గుట్టుగా.. ఏమీ పట్టనట్టుగా

ABN , First Publish Date - 2023-03-26T00:19:31+05:30 IST

శృంగవరపుకోట మండలం సంతగైరమ్మపేట గ్రామ పరిధిలోని చెరువులో ఈ నెల 7న రాత్రి 7గంటల నుంచి ట్రాక్టర్లతో మట్టిని తరలించారు. ఇందుకోసం ఎక్సకవేటర్‌లను వినియోగించారు. చెరువు నుంచి భారీగా మట్టి తరలిపోతుండడంతో స్థానికులు గ్రామ రెవెన్యూ అధికారికి ఫోన్‌ చేశారు. తహసీల్దార్‌కూ సమాచారం ఇచ్చారు. అయినా స్పందన లేకపోయింది. రాత్రి 12 గంటల సమయంలో మీడియా ప్రతినిధులు వచ్చినట్లు తెలుసుకుని తవ్వకాలు ఆపారు.

గుట్టుగా.. ఏమీ పట్టనట్టుగా
ఎస్‌.కోట మండలం సంతగైరమ్మపేట చెరువులో ఇటీవల రాత్రి సమయంలో మట్టి తవ్వకాలు (ఫైల్‌)

ప్రభుత్వ భూములు, చెరువుల్లో మట్టి తవ్వకాలు

లే అవుట్‌లు, పంట పొలాలను కప్పేందుకు తరలింపు

టాక్టర్లతో యథేచ్ఛగా మట్టి రవాణా చేస్తున్నా పట్టించుకోని రెవెన్యూ

ఫిర్యాదు వస్తే కొలతలతో సరిపెడుతున్న గనుల శాఖ

శృంగవరపుకోట, మార్చి 25:

- శృంగవరపుకోట మండలం సంతగైరమ్మపేట గ్రామ పరిధిలోని చెరువులో ఈ నెల 7న రాత్రి 7గంటల నుంచి ట్రాక్టర్లతో మట్టిని తరలించారు. ఇందుకోసం ఎక్సకవేటర్‌లను వినియోగించారు. చెరువు నుంచి భారీగా మట్టి తరలిపోతుండడంతో స్థానికులు గ్రామ రెవెన్యూ అధికారికి ఫోన్‌ చేశారు. తహసీల్దార్‌కూ సమాచారం ఇచ్చారు. అయినా స్పందన లేకపోయింది. రాత్రి 12 గంటల సమయంలో మీడియా ప్రతినిధులు వచ్చినట్లు తెలుసుకుని తవ్వకాలు ఆపారు.

- వేపాడ మండలంలోని గ్రామాల్లో చెరువులు, వాగులు, గెడ్డల్లోని మట్టిని ట్రాక్టర్లతో తీసుకుపోతున్నారు. చెరువుల్లో ఎక్సకవేటర్‌లను పెట్టి తవ్వేస్తున్నారు. విశాఖ-అరకు రోడ్డు, సోంపురం-వేపాడ, వేపాడ- అనందపురం రహదారుల్లో నిత్యం మట్టిలోడు ట్రాక్టర్లే కనిపిస్తున్నాయి.

- కొత్తవలస, ఎల్‌.కోట, వేపాడ, ఎస్‌.కోట తహసీల్దార్‌లు విశాఖపట్టణం, విజయనగరం పట్టణాల నుంచి తిరుగుతున్నారు. వీరు విశాఖ-అరకు రోడ్డులో ప్రయాణించడం తప్పనిసరి. నెల రోజులుగా ఈ రోడ్డులో మట్టితో టాక్టర్లు తిరుగుతూనే వున్నాయి. ఈ రోడ్డుకు ఆనుకుని వున్న పొలాల్లో డంప్‌ చేస్తున్నాయి. ఎక్కడబడితే అక్కడ కుప్పలు, కుప్పలుగా పోగులు కనిపిస్తున్నాయి. వీటిని అధికారులు చూస్తూ వెళ్లిపోతున్నారు తప్ప ప్రశ్నించే నాథుడు లేడు.

- నెల రోజుల కిందట శృంగవరపుకోట మండలం ముషిడిపల్లి పంచాయతీ పరిధిలో కంకర తవ్వకాలు జరుగుతున్నట్లు ‘ఆంధ్రజ్యోతి’లో కథనం వచ్చింది. దీనికి స్పందించిన గనుల శాఖ ఏ మేరకు తవ్వకాలు జరిగియో కొలతలు వేశారు. ఎంత మేర కంకర తవ్వారు, కారకుడు ఎవరు? అన్నదానిపై అధికారిని ప్రశ్నించగా ఉన్నతాధికారులకు నివేదిస్తామని సమాధానమిచ్చి మౌనం పాటించారు.

- గత ఏడాది మే నెలలో విశాఖ-అరకు రోడ్డుకు ఆనుకుని వున్న పొలాలను లేఅవుట్‌లుగా తీర్చిదిద్దేందుకు గుట్టలు, గుట్టలుగా మట్టి వేయడంతో ఫిర్యాదు అందుకున్న భూగర్భ గనులశాఖ అధికారులు తనిఖీ చేశారు. మట్టిని అక్రమంగా పోసినట్లు గుర్తించారు. తీసుకొచ్చిన యజమానులపై తీసుకున్న చర్యలేంటో ఇంతవరకు ఎవరికి తెలియదు.

జిల్లాలో ఎక్కడికక్కడ అక్రమంగా మట్టిని తవ్వేస్తున్నా.. నిబంధనలకు విరుద్ధంగా పొలాలను కప్పేసుకుంటున్నా యజమానులపై చర్యలు తీసుకోవడంలో రెవెన్యూ, సాగునీటి, గనుల శాఖ అధికారులు నిర్లిప్తత ప్రదర్శిస్తున్నారు. ఎవరికి వారు మనకేందుకులే అని ఊరుకుంటున్నారు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు జోక్యం చేసుకుంటుండడమే దీనికి కారణం. అడ్డు, అదుపు లేకుండా మట్టి తవ్వకాలు సాగుతున్నాయి. వాణిజ్య అవసరాలకు వ్యవసాయ భూములను మట్టితో కప్పేస్తున్నారు. నిబంధనల ప్రకారం లోతుగా వున్న వ్యవసాయ భూములను ఎత్తు చేసుకొనేందుకు రైతులు చెరువు మట్టి తీసుకువెళ్లవచ్చు. అయితే సాగునీటి శాఖ నుంచి క్యూబిక్‌ మీటర్‌కు రూ.1 చెల్లించి అనుమతి పొందాలి. లేఅవుట్‌లు, ఇతర వాణిజ్య అవసరాలకు మట్టిని తరలించేందుకు అనుమతులు ఇచ్చే అవకాశం తక్కువ. దీంతో దొంగ చాటు వ్యవహారానికి తెరలేపుతున్నారు.

తవ్వుకుపోతున్న మట్టి మాఫియా

లేఅవుట్‌, ఇతర వాణిజ్య అవసరాలకు భూమిని చదును చేసుకోవాలనుకొనే వారి సంఖ్య రోజురోజుకు పెరగడంతో మట్టిని సరఫరా చేసే మాఫియా పుట్టికొచ్చింది. లాభసాటిగా వుండడంతో అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు ప్రధాన అనుచరులగా వున్నవారంతా ఎక్సకవేటర్లు, టాక్టర్లను సమకూర్చుకుంటున్నారు. ఇప్పటికే ఇవి కలిగి ఉన్న వారంతా ప్రజాప్రతినిధుల పంచన చేరిపోయారు. ఇలా అంతా ఒక్కటై మట్టి తవ్వకాలను వ్యాపారంగా మలుచుకోవడంతో చెరువులు, ప్రభుత్వ భూములు, కొండలను కొల్లగొడుతున్నారు. ఫిర్యాదు చేసినప్పుడు మాత్రమే రెవెన్యూ అధికారులు స్పందిస్తున్నారు. ఆ తరువాత పట్టించుకోవడం లేదు.

సెలవు రోజుల్లో మరింతగా

అదివారం కార్యాలయాలకు సెలవు కావడంతో అధికారులు రారన్న ఆలోచనతో ఎక్సకవేటర్‌, టాక్టర్‌ యజమానులు గతంలో శనివారం చికటి పడినప్పటి నుంచి సోమవారం తెల్లవారు జాము వరకు మట్టిని తరలించేసేవారు. ఇప్పుడయితే దర్జాగా నిత్యం పగలు, రాత్రి తేడా లేకుండా రోడ్లపై మట్టితో ట్రాక్టర్‌లు పరుగులు తీస్తున్నాయి. ఒక ట్రాక్టర్‌నైనా ఆపి మట్టి తరలింపుపై ప్రశ్నించే అధికారి కానరావడం లేదు. దీంతో ప్రభుత్వ భూములు, చెరువులు, ఇతర భూముల్లోను అనుమతులు లేకుండా తవ్వేస్తూ వాల్టా చట్టానికీ విఘాతం కలిగిస్తున్నారు.

ఎండల్లో మెండుగా..

ఏటా ఫిబ్రవరి నుంచి ఎండల వల్ల చెరువుల్లో నీరు ఇంకిపోతుంది. ఇదే అదునుగా మట్టి వ్యాపారం పుంజుకుంటోంది. లేఅవుట్‌లను తీర్చిదిద్దే తంతు ప్రస్తుతం ఊపందుకుంది. చెరువులు, ప్రభుత్వ భూములు, జిరాయితీ భూముల నుంచి మట్టిని తవ్వేస్తున్నారు. ఇలా తవ్వేందుకు రెవెన్యూ అధికారుల అనుమతులు తప్పనిసరి. చెరువుల్లోయితే నీటి పారుదల శాఖ, జిరాయితీలైతే రైతు అంగీకారంతో రెవెన్యూ అధికారుల సూచనల మేరకు భూగర్భ గనుల శాఖ అధికారులు పర్యావరణం దెబ్బతినకుండా అనుమతులు ఇస్తారు. ఇవేమీ లేకుండానే మట్టిని తవ్వేస్తున్నారు. స్థిరాస్తి వ్యాపారుల వెనుక అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల హస్తాలు వుంటున్నాయి. అధికారులెవరైనా అడ్డుకొనేందుకు వెళ్తే నిమిషాల్లో ప్రజా ప్రతినిధుల నుంచి ఫోన్లు వచ్చేస్తున్నాయి. దీంతో మట్టి తవ్వకాలు ఆపడంలో యంత్రాంగం వెనకడుగు వేస్తోంది.

అనుమతులు తప్పనిసరి

మట్టి తవ్వేందుకు అనుమతులు తీసుకోవాలి. వాణిజ్య అవసరాలకు వ్యవసాయ పొలాలను మట్టితో నింపడం నిబంధనలకు విరుద్ధం. ఫిర్యాదిస్తే ఇలాంటి వారిపై చర్యలు తీసుకుంటాం. అక్రమంగా మట్టి తరలిస్తున్న ట్రాక్టర్లను అడ్డుకుంటున్నాం. అనుమతులు లేకుండా మట్టి తవ్వోద్దని చెబుతున్నాం.

- ఎస్‌.కృష్ణంరాజు, తహసీల్దార్‌, వేపాడ

వారి వివరాలను సేకరిస్తున్నాం

చెరువుల్లో అక్రమంగా మట్టిని తరలిస్తున్న వ్యక్తులు, వాహనాల వివరాలను సేకరిస్తున్నాం. వీరిపై నివేదిక తయారు చేస్తున్నాం. చర్యలకు జిల్లా ఉన్నతాధికారులకు పంపిస్తున్నాం. వ్యవసాయ పొలాలను ఎత్తుచేసుకొ నేందుకు సాగునీటి శాఖ అనుమతిస్తుంది. లేఅవుట్‌లు, ఇతర వాణిజ్య అవసరాలకు చెరువుల నుంచి మట్టిని తవ్వేందుకు అనుమతించం.

- సతీష్‌కుమార్‌, సాగునీటి శాఖ, జేఈ, శృంగవరపుకోట

Updated Date - 2023-03-26T00:19:31+05:30 IST