ఏపీలో క్రీడాకారులకు వసతులేవీ?

ABN , First Publish Date - 2023-04-03T01:43:51+05:30 IST

ఏపీ అథ్లెట్లు సత్తా చాటుతున్నారని, కానీ, వసతులపరంగా వారికి సరైన సౌకర్యాలు లేవని పరుగుల రాణి, రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉష అన్నారు.

ఏపీలో క్రీడాకారులకు వసతులేవీ?

అథ్లెట్లు తమ సత్తా చాటుతున్నాప్రభుత్వం పట్టించుకోవడం లేదు

పరుగులరాణి పీటీ ఉష వ్యాఖ్యలు

బెజవాడలో సింథటిక్‌ ట్రాక్‌ కోసం తన వంతు కృషి చేస్తానని హామీ

ఉష దంపతులకు ఘన సత్కారం

విజయవాడ(స్పోర్ట్సు), ఏప్రిల్‌ 2: ఏపీ అథ్లెట్లు సత్తా చాటుతున్నారని, కానీ, వసతులపరంగా వారికి సరైన సౌకర్యాలు లేవని పరుగుల రాణి, రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉష అన్నారు. ప్రధానంగా విజయవాడలాంటి నగరాల్లో సింథటిక్‌ ట్రాక్‌ లేకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం సహకరిస్తే వచ్చే ఏడాదికైనా సింథటిక్‌ ట్రాక్‌ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. పీటీ ఉష, శ్రీనివాసన్‌ దంపతులు ఆదివారం విజయవాడలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జనరల్‌ సెక్రటరీ ఆకుల హైమ, అథ్లెటిక్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా జాయింట్‌ సెక్రటరీ ఆకుల రాఘవేంద్రలు ఘనంగా వారిని సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పీటీ ఉష మాట్లాడుతూ.. సౌకర్యాల్లేని తమ కాలంలో రైల్వే ట్రాక్‌, ఫుట్‌పాత్‌లపై పరుగులు పెట్టిన రోజుల నుంచి 2004లో రిటైరయ్యే వరకు మొత్తం 103 పతకాలను సాధించానని తెలిపారు. శ్రీనివాసన్‌ మాట్లాడుతూ, ఏపీలో సత్తా చాటే క్రీడాకారులున్నప్పటికీ తగిన సౌకర్యాలు లేవన్నారు. అందుకే, తమ అకాడమీలో రాష్ట్రం నుంచి నలుగురు క్రీడాకారులు శిక్షణ పొందుతున్నారని, సౌకర్యాల కల్పన కోసం అసోసియేషన్‌లు, మీడియా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని సూచించారు. మాజీ ఒలింపియన్‌ సత్తి గీత మాట్లాడుతూ, ఏపీలో స్పోర్ట్సు హాస్టళ్లు, ట్రాక్‌లు ఏర్పాటు చేయాలన్నారు. ఒలింపిక్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి కేపీ రావు మాట్లాడుతూ, జాతీయ, రాష్ట్ర చాంపియన్‌ షిప్‌లలో పాల్గొనే క్రీడాకారులకు రైల్వేలో రాయితీలు కల్పించే విషయమై, బడ్జెట్‌లో నిధుల పెంపుపై పీఎం మోదీతో మాట్లాడి చర్యలు చేపట్టాలని, ఏపీ ఒలింపిక్‌ అసోసియేషన్ల వివాదాలను త్వరగా పరిష్కరించాలని కోరారు.

Updated Date - 2023-04-03T01:43:51+05:30 IST