కాటేసిన పిడుగు

ABN , First Publish Date - 2023-05-26T00:05:02+05:30 IST

పశువుల మేతకు వెళ్లిన బడుగులను పిడుగు కాటేసింది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా, మరొక వ్యక్తి గాయాలపాలయ్యాడు. దీంతో ఆయా కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి.

కాటేసిన పిడుగు

గెడ్డతిరువాడలో ఓ వ్యక్తికి గాయాలు

విషాదంలో కుటుంబ సభ్యులు

జియ్యమ్మవలస, మే 25 : పశువుల మేతకు వెళ్లిన బడుగులను పిడుగు కాటేసింది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా, మరొక వ్యక్తి గాయాలపాలయ్యాడు. దీంతో ఆయా కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. వివరాల్లోకి వెళ్తే.. చింతలబెలగాం పంచాయతీ సింగనాపురానికి చెందిన చినగంట పార్వతి (47) గురువారం సాయంత్రం పశువులు మేపేందుకు గ్రామ సమీపంలోని పొలాలకు తీసుకెళ్లారు. ఇంతలో ఈదురుగాలులతో కూడిన వర్షం మొదలైంది. అదే సమయంలో ఆమెపై పిడుగు పడింది. స్పృహ కోల్పోయిన ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే పార్వతీపురం జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించారు. దీంతో సింగనాపురం గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పార్వతికి భర్త సింహాచలం, కుమార్తె ధనలక్ష్మి, కుమారుడు సతీష్‌ ఉన్నారు. కుమార్తెకి వివాహమైపోగా, కుమారుడు పీజీ చదువుతున్నాడు. ఊహించని ఈ ఘటనతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. పార్వతి మృతి చెందిందన్న విషయాన్ని తట్టుకోలేక బోరున విలపిస్తున్నారు. ఇదిలా ఉండగా గెడ్డతిరువాడ గ్రామానికి చెందిన గుంట్రెడ్డి పట్టాభినాయుడు గ్రామ సమీపంలో పశువులను మేపుతుండగా ఆ ప్రాంతానికి సమీపంలోనే పిడుగు పడింది. దీంతో ఆయన కాళ్లు పనిచేయలేదు. వెంటనే ఆయన్ని కుటుంబ సభ్యులు చినమేరంగి సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అయితే వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం కేంద్రాసుపత్రికి తరలించారు. పై ఘటనలతో పరిసర ప్రాంతవాసులు భయబ్రాంతులకు గురయ్యారు. గాలులు, వర్షాల సమయంలో ఎక్కడ ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2023-05-26T00:05:02+05:30 IST