Share News

‘వంతెన, రోడ్ల నిర్మాణంలో వైసీపీ ప్రభుత్వం విఫలం’

ABN , Publish Date - Dec 23 , 2023 | 12:57 AM

వంతెన, రోడ్ల నిర్మాణంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని టీడీపీ చోడవరం నియోజకవర్గ ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీఎస్‌ఎన్‌ రాజు ఆరోపించారు.

‘వంతెన, రోడ్ల నిర్మాణంలో వైసీపీ ప్రభుత్వం విఫలం’
నిరసన దీక్షలో మాట్లాడుతున్న తాతయ్యబాబు

బుచ్చెయ్యపేట, డిసెంబరు 22: వంతెన, రోడ్ల నిర్మాణంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని టీడీపీ చోడవరం నియోజకవర్గ ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీఎస్‌ఎన్‌ రాజు ఆరోపించారు. బీఎన్‌ రోడ్డులో విజయరామరాజుపేట వద్ద కూలిపోయిన తాచేరు, వడ్డాది పెద్దేరు వంతెనలను శాశ్వత ప్రాతిపదికన తక్షణం నిర్మించాలని డిమాండ్‌ చేస్తూ తాచేరు వంతెన వద్ద శుక్రవారం ఇరు పార్టీలు సంయుక్తంగా చేపట్టిన నిరసన దీక్షలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు భీమునిపట్నం-నర్సీపట్నం(బీఎన్‌)రోడ్డు ప్రధాన మార్గమని, రోజూ వందలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ రోడ్డు నరకప్రాయంగా మారిందన్నారు. స్థానిక ఎమ్మెల్యే కె.ధర్మశ్రీ అసమర్థత వల్ల బీఎన్‌ రోడ్డు అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆరోపించారు. వడ్డాది పెద్దేరు వంతెన కూలిపోయి 20 నెలలు గడుస్తున్నా నూతన వంతెన నిర్మాణం చేపట్టకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వంతెన పక్కన కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన కాజ్‌వే అప్రోచ్‌ రోడ్డు మిచౌంగ్‌ తుఫాన్‌ కారణంగా దెబ్బతినడంతో రెండు వారాలుగా కాజ్‌వేపై లారీలు, ట్రాక్టర్లు, బస్సుల రవాణా నిలిచిపోయినా పాలకులు పట్టించుకోకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాజ్‌వేపై రవాణా నిలిచిపోవడంతో మూడు జిల్లాలకు చెందిన ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాగే గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీకి వడ్డాది, రావికమతం, బుచ్చెయ్యపేట, రోలుగుంట మండలాలకు చెందిన చెరకు సరఫరా నిలిచిపోవడంతో రైతులు ఆందోళనలకు గురవుతున్నారన్నారు. దెబ్బతిన్న కాజ్‌వే మరమ్మతు పనులు చేపట్టాలని, తాచేరు, పెద్దేరు నూతన వంతెనల నిర్మాణాలు త్వరగా ప్రారంభించాలని, బీఎన్‌ రోడ్డు అభివృద్ధి పనులను పూర్తి చేసేలా చర్యలు చేపట్టకపోతే టీడీపీ, జనసేన పార్టీలు ప్రత్యక్ష ఆందోళనలను మరింత ఉధృతం చేస్తాయని తాతయ్యబాబు, రాజు హెచ్చరించారు. ఈ నిరసన దీక్షలో చోడవరం మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు, తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గునూరు మల్లునాయుడు, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు శిరిగిరిశెట్టి శ్రీరామూర్తి, టీడీపీ, జనసేన పార్టీల మండలాధ్యక్షులు గోకివాడ కోటేశ్వరరావు, డి.ఎస్‌.నాయుడు, నాయకులు దొండా రమేశ్‌, సింగంపల్లి రమేశ్‌, ముచ్ఛకర్ల తాతయ్యబాబు, దొడ్డి కిశోర్‌, సూరాతి పేరమ్మ, డొంకిన అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 23 , 2023 | 12:57 AM