Share News

వచ్చేస్తోంది యువగళం

ABN , First Publish Date - 2023-12-11T01:16:21+05:30 IST

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర సోమవారం సాయంత్రం కాకినాడ జిల్లాలో ముగించుకుని పాయకరావుపేట వద్ద అనకాపల్లి జిల్లాలోకి ప్రవేశించనున్నది. ఈ సందర్భంగా లోకేశ్‌కు ఘనస్వాగతం పలికేందుకు ఉమ్మడి విశాఖ జిల్లా నాయకులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

వచ్చేస్తోంది యువగళం
నారా లోకేశ్‌కు స్వాగతం పలుకుతూ పాయకరావుపేట తాండవ వంతెన వద్ద రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు

నేడే ఉమ్మడి విశాఖ జిల్లాలోకి నారా లోకేశ్‌ పాదయాత్ర ప్రవేశం

సాయంత్రం 5.30 గంటలకు తుని నుంచి పాయకరావుపేటలోకి రాక

ఘనస్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు

మెయిన్‌ రోడ్డు మీదుగా వై.జంక్షన్‌ వద్ద హైవేపైకి చేరిక

అక్కడి నుంచి పీఎల్‌.పురం జంక్షన్‌, సీతారాంపురం జంక్షన్‌ మీదుగా నామవరం చేరిక.. రాత్రి బస

తొలి రోజు ఆరు కిలోమీటర్లు పాదయాత్ర

అనకాపల్లి/ పాయకరావుపేట, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర సోమవారం సాయంత్రం కాకినాడ జిల్లాలో ముగించుకుని పాయకరావుపేట వద్ద అనకాపల్లి జిల్లాలోకి ప్రవేశించనున్నది. ఈ సందర్భంగా లోకేశ్‌కు ఘనస్వాగతం పలికేందుకు ఉమ్మడి విశాఖ జిల్లా నాయకులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాయకరావుపేట తరలిరాలని టీడీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. యువగళం పాదయాత్ర పరిశీలకుడు, అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, పాయకరావుపేట నియోజకవర్గం ఇన్‌చార్జి వంగలపూడి అనిత, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావుల ఆధ్వర్యంలో లోకేశ్‌కు ఘన సాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. యువగళం పాదయాత్ర సందర్భంగా లోకేశ్‌ వివిధ వర్గాల ప్రజల సమస్యలు ఆలకించి, వారి నుంచి విజ్ఞప్తులను స్వీకరించనున్నారు.

నేడు ఆరు కి.మీ.లు పాదయాత్ర

నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రకు సంబంధించి టీడీపీ కేంద్ర కార్యాలయం విడుదల చేసిన షెడ్యూలు ప్రకారం సోమవారం సాయంత్రం 5.30 గంటలకు కాకినాడ జిల్లా తుని పట్టణంలోని గొల్ల అప్పారావు సెంటర్‌ నుంచి తాండవ వంతెన మీదుగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గలోకి లోకేశ్‌ అడుగు పెట్టనున్నారు. అక్కడి నుంచి పాండురంగస్వామి ఆలయం, మెయిన్‌ రోడ్డు, వై.జంక్షన్‌ మీదుగా 6.30 గంటలకు జాతీయ రహదారికి పాదయాత్ర చేరుకుంటుంది. ఏడు గంటలకు పీఎల్‌.పురం జంక్షన్‌, 7.30 గంటలకు సీతారాంపురం జంక్షన్‌, ఎనిమిది గంటలకు నామవరం చేరుకుని జాతీయ రహదారి పక్కన ఒక ప్రైవేటు లేఅవుట్‌లో ఏర్పాటు చేసిన ప్రదేశంలో రాత్రి బస చేస్తారు. అనకాపల్లి జిల్లాలో తొలిరోజు మొత్తం ఆరు కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగుతుంది.

’పేట’లో అట్టహాసంగా స్వాగత ఏర్పాట్లు

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ఘనస్వాగతం పలికేందుకు టీడీపీ నేతలు పాయకరావుపేటలో అట్టహాసంగా ఏర్పాట్లు చేసున్నారు. తాండవ వంతెన నుంచి వై.జంక్షన్‌ వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర మెయిన్‌రోడ్డుకు ఇరువైపులా భారీ స్వాగత ద్వారాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పార్టీ జెండాలు, తోరణాలతో పట్టణం పసుపుమయంగా మారింది. లోకేశ్‌కు పాండురంగస్వామి ఆలయం వద్ద ఉమ్మడి విశాఖ జిల్లా నేతలు స్వాగతం పలకనున్నారు. నియోజకవర్గంలోని ప్రతి మండలం నుంచి పార్టీ శ్రేణులంతా పాయకరావుపేటకు తరలి రావాలని రెండు రోజుల నుంచి గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. లోకేశ్‌ పాదయాత్ర సందర్భంగా పట్టణంలో ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు సీఐ పి.అప్పలరాజు తెలిపారు.

Updated Date - 2023-12-11T01:17:37+05:30 IST