ఓటరు నమోదుకు సహకరించండి
ABN , First Publish Date - 2023-08-02T00:28:17+05:30 IST
ఓటరు నమోదు కార్యక్రమానికి సహకరించాలని పార్వతీపురం ఓటరు నమోదు అధికారి, ఆర్డీవో కె.హేమలత కోరారు.
పార్వతీపురం, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): ఓటరు నమోదు కార్యక్రమానికి సహకరించాలని పార్వతీపురం ఓటరు నమోదు అధికారి, ఆర్డీవో కె.హేమలత కోరారు. మంగళవారం ఆర్డీవో కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈనెల 21 వరకు బీఎల్‌వోలతో ఇంటింటా ఓటరు సర్వే కార్యక్రమం జరుగుతుందన్నారు. 22నుంచి సెప్టెంబరు 29 వరకు ఓటర్లు కార్డుపై ఫొటో, మిస్ మ్యాచింగ్, క్లారిటీ లేకపోవడం, పోలింగ్ కేంద్రాల మార్పు వంటి అంశాలు పరిశీలిస్తామని తెలిపారు. డూప్లికేట్ ఎంట్రీలు, చనిపోయిన ఓటర్లు, శాశ్వతంగా వలస వెళ్లిన వారి వివరాలు పరిశీలన, ఓటర్ల జాబితాలో సవరణలను గుర్తిస్తున్నామన్నారు. చిరునామాను మార్చుకున్న ఓటర్ల వివరాలు, డోర్ నెంబర్ అడ్రస్ వెరిఫికేషన్ (10 కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న ఇళ్లు) చేస్తారని చెప్పారు. ఇంటి నెంబర్లకు సంబంధించి ఎంట్రీల సవరణ కోసం ఫారం-8 సేకరించనున్నా మన్నారు. సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 16 వరకు సమగ్ర ముసాయిదా జాబితాను రూపొందించి, అక్టోబరు27న ప్రచురిస్తామని వెల్లడించారు. అక్టోబరు 17 నుంచి నవంబరు 30 వరకు అభ్యంతరాలు, క్లయిమ్‌లు ఇస్తే.. డిసెంబర్ 26 నాటికి వాటిని పరిష్కరిస్తామని చెప్పారు. తుది ఓటరు జాబితాను 2024 జనవరి 5 నాటికి ప్రదర్శిస్తామన్నారు. ఈ సమావేశంలో తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.