జామి మండలం అలమండ మధ్యలో సిగ్నల్‌ లేక ఆగి ఉన్న పలాస ప్యాసింజర్‌ను 7గంటల సమయంలో విశాఖ నుంచి వస్తున్న రాయగడ ప్యాసింజర్‌ ట్రైను వెనుక నుంచి బలంగా ఢీకొంది. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయాలపాలయ్యారు. ప్రమాదంలో పలాస ట్రైను గార్డు బోగి, దీనికి ముందున్న మహిళల బోగి అలాగే ఢీ కొట్టిన రాయగడ ట్రైను ఇంజన్‌, దీని వెనక ఉన్న బోగి దెబ్బతిన్నాయి. గాయపడిన వారిని విజయనగరం జిల్లా కేంద్రాసుపత్రికి రాత్రి 8.30 గంటల సమయంలో తరలించారు. మృతదేహాలను విశాఖ కేజీహెచ్‌కు తరలించి.. చిన్న, చిన్న గాయాలైన వారిని విజయనగరం తీసుకొచ్చారు. విషమంగా వున్న వారిని సైతం విశాఖకే తరలిస్తున్నారు. ఘటనపై కలెక్టర్‌ నాగలక్ష్మి అధికారులను అప్రమత్తం చేశారు. ఈ ఘటనతో చీపురుపల్లి రైల్వేస్టేషన్‌ వద్ద రాత్రి కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ను చాలా సేపు నిలిపివేశారు.

- ప్రమాద స్థలికి ఒకవైపు మామిడి తోటలు, చెరువు... మరో పక్క వరి పొలాలు ఉన్నాయి. రాత్రి సమయం కావడంతో సహాయక చర్యలు చేపట్టేందుకు స్థానిక యువత, ప్రభుత్వ యంత్రాంగం చాలా ప్రయాస పడాల్సి వచ్చింది. ప్రమాదం జరిగాక తొలుత అలమండ, కుద్దిపాలెం, అలమండ సంత, భీమాళి గ్రామాలకు చెందిన స్థానికులు పరుగున వచ్చారు. క్షతగాత్రులను బయటకు తీసుకువచ్చారు. ఆందోళనతో వున్నవారికి సపర్యలు చేశారు. ఇంతలో రైల్వే పోలీస్‌లు, రిజర్వడ్‌ పోలీస్‌లు, సివిల్‌ పోలీస్‌లు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ దళాలు రంగంలోకి దిగాయి. క్షతగాత్రులను స్ట్రెచర్‌పై దూరంగా వున్న రోడ్డు వరకు మోసుకెళ్లారు. అది కూడా మట్టి రోడ్డు కావడంతో చాలా ఇబ్బంది పడ్డారు. బోగీలను గ్యాస్‌ కట్టర్‌ల ద్వారా విడదీస్తుండగా మొదట్లో ఏడుగురి మృతదేహాలు బయటపడ్డాయి. తరువాత ఆ సంఖ్య పెరుగుతూ వచ్చింది.

కొనసాగుతున్న సహాయక చర్యలు..

క్షతగాత్రులను విశాఖ, విజయనగరం ఆసుపత్రులకు తరలిస్తున్నారు. కలెక్టర్‌ నాగలక్ష్మి, ఎస్పీ దీపిక దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. విశాఖ, విజయనగరం వైద్య కళాశాలల వారు కూడా సహాయకచర్యల్లో పాల్గొంటున్నారు. 108 వాహనాలు క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఆసుపత్రుల డాక్టర్లు, రైల్వే శాఖ డాక్టర్లు చేరుకుని ప్రథమ చికిత్స అందిస్తున్నారు. శ్రీకాకుళం ఎంపీ రామ్మెహన్‌నాయుడు ఘటనా స్థలానికి చేరుకుని అర్ధరాత్రి ఒంటిగంట వరకు సహాయక చర్యలపై సూచనలు ఇచ్చారు.

2017లో హిరాఖండ్‌ రైలు ప్రమాదం

ఉమ్మడి విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు వద్ద హిరాఖండ్‌ ఎక్స్‌ప్రైస్‌ రైలు 2017 సంవత్సరం జనవరి 21న అర్ధరాత్రి పట్టాలు తప్పింది. వేగంగా వస్తున్న రైలు ఒక్కసారిగా పట్టా తప్పడంతో బోగీలన్నీ చెల్లాచెదురైపోయాయి. ఆరు బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. మూడు బోగీలు పట్టాలకు దూరంగా పొదల్లోకి దూసుకుపోయాయి. ఘటనా స్థలంలో రక్తసిక్తమైన బోగీలు.. పట్టాలు.. ఎవరి చెయ్యి ఏదో.. ఎవరి కాలు ఏదో గుర్తుపట్టలేనంత బీతావహ వాతావరణం కనిపించింది. ఈ ఘటనలో 41 మంది చనిపోగా వారిలో ఎనిమిది మంది విజయనగరం జిల్లాకు చెందిన వారున్నారు. ఆ తర్వాత పెద్ద ఘటన ఇదే.

రెండు నిమిషాలు గడిచి ఉంటే..

జామి, అక్టోబరు 29: మరో రెండు నిమిషాల్గో గమ్యస్థానం. ఇంతలో ప్రమా దం. జామి మండలం గోడుకోమ్ము గ్రామానికి చెందిన కంచిబారిక రవి అదివారం రాత్రి కొత్తవలస మండలం కంటికాపల్లి, జామి మండలం అలమండ మిడిల్‌ లైన్‌లో జరిగిన రైలు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఈ ఘటన ప్రాంతానికి సమీపం లోనే ఈ గ్రామం ఉంది. ఘటన స్థలం నుంచి రైలు బయలుదేరితే రెండు నిమి షాల్లో అలమండ రైల్వేస్టేషన్‌ వస్తుంది. ఇక్కడ దిగి గ్రామానికి చేరుకునేవాడు. విశాఖపట్నంలో పలాస ప్యాసింజర్‌ ఎక్కాడు. ఇతను ఎక్కిన ట్రైనును వెనక నుంచి రాయగడ ప్యాసింజర్‌ ఢీకొనడంతో ధ్వంసమైన బోగీల్లో శవమై కనిపించాడు.

Updated Date - 2023-10-30T01:44:28+05:30 IST