పాఠశాలకు సక్రమంగా వెళ్లని బాలిక.. చివరకు నిలదీయగా.. హెచ్ఎం గురించి ఆమె చెప్పింది విని..

ABN , First Publish Date - 2023-01-21T20:54:56+05:30 IST

విద్యా బుద్ధులు నేర్పించాల్సిన గురువే కీచకంగా ప్రవర్తించాడు. 11 ఏళ్ల చిన్నారిని నాలుగు నెలలుగా లైంగికంగా వేధిస్తున్నాడు. ఎవరికి చెబితే ఏమంటారోనన్న భయంతో ఆ బాలిక..

పాఠశాలకు సక్రమంగా వెళ్లని బాలిక.. చివరకు నిలదీయగా.. హెచ్ఎం గురించి ఆమె చెప్పింది విని..

సంతకవిటి: విద్యా బుద్ధులు నేర్పించాల్సిన గురువే కీచకంగా ప్రవర్తించాడు. 11 ఏళ్ల చిన్నారిని నాలుగు నెలలుగా లైంగికంగా వేధిస్తున్నాడు. ఎవరికి చెబితే ఏమంటారోనన్న భయంతో ఆ బాలిక ఇంతవరకూ విషయం బయటపెట్టలేదు. ఆలస్యంగా తెలుసుకున్న తల్లిదండ్రులు, గ్రామస్థులు ఆ ప్రధానోపాధ్యాయుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా (Vizianagaram District) సంతకవిటి మండలం అప్పల అగ్రహారం యూపీ పాఠశాలలో హెచ్‌ఎంగా పనిచేస్తున్న ఎర్రా అప్పలరాజు వ్యవహారమిది. పాఠశాలకు ప్రతిరోజూ క్రమం తప్పకుండా వెళ్లే బాలిక.. రెండు రోజులుగా తరగతులకు హాజరు కావడం లేదు. పొంతనలేని కారణాలు చెబుతూ ఇంటివద్దే ఉండిపోయింది. అనుమానం కలిగిన బాలిక తల్లి శుక్రవారం కూతురును ప్రశ్నించింది. దీంతో బాలిక ఏడుస్తూ తనకు పాఠశాలలో ఎదురవుతున్న ఇబ్బందులను వివరించింది.

ప్రధానోపాధ్యాయుడు నాలుగు నెలలుగా వేధిస్తున్నాడని వాపోయింది. దీంతో తల్లిదండ్రులు కోపోద్రిక్తులయ్యారు. వెంటనే గ్రామంలోని గణేష్‌ యువజన సంఘం సభ్యులు, గ్రామ పెద్దలను సంప్రదించి తమ కుమార్తె పట్ల ప్రధాన ఉపాధ్యాయుడు వ్యవహరిస్తున్న తీరు తెలిపారు. విషయం ఆనోటా ఈనోటా ఊరంతా పాకింది. అందరూ హెచ్‌ఎం తీరును గర్హించారు. శనివారం ఉదయం గ్రామస్థులంతా కలిసి మూకుమ్మడిగా పాఠశాలకు వెళ్లారు. అప్పటికే సమాచారం ఉండడంతో హెచ్‌ఎం ముఖ హాజరు వేసుకుని బయటకు వెళ్లిపోయాడు. గ్రామస్థులు పాఠశాల గేటు ముందు బైఠాయించి నిరసన తెలిపారు. హెచ్‌ఎంను శిక్షించాలంటూ నినాదాలు చేశారు. అప్పలరాజుపై పోలీసులు కేసు నమోదు చేసి.. గాలిస్తున్నారు.

Updated Date - 2023-01-21T20:54:57+05:30 IST