ఉత్తరాంధ్ర అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక అవసరం

ABN , First Publish Date - 2023-03-19T00:02:20+05:30 IST

దశాబ్దాలుగా వెనుకబడిన ఉత్తరాంధ్ర సమస్యలను శాసన మండలిలో ప్రస్తావిస్తానని పట్టభద్ర స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన వేపాడ చిరంజీవిరావు అన్నారు. ప్రకృతి వనరులు పుష్కలంగా వున్న ఉత్తరాంధ్రలో వ్యవసాయం, పరిశ్రమలు, జల వనరులు, వైద్యం, విద్య రంగాల సమగ్రాభివృద్ధికి ప్రణాళిక (రోడ్‌ మ్యాప్‌) రూపొందించి, అమలు చేస్తేనే ఈ ప్రాంతంలో సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుందన్నారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధికి  సమగ్ర ప్రణాళిక అవసరం

పరిశ్రమల ఏర్పాటుతోనే నిరుద్యోగులకు భరోసా

పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు, రాయితీలు ఇవ్వాలి

బెదిరించడం, భయపెట్టడం చేస్తే ఎవరూ రారు

యూపీపీఎస్‌సీ మాదిరిగా

ఏపీపీఎస్సీ ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలి

ప్రభుత్వం దృష్టికి ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛన్‌దారుల సమస్యలు

ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీ కుటుంబసభ్యుడిని

పార్టీ విధానాల మేరకు పనిచేస్తా

ఈ విజయం టీడీపీ నేతలు, కార్యకర్తలు,

ఉద్యోగ, ఉపాధ్యాయ, మిత్ర బృందానికి అంకితం

‘ఆంధ్రజ్యోతి’తో ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు

విశాఖపట్నం, మార్చి 18 (ఆంధ్రజ్యోతి):

దశాబ్దాలుగా వెనుకబడిన ఉత్తరాంధ్ర సమస్యలను శాసన మండలిలో ప్రస్తావిస్తానని పట్టభద్ర స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన వేపాడ చిరంజీవిరావు అన్నారు. ప్రకృతి వనరులు పుష్కలంగా వున్న ఉత్తరాంధ్రలో వ్యవసాయం, పరిశ్రమలు, జల వనరులు, వైద్యం, విద్య రంగాల సమగ్రాభివృద్ధికి ప్రణాళిక (రోడ్‌ మ్యాప్‌) రూపొందించి, అమలు చేస్తేనే ఈ ప్రాంతంలో సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుందన్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన శనివారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో మాట్లాడారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మౌలిక వసతుల కల్పన పెద్ద స్థాయిలో జరగాలని, అప్పుడే మరిన్ని పరిశ్రమలు ఏర్పాటవుతాయన్నారు. పరిశ్రమలు వస్తేనే నిరుద్యోగ యువతకు ఉపాధితోపాటు ఈ ప్రాంత ఆదాయం పెరుగుతుందన్నారు.

పరిశ్రమల ఏర్పాటుకు రాయితీలు ఇవ్వాలి

పరిశ్రమల ఏర్పాటులో పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు, విద్యుత్‌, నీరు, పన్నుల వంటి అంశాల్లో రాయితీలు ఇవ్వాలని చిరంజీవిరావు అన్నారు. పారిశ్రామికవేత్తలను బెదిరించడం, భయపెట్టడం, వాటాలు అడగడం లేదా వేధింపులకు గురిచేయడం వంటి వాటికి తావులేకుండా ప్రశాంత వాతావరణం నెలకొనేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. అటువంటి పరిస్థితులు ఏర్పడితే పారిశ్రామికవేత్తలు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులకు వెళ్లకుండా ఉత్తరాంధ్రలో పరిశ్రమలు నెలకొల్పుతారన్నారు. ఒక ప్రాంతం అభివృద్ధి జరిగితే అదే మోడల్‌ రాయలసీమ, దక్షిణ కోస్తా, గోదావరి జిల్లాల్లో అమలు చేసుకోవచ్చునన్నారు. పరిశ్రమలు, సేవా రంగం, విద్య, వైద్య రంగాలు అభివృద్ధి చెందితే ఉత్తరాంధ్రలో నిరుద్యోగ పట్టభద్ర యువతకు భరోసా దొరికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. దీనివల్ల వలసలు ఆగుతాయన్నారు. ఈ అంశాలను శాసన మండలిలో ప్రస్తావించడంతోపాటు ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధి ప్రణాళిక కోసం అధ్యయనం చేసి నివేదిక ఇవ్వడానికి తన వంతు కృషిచేస్తానని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఏటా యూపీపీఎస్సీ ద్వారా క్రమం తప్పకుండా వేల ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్‌ ఇస్తున్నట్టు...రాష్ట్రంలో ఏపీపీఎస్సీ ద్వారా ఏటా జాబ్‌ క్యాలెండర్‌ అమలు చేయాలని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో గడచిన నాలుగేళ్లుగా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయకపోవడం నిరుద్యోగ పట్టభద్రులపై ప్రభావం చూపిందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానన్నారు.

మరిన్ని కోచింగ్‌ కేంద్రాలు అవసరం

పోటీ పరీక్షల కోసం ప్రభుత్వ పరిధిలో మరిన్ని కోచింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేయాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం వున్న కోచింగ్‌ కేంద్రాలు బలహీనపడ్డాయని పేర్కొంటూ వీటిని పటిష్టం చేయడానికి ప్రభుత్వం నిధులు, ఉద్యోగ నియామకాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. నిరుద్యోగ యువతకు గత ప్రభుత్వం భృతి ఇచ్చిందని, నేరుగా నగదు కాకుండా పోటీ పరీక్షలకు అవసరమైన మెటీరియల్‌ ఇవ్వడంతో పాటు ఫీజు చెల్లింపు, రవాణా (బస్సు, రైలు చార్జీలు) చెల్లించే ఏర్పాటుచేయాలన్నారు. ఇంకా విదేశీ విద్య, ఉన్నత చదువులకు అవసరమైన ప్రోత్సాహకాలను అందించడం ద్వారా నిరుద్యోగ పట్టభద్రులకు ఆదుకోవచ్చునన్నారు.

దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం పనిచేయాలి

తాత్కాలిక ప్రయోజనాలు కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలు కోసం ప్రభుత్వాలు పనిచేయాలని అభిప్రాయపడుతూ దీనిపై శాసన మండలిలో ఒత్తిడి తీసుకువస్తానన్నారు. అందుకు ప్రభుత్వం అంగీకరించకపోతే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం వచ్చిన తరువాత శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి జరుగుతుందన్నారు. అటువంటి అభివృద్ధే ప్రతి నిరుద్యోగ పట్టభద్రుడు కోరుకుంటున్నారని అందుకు తాజాగా జరిగిన ఎన్నికల్లో తన విజయమే నిదర్శనమన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు, పింఛన్‌దారులు ప్రభుత్వంలో భాగమేనని పాలకులు గుర్తించడం లేదన్నారు. గడచిన నాలుగేళ్లుగా వారిని ప్రభుత్వం వేధింపులకు గురిచేసిందని ఆరోపించారు. ఒకప్పుడు డిమాండ్లు, కోర్కెలపై నిలదీసిన ఉద్యోగ, ఉపాధ్యాయులు ఇప్పుడు ఒకటో తేదీన జీతాలు వస్తే సరిపోతుందని భావించే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వ పాలనలో ఆర్థిక క్రమశిక్షణ పక్కాగా అమలు చేస్తే ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆర్థిక ప్రయోజనాలు సకాలంలో అందుతాయని పేర్కొంటూ...ఈ అంశం శాసన మండలిలో ప్రస్తావిస్తానన్నారు. దేశంలో పలు రాష్ట్రాల్లో సీపీఎస్‌ రద్దు చేశారని, అదే విధానం రాష్ట్రంలో అమలు చేయాలని ప్రతి సీపీఎస్‌ ఉద్యోగి కోరుకుంటున్నారని చిరంజీవిరావు అన్నారు. దీనికి సంబంఽధించి మండలిలో పోరాటం చేస్తానన్నారు. పాతికేళ్లుగా అధ్యాపక వృత్తిలో వున్న తాను ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడినని చిరంజీవిరావు అన్నారు. టీడీపీ విధానాలు, సిద్ధాంతాల మేరకు పనిచేస్తానని, ఉత్తరాంధ్రలో 34 నియోజకవర్గాల కేడర్‌, నాయకులతో మమేకమవుతానన్నారు. అధినేత చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు పార్టీ కార్యక్రమాల అమలులో భాగమవుతానన్నారు. తన విజయానికి ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల టీడీపీ నాయకులు, కేడర్‌ పనిచేశారని, వారందరికీ రుణపడి ఉంటానన్నారు. తెలుగుదేశం కేడర్‌, నాయకులు, నిరుద్యోగ యువత, ఉపాధ్యాయ, ఉద్యోగ, పింఛన్‌దారులు, మిత్రులకు ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నానన్నారు. ఉత్తరాంధ్రలో నిరుద్యోగ పట్టభద్రులు, టీచర్లు, ఉద్యోగులు, ఇతర వర్గాలకు అందుబాటులో వుండేందుకు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో కార్యాలయాలు ఏర్పాటుచేయాలని ఆలోచన ఉందని, ఈలోగా టోల్‌ఫ్రీ నంబరు ఒకటి అందుబాటులోకి తీసుకువస్తానన్నారు.

------------------

Updated Date - 2023-03-19T00:02:20+05:30 IST