ఆటోల్లో చోరీలకు పాల్పడ్డ మహిళ అరెస్టు

ABN , First Publish Date - 2023-06-03T00:40:48+05:30 IST

అనకాపల్లి, చోడవరం, బుచ్చెయ్యపేట మా ర్గాల్లో ఆటోల్లో ప్రయాణం సాగిస్తూ మహిళల మెడల్లో బంగారాలను అపహరిస్తున్న ఒక మహిళతోపాటు మరొకరిని స్థానిక సుంకరమెట్ట జంక్షన్‌ వద్ద శుక్రవారం అరెస్టు చేసినట్టు అనకాపల్లి డీఎస్పీ వి.సుబ్బరాజు చెప్పారు.

ఆటోల్లో చోరీలకు పాల్పడ్డ మహిళ అరెస్టు
పట్టుబడిన బంగారంతో విలేకరులతో మాట్లాడుతున్న డిఎస్పీ సుబ్బరాజు

మరొకరు కూడా..

చోరీ సొత్తు స్వాధీనం

డీఎస్‌పీ సుబ్బరాజు

అనకాపల్లి టౌన్‌, జూన్‌ 2: అనకాపల్లి, చోడవరం, బుచ్చెయ్యపేట మా ర్గాల్లో ఆటోల్లో ప్రయాణం సాగిస్తూ మహిళల మెడల్లో బంగారాలను అపహరిస్తున్న ఒక మహిళతోపాటు మరొకరిని స్థానిక సుంకరమెట్ట జంక్షన్‌ వద్ద శుక్రవారం అరెస్టు చేసినట్టు అనకాపల్లి డీఎస్పీ వి.సుబ్బరాజు చెప్పారు. తన కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక ఉడ్‌పేటకు చెందిన నామా మాణిక్యం అనే వృద్ధురాలు గుండాల వద్ద జంక్షన్‌ వద్ద గల యూనియన్‌ బ్యాంక్‌కు గత నెల 26వ తేదీన వెళ్లి తిరిగి ఆటోలో వస్తుండగా మూడు తులాల బంగారం రెండుపేటల తాడు చోరికి గురైందన్నారు. 31వ తేదీన ఆమె ఫిర్యాదు చేసిందన్నారు. అలాగే బుచ్చెయ్యపేట మండలం వడ్డాది బంగారుమెట్ట రోడ్డులో చింతాడ వరలక్ష్మి నుంచి ఐదు తులాల బంగారం, చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి నారాయణపేట మధ్యలో సుంకర చిలకమ్మ నుంచి 4.62 గ్రాముల బంగారం చోరీకి గురైందన్నారు. ఆటోల్లోనే తోటి ప్రయాణికుల మాదిరిగా నేరస్థులు బంగారాన్ని అపహరించుకుపోతున్నట్టు గుర్తించిన పట్టణ సీఐ దాడి మోహనరావు ఆధ్వర్యంలో ఎస్‌ఐ సింహాచలం, సిబ్బంది శుక్రవారం ఉదయం సుంకరమెట్ట జంక్షన్‌ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా విజయనగరం జిల్లా మెంటాడ మండలం పిట్టాడ గ్రామానికి చెందిన గొర్లి మౌనిక ఎలియాస్‌ చింతా మౌనిక (22), మరొకరు అనుమానాస్పదంగా కనిపించారన్నారు. వారి వద్ద బంగారం, వెండి ఉండడంతో విచారణ జరపగా చోరీలకు పాల్పడింది మౌనిక, మరొకరిని అరెస్టు చేశామన్నారు. వీరి నుంచి 93 గ్రాముల బంగారం వస్తువులు, 53 గ్రాముల వెండి పూసలు స్వాధీనం చేసుకున్నామన్నారు. అనంతరం కోర్టుకు తరలించామన్నారు. సమావేశంలో పట్టణ సీఐ దాడి మోహనరావు, ఎస్‌ఐ దివాకర్‌యాదవ్‌ ఉన్నారు.

పోక్సో కేసులో యువకుడి అరెస్టు

అచ్యుతాపురం, జూన్‌ 2: బాలికను మాయమాటలు చెప్పి తీసుకువెళ్లిపోయిన ఖాజీపాలెంకి చెందిన సుంకర రమేష్‌ (23)ను శుక్రవారం అరెస్టు చేసినట్టు పరవాడ డీఎస్పీ కేవీ సత్యనారాయణ తెలిపారు. తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను మాయమాటలు చెప్పి ఏప్రిల్‌ 11న ఇంటి నుంచి రమేష్‌ తీసుకుపోయాడు. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. అచ్యుతాపురం ఎస్‌ఐ సన్యాసినాయుడు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నెలన్నర పాటు గాలించి రమేష్‌ని పట్టుకొని శుక్రవారం అరెస్టు చేసినట్టు ఆయన తెలిపారు.

భవన నిర్మాణ కార్మికుడి మృతి

కోటవురట్ల, జూన్‌ 2: మండలంలోని రాజుపేటలో భవన నిర్మాణ కార్మికుడు పరంజా పై నుంచి జారిపడి మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించి ఎస్‌ఐ నారాయణరావు అందజేసిన వివరాలిలా ఉన్నాయి. నర్సీపట్నం మండలం బలిఘట్టం గ్రామానికి చెందిన యారం నవీన్‌ (40) తాపీమేస్ర్తీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నవీన్‌ గురువారం మండలంలోని రాజుపేట గ్రామానికి చెందిన మొల్లేటి వెంకటరమణ ఇంటి నిర్మాణ పనులు చేసేందుకు వచ్చాడు. ఇంటి పనుల కోసం కట్టిన పరంజా పైనుంచి నవీన్‌ అదుపు తప్పివిద్యుత్‌ వైర్లపై పడడంతో విద్యుత్‌షాక్‌ గురై తీవ్రంగా గాయపడ్డాడు. నవీన్‌ను వైద్యం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. నవీన్‌ భార్య అప్పలనర్స ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృత్యుడు నవీన్‌కి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మృతదేహానికి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.

Updated Date - 2023-06-03T00:40:48+05:30 IST