Share News

వైసీపీ పెద్దల సేవలో గ్రేటర్‌

ABN , Publish Date - Dec 14 , 2023 | 01:36 AM

విశాఖపట్నంలో వైసీపీ నాయకులు నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు. వారి వ్యాపారాల అభివృద్ధి కోసం ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఉపయోగించుకుంటున్నారు. జిల్లా, జీవీఎంసీ అధికారులు మారుమాట్లాడకుండా నాయకులు చెప్పిన పనులకు ప్రజాధనం రూ.కోట్లలో కేటాయిస్తున్నారు. సాధారణ ప్రజల సమస్యలు పట్టించుకోని వారు నాయకుల కోసం మాత్రం ఆగమేఘాలపై పనులు చేపడుతున్నారు. ఎన్నికల ప్రకటన రాకముందే ఆయా పనులు ప్రారంభమయ్యేలా హడావుడి పడుతున్నారు.

వైసీపీ పెద్దల సేవలో గ్రేటర్‌
నేవీ హౌస్‌ రహదారి విస్తరణ కోసం రూ.6.64 కోట్ల బడ్జెట్‌

దసపల్లా భూముల్లో రహదారి విస్తరణకు రూ.4.64 కోట్లు కేటాయింపు

రహేజా వ్యాపారం కోసం సీతమ్మధార నుంచి

మారియట్‌ హోటల్‌ వరకు రహదారి విస్తరణ

విశాఖ పోర్టు నుంచి రూ.34.75 కోట్లు

ప్రజాధనం దుర్వినియోగం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నంలో వైసీపీ నాయకులు నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు. వారి వ్యాపారాల అభివృద్ధి కోసం ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఉపయోగించుకుంటున్నారు. జిల్లా, జీవీఎంసీ అధికారులు మారుమాట్లాడకుండా నాయకులు చెప్పిన పనులకు ప్రజాధనం రూ.కోట్లలో కేటాయిస్తున్నారు. సాధారణ ప్రజల సమస్యలు పట్టించుకోని వారు నాయకుల కోసం మాత్రం ఆగమేఘాలపై పనులు చేపడుతున్నారు. ఎన్నికల ప్రకటన రాకముందే ఆయా పనులు ప్రారంభమయ్యేలా హడావుడి పడుతున్నారు.

కొన్ని దశాబ్దాల పాటు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న దసపల్లా భూములను అధికారులను భయపెట్టి వైసీపీ పెద్దలు తీసుకున్నారు. ఇప్పుడు అక్కడ 22 అంతస్థుల భారీ భవన నిర్మాణానికి ప్లాన్‌ సిద్ధం చేశారు. దాని కోసం సర్క్యూట్‌ హౌస్‌ ముందు నుంచి నేవీ హౌస్‌ మీదుగా గ్యాస్‌ గోడౌన్‌ డౌన్‌ వరకూ ఉన్న 40 అడుగుల రహదారిని 100 అడుగులు చేయడానికి నిర్ణయించి, తాజాగా జీవీఎంసీ కౌన్సిల్‌ సమావేశంలో ఆమోదం పొందారు. ఈ రహదారి విస్తరణకు కొద్దిరోజుల ముందే జీవీఎంసీ అభ్యంతరాలు కోరుతూ ప్రకటన ఇచ్చింది. అభ్యంతరాలు వ్యక్తంచేయడానికి ఈ నెల 19వ తేదీ వరకు గడువు ఉంది. కానీ నాయకుల ఒత్తిళ్లకు జీవీఎంసీ అధికారులు లొంగిపోయి కౌన్సిల్‌లో ముందే ఆమోదించేశారు. ఇక్కడ రహదారిని ఒక్కసారిగా 40 అడుగుల నుంచి 100 అడుగులు చేస్తున్నారు. దీనికి రూ.1.96 కోట్లు, కాలువల నిర్మాణానికి మరో రూ.1.61 కోట్లు, డివైడర్‌, దానిపై మొక్కలు, సుందరీకరణ కోసం ఇంకో రూ1.07 కోట్లు...మొత్తం రూ.4.64 కోట్లు కేటాయించారు. అన్ని పనులకు ఒకేసారి గంపగుత్తగా ఆమోదం తెలిపారు. ఈ క్రమంలో గ్యాస్‌ గోడౌన్‌ ఎదురుగా ఉన్న నాల్కో గెస్ట్‌హౌస్‌, పక్కనే అపార్ట్‌మెంట్‌ ఉన్నాయి. వాటిని కూడా తొలగిస్తామని చెబుతున్నారు. ఆ రహదారిలో ట్రాఫిక్‌ రద్దీ పెద్దగా ఉండదు. కానీ వైసీపీ నేతల చేపట్టే ప్రాజెక్టు కోసమే రహదారిని విస్తరిస్తున్నారు.

పోర్టు నుంచి తొలిసారిగా నిధులు

ఇదిలావుండగా కైలాసపురంలో రహేజా కంపెనీ ఇన్‌ఆర్బిట్‌ మాల్‌ నిర్మాణానికి విశాఖపట్నం పోర్టు నుంచి 17 ఎకరాలు దీర్ఘకాలిక లీజుకు తీసుకుంది. దాని కోసం పోర్టు ఆస్పత్రి ముందు 200 అడుగుల వెడల్పున రహదారిని విస్తరించారు. ఈ మాల్‌ శంకుస్థాపనకు సీఎం జగన్‌ వచ్చారు. దీనికి ఏర్పాట్లన్నీ రాష్ట్ర ప్రభుత్వమే చేసింది. స్థానిక నాయకుడు ఒకరు దీనికి ఆ ప్రాంతంలోని వ్యాపారుల నుంచి చందాలు భారీగా వసూలు చేశారు. ఈ మాల్‌ ప్రారంభమైతే ట్రాఫిక్‌ భారీగా ఉంటుందని ముందుగానే దానికి తగినట్టు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం సీతమ్మధారలో అల్లూరి సీతారామరాజు బొమ్మ నుంచి ఎన్‌ఏడీ సమీపానున్న మారియట్‌ హోటల్‌ వరకు రహదారిని 60 అడుగుల నుంచి 80 అడుగులకు పెంచుతున్నారు. దీని పొడవు 8 కి.మీ. ఈ పనులకు విశాఖపట్నం పోర్టు సామాజిక బాధ్యతల నిధుల నుంచి రూ.34.75 కోట్లు కేటాయించడం గమనార్హం. ఈ రహదారిలో కూడా డివైడర్లు, సుందరీకరణ, పార్కులు వంటివి నిర్మించనున్నారు. ఈ రహదారిలో ప్రస్తుతం ట్రాఫిక్‌ చాలా తక్కువ. విస్తరించాల్సిన అవసరం లేదు. కానీ రహేజా కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇదంతా చేస్తోంది. ఇక్కడ కూడా భూ సేకరణ చేయాల్సి ఉంటుంది. ఈ నిధులన్నీ ఎవరు భరిస్తారో మరి.

Updated Date - Dec 14 , 2023 | 01:36 AM