రహదారిపైకి వచ్చిన ఏనుగుల గుంపు
ABN , First Publish Date - 2023-09-19T23:55:46+05:30 IST
మండలంలోని కళ్లికోట, దుగ్గి గ్రామాలకు వెళ్లే రహదారిపైకి ఏడు ఏనుగుల గుంపు రావడంతో వాహన చోదకులు, పాదచారులు, ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. మంగళవారం ఉదయం రహదారిపైకి ఏనుగుల గుంపు వచ్చింది. వెంటనే స్థానికులు అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు.

కొమరాడ, సెప్టెంబరు 19: మండలంలోని కళ్లికోట, దుగ్గి గ్రామాలకు వెళ్లే రహదారిపైకి ఏడు ఏనుగుల గుంపు రావడంతో వాహన చోదకులు, పాదచారులు, ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. మంగళవారం ఉదయం రహదారిపైకి ఏనుగుల గుంపు వచ్చింది. వెంటనే స్థానికులు అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వారు వచ్చి ఏనుగులను సమీప పంట పొలాల్లోకి తరలించడంతో రహదారిపై రాకపోకలు యథావిధిగా సాగాయి. ఒంటరి ఏనుగు బిత్రపాడు సమీపంలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇది ఏ క్షణానైనా ఏనుగుల గుంపులో కలిసే అవకాశం ఉందని తెలిపారు. ఒంటరి ఏనుగు గ్రామాల్లోకి వచ్చి బీభత్సం సృష్టిస్తుందేమోనని ప్రజలు భయపడుతున్నారు. గత కొద్ది రోజులుగా ఇది ఒంటరిగానే తిరుగుతుంది తప్ప ఏనుగుల గుంపులో కలవడం లేదు. అప్పుడప్పుడు ఒంటరి ఏనుగు చేస్తున్న అలజడిని చూసి ప్రజలు భీతిల్లిపోతున్నారు. తక్షణమే ఒంటరి ఏనుగునైనా బంధించి జంతు ప్రదర్శనశాలకు తరలించాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు.