నిరసన హోరు
ABN , First Publish Date - 2023-02-07T00:07:52+05:30 IST
ధర్నాలతో కలెక్టరేట్ దద్దరిల్లింది. నినాదాలతో హోరెత్తింది. నిరసన కారులతో ఆ ప్రాంగణం కిక్కిరిసింది.

సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
మండే ఎండను సైతం లెక్కచేయక.. మూడు గంటల పాటు ఆందోళన
ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్
పార్వతీపురం, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): ధర్నాలతో కలెక్టరేట్ దద్దరిల్లింది. నినాదాలతో హోరెత్తింది. నిరసన కారులతో ఆ ప్రాంగణం కిక్కిరిసింది. ప్రధానంగా జిల్లా నలుమూలల నుంచి పెద్దఎత్తున తరలివచ్చిన అంగన్‌వాడీలు సోమవారం కలెక్టరేట్ ఎదుట మహా ధర్నా చేపట్టారు. తక్షణమే తమ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలని, ముఖహాజరు రద్దు చేయాలని , వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణ మెనూ చార్జీలు పెంచాలని, జీవో నెంబర్ ఒకటిని రద్దుచేయాలని, సీనియర్టీ ప్రకారం వేతనాలు చెల్లించాలని నినాదాలు చేశారు. సూపర్‌వైజర్ పోస్టుల్లో వయోపరిమితి తొలగించాలని, పదోన్నతుల్లో రాజకీయ జోక్యం అరికట్టాలని, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. మండే ఎండను సైతం లెక్కచేయకుండా సుమారు మూడు గంటల పాటు వారు ధర్నా చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ఆనంద్‌కు వినతి పత్రం అందించారు. టీఏ, డీఏలు చెల్లించడం లేదని, సంపూర్ణ పోషణ అమలుకు గత ఆరు నెలల నుంచి బిల్లులు అందించడం లేదని, దీనివల్ల అంగన్‌వాడీలు అప్పులు చేయాల్సి వస్తోందని జేసీకి వివరించారు. ఉద్యోగ భద్రత లేకపోవడంతో కొంతమంది రాజీనామాకు సిద్ధమవుతున్నారని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్ల సంఘం ప్రతినిధులు ఎం.ఉమామహేశ్వరి, సీఐటీయూ నాయకులు ఇందిరా, మన్మథరావు, కె.సాంబమూర్తి, రమణారావు, అంగన్‌వడీ కార్యకర్తలు ,ఆయాలు తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు చేయాలని ..
తమ వద ్ద ఉన్న మిగులు ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. జియ్యమ్మవలస, గరుగుబిల్లి , సీతానగరం, పార్వతీపురం తదితర మండలాల రైతులు కలెక్టరేట్ ఎదుట ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. పండిన పంట ఎక్కడ అమ్ముకోవాలో తెలియక తమ కడుపులు కాలుతున్నాయని తెలిపారు. అన్నదాతలను ఇలా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నించారు. తక్షణమే తమ ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టరేట్‌లో అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. సీపీఎం ,జనసేన తదితర పార్టీల నాయకులు రైతుల నిరసనకు మద్దతు తెలిపారు. ప్రభుత్వం స్పందించకుంటే మిగులు ధాన్యాన్ని కలెక్టరేట్ వద్ద పోగులుగా వేస్తామని వారు హెచ్చరించారు.
గృహ నిర్మాణాలకు నిధులు పెంచాలని ..
జగనన్న కాలనీల్లో గృహ నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు పెంచాలని లబ్ధిదారులు కోరారు. ఈ మేరకు సీపీఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ప్రస్తుతం సర్కారు కేటాయించిన మొత్తం ఏ మూలకు చాలడం లేదని, ఒక్కో గృహ నిర్మాణానికి తక్షణమే రూ.ఐదు లక్షలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర నాయకుడు కామేశ్వరరావు మాట్లాడుతూ.. అప్పులు చేసి లబ్ధిదారులు ఇళ్లు కట్టుకోలేకపోతున్నారని చెప్పారు. దీనిపై సర్కారు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. ఈ నిరసనలో వివిధ మండలాలకు చెందిన గృహ నిర్మాణ లబ్ధిదారులు, సీపీఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
భారీ బందోబస్తు
కలెక్టరేట్ వద్ద పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు జరగడంతో సీఐ కృష్ణమూర్తి, ఎస్‌ఐ ఫకృద్దీన్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అంగన్‌వాడీలు, రైతులు, గృహ నిర్మాణ లబ్ధిదారులు వేర్వేరుగా ఆందోళనలు చేయడంతో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు తగు చర్యలు చేపట్టారు.