2 ఏళ్లు.. 529 గ్రామాలే..

ABN , First Publish Date - 2023-05-27T00:33:36+05:30 IST

జిల్లాలో జల జీవన్‌ మిషన్‌ కింద చేపట్టిన ఇంటింటికీ కొళాయి పనులకు మోక్షం కలగడం లేదు. ఏళ్లు గడుస్తున్నా తుది దశకు చేరుకోవడం లేదు.

2 ఏళ్లు.. 529 గ్రామాలే..
రెయ్యివానివలసలో ఇంటింటి కొళాయిలు ఇలా..

ఏళ్లు గడుస్తున్నా కానరాని పురోగతి

బిల్లుల చెల్లింపుల్లో జాప్యం

మరో ఏడు నెలలో 1,753 పల్లెల్లో పనుల పూర్తిపై సందేహాలు

టెండర్లు పిలుస్తున్నా .. ఎవరూ ముందుకురాని వైనం

కొన్నిచోట్ల ఇంటింటికీ కొళాయిల ఏర్పాటుతోనే సరి

ప్ర‘జల’కు తప్పని కష్టాలు

(పార్వతీపురం- ఆంధ్రజ్యోతి)

జిల్లాలో జల జీవన్‌ మిషన్‌ కింద చేపట్టిన ఇంటింటికీ కొళాయి పనులకు మోక్షం కలగడం లేదు. ఏళ్లు గడుస్తున్నా తుది దశకు చేరుకోవడం లేదు. సకాలంలో బిల్లుల చెల్లింపులు జరగకపోవడమే ఈ పరిస్థితికి కారణంగా తెలుస్తోంది. కొన్నిచోట్ల కొళాయిలు కనిపిస్తున్నా వివిధ కారణాలతో నీరు మాత్రం సరఫరా కావడం లేదు. మొత్తంగా ప్రజల దాహార్తి తీరడం లేదు. మండు వేసవిలో అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. కొన్ని గిరిజన ప్రాంతాల్లో మహిళలు బిందెడు నీటి కోసం మూడు, నాలుగు కిలోమీటర్లు నడిచి పక్క గ్రామాలకు వెళ్లాల్సి వస్తోంది. దీనిపై అటు అధికారులు.. ఇటు ప్రజాప్రతినిధులు స్పందించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వాస్తవంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ కొళాయిలు ఏర్పాటు చేసి తాగునీరు అందించాలనే ఉద్దేశంతో జేజేఎం కింద ఎంతో అట్టహాసంగా ఈ పనులు ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాగా ఉన్న సమయంలోనే వాటికి శ్రీకారం చుట్టారు. దీంతో తమ తాగునీటి కష్టాలు తీరిపోతాయని ఆశించిన గ్రామస్థులకు నిరాశే ఎదురవుతోంది. పనుల్లో పురోగతి కనిపించకపోగా, కొళాయిల ద్వారా ఎప్పటికి తాగునీరు అందుతుందనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. బిల్లుల చెల్లింపులు లేక, టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాకపోవడంతో జేజేఎం పనులు జిల్లాలో నత్తనడకన సాగుతున్నాయి. ఏదేమైనా కేంద్రం తన వాటా కింద నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ, రాష్ట్ర సర్కారు తన వాటా మొత్తం సకాలంలో అందించకపోవడమే ఈ పరిస్థితికి కారణమనే వాదనలు లేకపోలేదు.

ఇదీ పరిస్థితి

- జిల్లాలోని పార్వతీపురం, పాలకొండ, సాలూరు, కురుపాం నియోజకవర్గాల పరిధిలో జీవో నెంబర్‌ 56 కింద రూ. 60.69 కోట్ల అంచనాతో 819 పనులను మంజూరు చేశారు. అయితే ఇప్పటివరకు 522 పనులు మాత్రమే పూర్తి చేశారు. మరో 149 వివిధ దశల్లో ఉన్నాయి. 99 పనులు ఇంకా ప్రారంభం కాలేదు. అదేవిధంగా హాగ్‌ మెంటేషన్‌ జీవో 56 కింద మరో 694 పనులకు రూ.68 కోట్లు మంజూరు చేశారు. ఇందులో కేవలం రూ.96.33 లక్షలు మాత్రమే ఖర్చు చేశారు. కేవలం ఏడు పనులు మాత్రమే పూర్తి చేశారు. 84 పనులు వివిధ దశల్లో ఉండగా 603 పనులు పూర్తిగా ప్రారంభం కాలేదు.

- జిల్లాగా ఏర్పాటైన తర్వాత జీవో నెంబర్‌ 918 కింద మరో 1346 పనులను మంజూరు చేశారు. రూ.365.77 కోట్లతో ఈ పనులను పూర్తి చేయాలనుకున్నారు. అయి తే నేటికీ ఒక్క పని కూడా పూర్తికాలేదు. అత్యధి కశాతం టెండర్లు ప్రక్రియలో ఉన్నాయి. మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నట్లు వైసీపీ నేతలే ప్రకటిస్తున్న నేపథ్యంలో బిల్లుల చెల్లింపులు, పనుల పూర్తిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

సమీపిస్తున్న గడువు..

2,282 గ్రామాలకు ఇంటింటికీ కొళాయిలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పనులను ఈ ఏడాది డిసెంబరు లోగా పూర్తి చేయాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు 529 గ్రామాల్లో మాత్రమే పనులు పూర్తిచేశారు. సుమారు రెండేళ్ల నుంచి పనులు జరుగుతున్నా..కేవలం 529 గ్రామాలకు ఇంటింటికీ కొళాయిలను ఏర్పాటు చేసుకోగలిగారు. ఇందులో అత్యధికంగా జనాభా తక్కువగా ఉన్న గిరిజన గ్రామాలే ఎక్కువగా ఉన్నాయి. మిగిలిన పనులు మరో ఏడు నెలల్లో ఏలా పూర్తిచేస్తారన్నది తెలియని పరిస్థితి నెలకొంది.

నిధుల విడుదల ఇలా..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50 శాతం చొప్పున నిధులు విడుదల చేయాల్సి ఉంది. జేజేఎం పనులకు కేంద్రం నిధులు విడుదల చేస్తున్నప్పటికీ రాష్ట్ర సర్కారు సకాలంలో అందించడం లేదు. దీనివల్ల కేంద్రం కూడా నిధులు మంజూరులో వెనకడుగు వేస్తోంది. జిల్లాలో గత ఏడాది ఆగస్టు నుంచి ఎటువంటి బిల్లుల చెల్లింపులు జరగడం లేదు. సుమారు రూ.10 కోట్ల పైబడి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.

ఎప్పుడు పూర్తి చేస్తారు?

జేజేఎం కింద మంజూరైన పనులను ఎప్పుడు పూర్తి చేస్తారని ఇటీవల జిల్లాకేంద్రంలో జరిగిన అభివృద్ధి సమీక్ష కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ జిల్లా ఇంజనీరింగ్‌ అధికారిని ఇటీవల ఉపముఖ్యమంత్రి రాజన్నదొర ప్రశ్నించారు. అయితే పనులు వివిధ దశల్లో ఉన్నాయని, బిల్లులు చెల్లించాల్సి ఉందని సదరు అధికారి సమాధానమిచ్చారు. త్వరగా పనులు పూర్తి చేయించండి, బిల్లులు చెల్లించే విధంగా తమ వంతు కృషి చేస్తామని డిప్యూటీ సీఎం రాజన్నదొరతో పాటు ఉమ్మడి జిల్లాల జడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో త్వరగా పనులు చేపట్టాలని క్షేత్రస్థాయిలో అధికారులు చెబుతున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. బిల్లుల చెల్లింపులు జరగక పోవడంతో పనుల పూర్తికి కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు.

కొళాయిలు వేసినా..

సాలూరు రూరల్‌: మామిడిపల్లికి కూత వేటు దూరంలో వెంగళరాయసాగర్‌ రిజర్వాయర్‌కు సమీపంలో ఉన్న రెయ్యివానివలస గిరిజన గ్రామానికి జేజేఎంలో భాగంగా ఇంటింటికీ కొళాయిలు వేశారు. వాటి కోసం ప్రత్యేకంగా బోర్‌ తీసి ట్యాంక్‌ను నిర్మించలేదు. రెండు దశాబ్దాల కిందట ఓ స్వచ్ఛంద సంస్థ గ్రామంలో నిర్మించిన వాటర్‌బ్యాంక్‌ ( బావి ), ట్యాంక్‌కు కొళాయిలను అనుసంధానం చేశారు. ఈ వాటర్‌బ్యాంక్‌లో నీరు ఉంటేనే కొళాయిల ద్వారా నీటి సరఫరా జరుగుతుంది. నీరు ఊరకుంటే సరఫరా జరగడం లేదు. రోజూ కొళాయిల నుంచి రోజూ నీరు రాకపోగా, అప్పుడప్పుడు వస్తే డమ్ముల్లో నింపుకొని వాడుకోవాల్సిందే. దీంతో గ్రామస్థులు తాగునీటికి ఇబ్బందులు పడాల్సి వస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో గ్రామానికి అర కిలోమీటరు దూరంలో పొలంలో ఉన్న ఓ బావి నుంచే నీరు తెచ్చుకోవాల్సి వస్తోంది. గ్రామంలో ఉన్న 60 గిరిజన కుటుంబాలకు నిత్యం ఈ అవస్థలు తప్పడం లేదు.

సమస్య పరిష్కరిస్తాం..

రెయ్యివానివలస డ్రై ఏరియాలో ఉంది. బోర్‌ పడడం లేదు. దూరంగా మరో చోట బోర్‌ తీసి పైపులైన్స్‌ వేయాల్సి ఉంది. ఈ సమస్యను డిప్యూటీ సీఎం రాజన్నదొర దృష్టికి తీసుకెళ్లాం. నిధులు మంజూరయ్యాయి. టెండర్లు పిలవాల్సి ఉంది. త్వరలో సమస్య పరిష్కరిస్తాం.

- మహమ్మద్‌ గౌస్‌, ఏఈ, ఆర్‌డబ్ల్యూఎస్‌, సాలూరు

========================

బిల్లులు చెల్లించాలి

జిల్లాలో ఇప్పటివరకు పనులు పూర్తి చేసిన వారికి రూ.9.5 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి ఉంది. జీవో నెంబర్‌ 918 కింద మంజూరైన పనులను టెండర్లు పిలిచాం. అయితే పనులు చేపట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. టెండర్లు దాఖలు చేయడం లేదు.

- ఒ.ప్రభాకర్‌, జిల్లా ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజనీరింగ్‌ అధికారి, పార్వతీపురం మన్యం

Updated Date - 2023-05-27T00:33:36+05:30 IST