పేరుకే గిరిజన వర్సిటీ

ABN , First Publish Date - 2023-02-06T23:59:31+05:30 IST

గతంలో సేకరించిన రెల్లి భూముల్లో కొన్నింటిని ఏపీఐఐసీకి అప్పగించేందుకు ప్రయత్నాలు కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం నిర్మించేందుకు కొత్తవలస మండలం రెల్లి గ్రామ పరిధిలో కేటాయించిన భూమిది. దీనికి రక్షణగా ప్రహరీ నిర్మించారు. భవన నిర్మాణాలు చేపట్టి ఉంటే ఈ పాటికే గిరిజన విద్యార్థులతో ఈ ప్రాంతం కళకళలాడేది.

పేరుకే గిరిజన వర్సిటీ
కొత్తవలస మండలం రెల్లి గ్రామంలో గిరిజన వర్సిటీకి కేటాయించిన భూమికి నిర్మించిన రక్షణ గోడ

మూడేళ్లుగా ఏయూ పీజీ సెంటర్‌లోని భవనంలో నిర్వహణ

నిర్మాణానికి పడని పునాదులు

వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుంచి తేలని భూసేకరణ

గతంలో సేకరించిన రెల్లి భూముల్లో కొన్నింటిని ఏపీఐఐసీకి అప్పగించేందుకు ప్రయత్నాలు

కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం నిర్మించేందుకు కొత్తవలస మండలం రెల్లి గ్రామ పరిధిలో కేటాయించిన భూమిది. దీనికి రక్షణగా ప్రహరీ నిర్మించారు. భవన నిర్మాణాలు చేపట్టి ఉంటే ఈ పాటికే గిరిజన విద్యార్థులతో ఈ ప్రాంతం కళకళలాడేది. టీడీపీ ప్రభుత్వం చకాచకా పనులు చేయాలని అనుకుంటున్న దశలో ఎన్నికల కోడ్‌ రావడం... ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో గిరిజన వర్సిటీకి గడ్డుకాలం వచ్చినట్లయింది. స్థలం మార్చేయడంతో పాటు భవన నిర్మాణం కూడా ప్రారంభం కాలేదు. మూడేళ్లుగా విజయనగరంలోని ఆంధ్రాయూనివర్సిటీ పీజీ సెంటర్‌లోని ఓ భవనంలో గిరిజన వర్సిటీని నడుపుతున్నారు. గతంలో గిరిజనుల నుంచి సేకరించిన రెళ్లిగ్రామ భూముల్లో కొన్నింటిని ఏపీఐఐసీకి అప్పగించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విషయం తెలిసి గిరిజనులు మండిపడుతున్నారు.

(శృంగవరపుకోట)

గిరిజన వర్సిటీ కోసం గత ప్రభుత్వం సేకరించి అందుబాటులో ఉంచిన స్థలాన్ని వదిలేసి ఈ ప్రభుత్వం వేరే చోట భూసేకరణకు పూనుకుంది. ఈ తంతు ఇంకా పూర్తికాలేదు. భవన నిర్మాణాలు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియని పరిస్థితి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఏయూ పీజీ సెంటర్‌లో చదువుకుంటున్న గిరిజన విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. మౌలిక సదుపాయాలు లేక విద్యాబోధనకు ఆటంకం కలుగుతోంది. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఎప్పటికి నిర్మాణాలు పూర్తవుతాయో కూడా తెలియని పరిస్థితి. ఇలా గిరిజన విద్యార్థులకు ప్రభుత్వమే అన్యాయం చేస్తోంది.

రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా కేంద్రం గిరిజన విశ్వ విద్యాలయాన్ని ప్రకటించింది. దీన్ని అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి విజయనగరం జిల్లాలో నిర్మించాలని నిర్ణయించారు. అధికారులు కొత్తవలస మండలం రెల్లి గ్రామ పరిధిలో 1622 ఎకరాలు ప్రభుత్వ భూమి వున్నట్లు గుర్తించారు. ఈ భూమి విశాఖపట్నానికి ఆనుకుని వుండడంతో పాటు ఎయిర్‌పోర్టు, రైల్వేస్టేషన్‌, బస్‌స్టేషన్‌ వంటి రవాణా సదుపాయాలకు అనుగుణంగా ఉందని ఇదే స్థలాన్ని ప్రతిపాదించారు. ఆ తర్వాత అనేక అడ్డంకులను అధిగమించి గిరిజన విశ్వ విద్యాలయానికి స్థలం కేటాయింపు తంతు కూడా పూర్తయింది. విభజన హామీలకు అనుగుణంగా విశ్వవిద్యాలయం కేటాయించిన కేంద్ర ప్రభుత్వం భవన నిర్మాణాలు చేపట్టేందుకు మాత్రం నిధులు సమకూర్చలేదు. దీంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం స్థలం చుట్టూ ముందుగా ప్రహరీ నిర్మించింది. ఈ తర్వాత కేంద్ర నిధులతో నిర్మాణాలను ప్రారంభించేందుకు సిద్ధపడుతున్న దశలో ఎన్నికలు వచ్చాయి. ప్రభుత్వం మారింది. వైసీపీ అధికారం చేపట్టింది. తెలుగు దేశం ప్రభుత్వం సేకరించి ఇచ్చిన స్థలంలో కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయాన్ని నిర్మిస్తే ఆ పార్టీకే పేరొస్తుందన్న భావనతో స్థలమే మార్చేసింది.

ఫ గిరిజన ప్రాంతాలకు దగ్గరగా వుండాలన్న సాకు చూపించి అక్కడ నిర్మాణాలను కట్టడం మానేశారు. కొత్తగా భూ సేకరణ ప్రారంభించారు. మూడేళ్లగా భూసేకరణతోనే కాలం వెళ్లబుచ్చుతున్నారు. మెంటాడ మండలం చినమేడపల్లి, దత్తిరాజేరు మండలం మర్రివలస గ్రామాల పరిధిలో స్థలం సేకరిస్తున్నారు. ప్రభుత్వ భూమితో పాటు డీపట్టా భూమి, జిరాయితీ భూములను కొనుగోలు చేసే పనిలో వున్నారు. డీపట్టా భూములకు ఎకరాకు రూ.7.50 లక్షల నుంచి రూ.9లక్షల వరకు, జిరాయితీ భూమికి ఎకరాకు రూ.12 లక్షల పరిహారం ఇచ్చేందుకు చూస్తున్నారు. ప్రస్తుతం భూముల ధరల పెరుగుదలతో ఈ మొత్తం చాలదని రైతుల నుంచి అభ్యంతరాలు వున్నాయి. అధికారులు రైతులను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. భూసేకరణ ప్రక్రియ ఇంకా కొలిక్కిరాలేదు.

ఫ రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో తెలంగాణ, ఏపీ గిరిజన విశ్వ విద్యాలయాకు కలిపి రూ.37.67 కోట్లు కేటాయించింది. ఈ నిధులు ఏ పాటికీ సరిపోవు.

రెల్లి భూములు ఏపీఐఐసీకి బదలాయింపు

కొత్తవలస మండలం రెల్లి గ్రామ పరిధిలో కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయానికి సేకరించిన భూముల్లోని 158 ఎకరాలను ఏపీఐఐసీకి బదలాయించేందుకు రెవెన్యూ అధికారులు చూస్తున్నారు. దీనిని స్థానిక గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు. తాము సాగు చేసుకుంటున్న భూములు విశ్వవిద్యాలయం కోసం వదులుకున్నామని, వేరే అవసరాలకు తీసుకుంటే ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు. రెండు రోజుల క్రితం కొత్తవలస తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు.

ఉన్నతాధికారుల ఆదేశాలు ఉన్నాయి

రెల్లి గ్రామ రెవెన్యూలోని గిరిజన విశ్వ విద్యాలయానికి కేటాయించిన స్థలంలో 158 ఎకరాలను ఏపీఐఐసీకి అప్పగించాలని జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలు వున్నాయి. ఈ విశ్వ విద్యాలయానికి జిల్లాలో వేరే ప్రాంతంలో భూములను సేకరించారు. దీనిపై ప్రభుత్వం సూచించిన విధంగా నడుచుకుంటాం.

- ప్రసాదరావు, తహసీల్దార్‌, కొత్తవలస

Updated Date - 2023-02-06T23:59:33+05:30 IST