ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరచుకోండి

ABN , First Publish Date - 2023-09-22T00:06:37+05:30 IST

విద్యార్థి దశ నుంచి ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరచుకొని.. దానిని సాధించడంలో జీవితానికి ఒక నిర్వచనం ఉంటుందని జాతీయ షెడ్యూల్‌ తెగలు, కులాల కమిషన్‌ సభ్యుడు అనంతనాయక్‌ అన్నారు.

ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరచుకోండి

గుమ్మలక్ష్మీపురం: విద్యార్థి దశ నుంచి ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరచుకొని.. దానిని సాధించడంలో జీవితానికి ఒక నిర్వచనం ఉంటుందని జాతీయ షెడ్యూల్‌ తెగలు, కులాల కమిషన్‌ సభ్యుడు అనంతనాయక్‌ అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా గుమ్మలక్ష్మీపురం ఏకలవ్య మోడల్‌ గురుకుల పాఠశాల, నీలకంఠాపురం గిరిజన సంక్షేమ బాలికోన్నత పాఠశాలలను ఆయన గురువారం సందర్శించారు. విద్యాబోధన, వసతి గృహంలోని మౌలిక సదుపాయాలపై విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. గిరిజన తెగల సంస్కృతులు, సంప్రదాయాలపై వారి ఆసక్తిని తెలుసుకున్నారు. విద్యార్థినులు ఏటా నిర్వహించే గిరిజనోత్సవాల్లో సవర, కంది కొత్తలు నృత్యాలు ప్రదర్శిస్తున్నట్టు తెలపడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. షెడ్యూల్‌ తెగలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారని ప్రశ్నించగా సవర, కొండదొర వంటి వర్గాల విద్యార్థులు అభ్యసిస్తున్నట్టు ఐటీడీఏ పీవో సి.విష్ణుచరణ్‌ వివరించారు. అంతకుముందు ఏకలవ్య గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక, పుస్తక, గిరిజన సంప్రదాయ కళాకృతులు, చేతివృత్తులు, అల్లికలు, డిజిటల్‌ బోధన, బోర్డు, ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యాకానుక కిట్లు, యూనిఫారాలు వంటి ప్రదర్శనలు తిలకించి సంతృప్తి వ్యక్తం చేశారు. భోజన శాల, డార్మిటరీ, పాఠశాల నిర్వహణ తీరును పరిశీలించారు. గుమ్మలక్ష్మీపురం కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ను పరిశీలించి ఎంతమంది వైద్యులు విధులు నిర్వహిస్తున్నారన్నది తెలుసుకున్నారు. విద్యార్థుల డార్మిటరీని పరిశీలించిన సభ్యులు దోమలు రాకుండా చర్యలు తీసుకోవాలని, ఫ్యాన్‌లు, విద్యుత్‌ సౌకర్యం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సి.విష్ణుచరణ్‌, కమిషన్‌ సభ్యులు జయంత్‌జెసరోడే, స్పెషల్‌ రిపోర్టర్‌ రాధాకాంత త్రిపాఠి, రీసెర్చ్‌ ఆఫీసర్‌ ఆర్‌.ఎస్‌.మిశ్రా, ప్రైవేటు సెక్రటరీ పి.కె.పరిడా, ట్రైబుల్‌ రీసెర్చ్‌ మిషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ జి.చినబాబు, చుక్కా నాగరాజు, జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారిత అధికారి కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-22T00:06:37+05:30 IST